నటుడు గిరీష్‌ కర్నాడ్‌ కన్నుమూత

0

అనారోగ్యంతో బాధపడుతూ మృతి

  • తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించిన గిరీష్‌ కర్నాడ్‌
  • సంతాపం తెలిపిన ప్రధాని, రాష్ట్రపతి, కర్ణాటక సీఎం
  • నివాళులర్పించిన సినీ ప్రముఖులు
  • కర్ణాటకలో మూడురోజుల సంతాపదినాలు

బెంగళూరు : ప్రముఖ నటుడు, రచయిత గిరీష్‌ కర్నాడ్‌ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులో తననివాసంలో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించి మెప్పించారు. పలు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. రచయితగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ్‌ అవార్డు ఆయనకు వరించింది. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్‌ అవార్డులతో సత్కరించింది. గిరీష్‌ కర్నాడ్‌ పూర్తి పేరు గిరీష్‌ రఘునాత్‌ కర్నాడ్‌. 1938లో మే 19న మహారాష్ట్రలోని మథేరన్‌ ప్రాంతంలో జన్మించారు. నలభై ఏళ్ల సినీ కెరీర్‌లో నటుడిగా, దర్శకుడిగా, రచయితగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. నాలుగు ఫిలింఫేర్‌ అవార్డులు కూడా అందుకున్నారు. తెలుగులో ‘ధర్మచక్రం’, ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’, ‘కొమరం పులి’ చిత్రాల్లో నటించారు. ఆయన ఎక్కువగా కన్నడ, హిందీ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. గిరీష్‌ చివరిగా నటించిన చిత్రం ‘అప్నా దేశ్‌’. కన్నడలో తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 26న విడుదల కాబోతోంది. కర్నాడ్‌కు భార్య సరస్వతి, కుమారుడు రఘు, కుమార్తె రాధ ఉన్నారు.

బహుభాషా కోవిదుడు కర్నాడ్‌..

భారతీయ కళలు, సంగీతం, సాహిత్యం, నృత్యనాట్యాలు, జానపద సంస్కృతి రూపాలతో పాటు ప్రాచుర్యంలో ఉన్నసాహిత్య పక్రియలపై అనితర సాధ్యమైన అవగాహన ఉన్న మేధావి గిరీష్‌ కర్నాడ్‌. భారతీయ భాషలలో మాట్లాడగల, చదవగల బహుభాషా కోవిదుడాయన. ఆయన తలుచుకుంటే భారతదేశపు సాంస్కృతిక చరిత్రపై ఒక అమోఘమైన గ్రంథాన్ని రాయగలరని విశ్లేషకుల అభిప్రాయం. కర్నాడ్‌ తన ఆత్మకథను కన్నడలో రాసుకున్నారు. ఆ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించడానికి ఆయనే ఒప్పుకోలేదట. తన రాజకీయాలను చాటుకోవడం, దేశభక్తిని ప్రదర్శించే అంశాలకు కర్నాడ్‌ దూరంగా ఉంటారు. అయినప్పటికీ తనదైన రీతిలో స్వస్థలం పట్ల ప్రగాఢమైన ప్రేమను చూపుతారు. పుట్టిన ప్రదేశం అభివృద్ధి కోసం అంకిత భావంతో కృషి చేశారు. ఇదిలాఉంటే తన అభిప్రాయాలను ఎలాంటి మొహమాటాలు, సంకోచాలు లేకుండా స్పష్టంగా వ్యక్తం చేసే వ్యక్తి గిరీష్‌ కర్నాడ్‌. ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ్‌ అవార్డును అందుకున్న ఏడో కన్నడ రచయిత ఆయన. కర్నాడ్‌కు ఈ అవార్డు వచ్చిందని తెలీగానే.. నాటక రచనలో, సాహిత్య పక్రియల్లో తనకన్నా గొప్పగా కృషి చేసిన వారున్నారని, ఈ అవార్డు వారిలో ఎవరికి వచ్చినా మరెంతో సంతోషించేవాడినని ఓ సందర్భంలో అన్నారాయన. అయితే తనకంటే ముందు ఆరుగురు ప్రముఖులు జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు అందుకున్న విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ.. ఇది కన్నడిగులందరికీ గర్వకారణమే అని పేర్కొన్నారు.

కర్నాడ్‌ మృతికి రాష్ట్రపతి, ప్రధాని నివాళి..

గిరీష్‌ కర్నాడ్‌ మృతి పట్ల కన్నడ, తెలుగు, హిందీ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు నటులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. పలువురు కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. కాగా గిరీశ్‌ కర్నాడ్‌ మృతిపట్ల వార్త తెలుసుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీలు సంతాపం ప్రకటించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి కర్నాడ్‌ మృతి భాతీయ సాంస్కృతిక రంగానికి తీరని లోటని రాష్ట్రపతి ట్వీట్‌ చేశారు. ప్రధని మోదీ ట్వీట్‌ చేస్తూ.. బహుభాషా నటుడిగా ఆయన సేవలు నిరుపమానం అన్నారు. సామాజిక సమస్యలపై గొంతెత్తేవారని.. భవిష్యత్‌ తరాలూ ఆయనను గుర్తు చేసుకుంటాయన్నారు. కర్నాడ్‌ మృతి బాధాకరమని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నట్టు ట్వీట్‌ చేశారు. అదేవిధంగా కర్నాడ్‌ మృతిపట్ల కర్ణాటక సీఎం కుమారస్వామి సంతాపం ప్రకటించారు. ఆయన మృతికి సంతాపంగా ఒక రోజు సెలవు, మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించారు సీఎం కుమారస్వామి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here