Featuredజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువిద్యస్టేట్ న్యూస్

నల్లమల ఉద్యమం..

ప్రమాదంలో అభయారణ్యాలు..

  • యురేనియం పేరుతో సర్వేలు..
  • బూడిదగా మారునున్నాయా..?
  • అసలు అక్కడ ఏం జరుగుతోంది..
  • దేశంలో 13 కొత్త గనులు..!
  • రోజురోజుకు పెరుగుతున్న మద్దతు..
దట్టమైన అభయారణ్యాలు.. అరుదైన జంతు జాతులు.. లెక్కలేనన్ని క్రూర మృగాలు.. బోలెడన్ని పులులు.. ఎటుచూసినా కొండలు, లోయలు, ఎత్తైన చెట్లు.. ఇదీ నల్లమల అడవుల స్వరూపం. ఏపీ, తెలంగాణలోని కర్నూలు, మహబూబ్‌నగర్‌, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ పచ్చని అడవులు బూడిదగా మారిపోతాయా? కొండలు, గుట్టలు కరిగి స్మశానంగా రూపాంతరం చెందుతుందా? కీకారణ్యాలు చావు కేక పెడతాయా? దక్షిణ భారత దేశానికే తలమానికంగా ఉన్న నల్లమల అడవులు ప్రమాదంలో పడబోతున్నాయా? అసలు నల్లమలలో ఏం జరుగుతోంది? ఎందుకు ప్రముఖులు, సినీనటులు సేవ్‌ నల్లమల అంటూ ఉద్యమం చేపట్టారు? తదితర ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సిన సమయం వచ్చింది. ఎక్కువగా చదువుకోకున్నా అడవినే తమ తల్లిలా భావించే చెంచులు.. నల్లమలను కాపాడుకోవడానికి ప్రాణాలను ఫణంగా పెట్టేందుకు సిద్ధమవుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ ఉద్యమం ఏ స్థాయికి వెళుతుందో..!సేవ్‌ నల్లమల... తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్న నినాదం. సామాన్యులే కాదు సెలబ్రిటీలు, పొలిటికల్‌ లీడర్లు సైతం దీనిపై గళమెత్తుతురన్నారు. పచ్చటి అడవుల్లో చిచ్చు పెట్టొద్దని సాగుతున్న ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు. సోషల్‌ విూడియా వేదికగా టాలీవుడ్‌ ప్రముఖులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, ఇతర రంగాలవారు స్పందిస్తుండడంతో సేవ్‌ నల్లమల యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. నల్లమలలో యురేనియం తవ్వకలపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తమ బతుకులు నాశనమవుతాయని ఆవేదన  వ్యక్తం చేస్తున్న గిరిజనులు... నల్లమల రక్షించేందుకు పోరుబాట పట్టారు. విపక్షాలు సైతం పోరాటలకు సిద్ధమౌతున్నాయి. మరోవైపు... సోషల్‌ విూడియాలో ప్రారంభమైన సేవ్‌ నల్లమల ఉద్యమానికి సెలబ్రిటీల నుంచి సైతం మద్దతు లభిస్తోంది. యురేనియం తవ్వకాల వల్ల అడవి హరించుకుపోతుందని తెలిసి కూడా ప్రభుత్వం ఎలా అనుమతిచ్చిందని ప్రశ్నిస్తున్నారు పలువురు సెలబ్రిటీలు. పచ్చదనం పెంచుతామంటున్న ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వివరాళ్లోకి వెళితే.. నల్లమలలో యురేనియం తవ్వకాల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతోంది. యురేనియంతో తెలుగు రాష్ట్రాలకు ఊపిరితిత్తులాంటి నల్లమల అడవులు సర్వనాశనమవుతాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అడవి తల్లినే నమ్ముకున్నామని, తమ జీవితాలు ఛిన్నాభిన్నమవుతాయని గిరి పుత్రులు కంటతడి పెడుతున్నారు. యురేనియం తవ్వకాలతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడటమే కాకుండా.. అది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, నల్లమల అడవుల్లో యురేనియం ఉన్నట్లు తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం నిక్షేపాలను గుర్తించేందుకు సర్వేకు అనుమతి ఇచ్చింది.

అక్కడ ఏం జరుగుతుంది…?

నల్లమల అడవుల్లో యురేనియం ఉన్నట్లు తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం నిక్షేపాలను గుర్తించేందుకు సర్వేకు అనుమతి ఇచ్చింది. నల్లమల అడవిలోని కుంచోని మూల నుంచి పదర వరకు మొదటి బ్లాక్‌లో 38 చదరపు కిలో విూటర్లు, పదర నుంచి ఉడిమిల్ల వరకు రెండో బ్లాకులో 38 చదరపు కిలోవిూటర్ల విస్తీర్ణంలో నాలుగు వేల బోర్లు వేసి, నమూనాలు సేకరించేందుకు భారత అణుశక్తి సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు అనుమతులు రావడంతో అచ్చంపేట, అమ్రాబాద్‌.. అటవీశాఖ అధికారులు, సిబ్బంది కలిసి వారం రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. డ్రిల్లింగ్‌ యంత్రాలు తీసుకు వచ్చేందుకు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేస్తున్నారు. యురేనియం సర్వే గురించి తెలియగానే మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, విపక్ష నేతలు రంగంలోకి దిగారు. నల్లమలలో పర్యటించి, యురేనియం తవ్వకాల వల్ల కలిగే చెడు పరిణామాలపై స్థానికులకు వివరించి, వారిని చైతన్యవంతుల్ని చేశారు. యువజన, కుల సంఘాల నాయకులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు.

చెంచులు, స్థానికులు ఏకమై.. తమ ప్రాణాలను అడ్డు పెట్టయినా అడవిని, తమ అస్థిత్వాన్ని కాపాడుకుంటామని శపథం చేస్తున్నారు. బృందాలుగా రోడ్లపైకి వచ్చి రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నారు. ప్రధానంగా మన్ననూర్‌.. చెక్‌ పోస్టుతోపాటు అమ్రాబాద్‌ మండల కేంద్రంలోనూ యురేనియం వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో అడ్డా వేస్తున్నారు. యురేనియం ముసుగులో నల్లమలను నాశనం చేయడం ద్వారా ప్రభుత్వమే తమకు మరణ శాసనం రాస్తోందంటూ, మూగ జీవాల ప్రాణాలను ఫణంగా పెట్టబోతోందంటూ విమర్శిస్తున్నారు. నల్లమలను ఏ విధంగా కాపాడుకోవాలో తమకు తెలుసని, ఊరికే చేతులు కట్టుకొని ఉండబోమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. యురేనియం మైనింగ్‌ వల్ల అడవి చుట్టూ ఉన్న కృష్ణానది కలుషితం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి సినీ నటులు కూడా మద్దతు ఇస్తుండటం గమనార్హం.

దేశంలో 13 కొత్త గనులు: యురేనియం కార్పొరేషన్‌

దేశంలో యురేనియం ఉత్పత్తిని నాలుగు రెట్లు పెంచుతున్నట్టు యురేనియం కార్పొరేషన్‌ చెబుతోంది. ఈ ఏడాది జూన్‌ నెలలో యురేనియం కార్పొరేషన్‌ ఎండీ సీకే అస్నానీ విూడియా ముందు అనేక విషయాలు చెప్పారు. దేశవ్యాప్తంగా మొత్తం 13 కొత్త గనులు ఏర్పాటు చేస్తామనీ, ఉన్న వాటిని విస్తరిస్తామనీ ఆయన చెప్పారు. తెలంగాణతోపాటూ, రాజస్థాన్‌లోని రోహిల్‌, కర్నాటకలోని గోగి, ఛత్తీస్‌గఢ్‌లోని జజ్జన్‌ పూర్‌ ప్రాంతాల్లో ఈ గనులు రానున్నాయి. ఒకవైపు అమ్రాబాద్‌ వద్ద జనం ఆందోళన కొనసాగిస్తుండగా, మరోవైపు నల్లగొండలో యురేనియం తవ్వకాలకు ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. 1995లోనే యురేనియం కార్పొరేషన్‌ పెద్దగుట్టలో సర్వే జరిపింది. ఇక్కడ 18 వేల టన్నుల ఖనిజం ఉన్నట్టు భావించింది. 2003 ఆగస్టు 8న దీనిపై నల్లగొండ కలెక్టర్‌ ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. 2005, 2008లో కూడా నల్లగొండలో స్థానికులను యురేనియం తవ్వకాలకు ఒప్పించేందుకు ప్రయత్నాలు జరిగాయి. గతంలో 2001లో నల్లగొండ జిల్లా చిత్రియాల్‌, పెద్దగట్టు బ్లాకుల్లో 20 చదరపు కిలోవిూటర్ల విస్తీర్ణంలో సర్వే చేశారు. 2009లో మళ్లీ చిత్రియాల్‌లో 50 చ.కి.విూ. మేర సర్వే చేశారు. అప్పటి సర్వేల ఫలితాలతో ఇప్పుడు మైనింగ్‌ చేయబోతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని లాంబాపూర్‌ – పెద్దగట్టు ప్రాంతంలో ఒక ఓపెన్‌ పిట్‌, మూడు అండర్‌ గ్రౌండు మైన్లను, వాటికి 48 కి.విూ. దూరంలో యాసిడ్‌ లీచింగ్‌ పద్ధతిలో యురేనియం ప్రాసెస్‌ చేసే ప్లాంటు ఏర్పాటు చేయబోతున్నట్లు యురేనియం కార్పొరేషన్‌ తన వెబ్‌ సైట్లో ప్రకటించింది. చిత్రియాల్‌లో సర్వే పూర్తయ్యాక మైనింగ్‌ అనుమతులు వచ్చినట్టే అమ్రాబాద్‌లోనూ జరుగుతుందేమోనన్న భయం స్థానికుల్లో ఉంది. 2016 నాటి తెలంగాణ అటవీ అధికారుల నివేదికతో నిమిత్తం లేకుండా 2019లో భారత అటవీ సలహా మండలి (ఫారెస్ట్‌ అడ్వైజరీ కమిటీ) నల్లమలలో యురేనియం సర్వేకు అనుమతులు ఇవ్వడం స్థానికుల భయాన్ని పెంచింది. ఫారెస్ట్‌ అడ్వైజరీ కమిటీ 2019 మే 22 నాటి సమావేశంలో ఈ అంశంపై చర్చించింది. మొత్తం 83 చదరపు కి.విూ. విస్తీర్ణంలో (నాగార్జునసాగర్‌ వైల్డ్‌ లైఫ్‌ మేనేజ్‌మెంట్‌ డివిజన్లో 7 చ.కి.విూ., అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో 76 చ.కి.విూ.) యురేనియం సర్వే, ఎక్స్‌ప్లొరేషన్‌ కోసం దక్షిణ భారత ప్రాంతీయ అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ అనుమతి కోరింది. జాతీయ ప్రాధాన్యం దృష్ట్యా సూత్రప్రాయ అనుమతి ఇచ్చింది ఫారెస్ట్‌ అడ్వైజరీ కమిటీ. పూర్తి వివరాలూ పత్రాలూ ఇచ్చాక తుది అనుమతులపై నిర్ణయం ఉంటుందని తెలిపింది. నిర్దేశిత ఫార్మాట్లో (ఫామ్‌ సీ) సమాచారం ఇవ్వాలంటూ కేంద్ర అటవీ శాఖ డీఐజీ నరేశ్‌ కుమార్‌ జూన్‌ 19న తెలంగాణ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. అణు ఇంధన సంస్థ అటవీ శాఖకు సమర్పించిన నివేదికలో కొన్ని వివరాలున్నాయి. ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా పరిధిలోని అమ్రాబాద్‌, ఉడిమల్లలో, ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని నారాయణపూర్‌లో బోర్లు వేసి యురేనియం వెలికితీతపై పరిశోధనలకు అనుమతి కోరారు. మొత్తం 37 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. అమ్రాబాద్‌లో 38 చ.కి.విూ., ఉడిమిల్ల 38 చ.కి.విూ., నారాయాణపూర్‌ 3 చ.కి.విూ., నారాయణపూర్‌ బ్లాక్‌ 2 లో 4 చ.కి.విూ. స్థలంలో చేస్తామన్నారు. ఈ ప్రక్రియకు అసలు పునరావాసం సమస్య ఉత్పన్నం కాదనీ, తాము తవ్వకాలు జరపాలనుకుంటున్న ప్రాంతంలో గిరిజనులుగానీ, ఇతర కుటుంబాలుగానీ లేవని నివేదికలో రాశారు. అడవులకు కూడా ఎలాంటి నష్టం రాదని అణు ఇంధన సంస్థ దక్షిణ ప్రాంతీయ డైరెక్టర్‌ ఎంబీ వర్మ తన నివేదికలో రాశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close