Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

దోస్తున్నారు.. దేశం దాటుతున్నారు..

మూడు నెలల్లోనే ముప్పైరెండు వేల కోట్ల దోపిడీ

లూటీ చేస్తున్న బడా పారిశ్రామికవేత్తలు..

ఒక్కరూపాయి కూడా రికవరీ లేదు..

ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలే లేవు..

అంతా బడా పారిశ్రామికవేత్తలే.. దేశాన్ని ఎక్కడికో తీసుకెళదామంటారు.. పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి వందల, వేల మందికి ఉపాధి కల్పిస్తామంటారు.. డబ్బులు లేకున్నా మరీ మరీ అప్పులు తెస్తారు.. పేదవాడు రూపాయి, రూపాయి కూడపెట్టిన బ్యాంకులు నుంచి వేల కోట్లను అప్పనంగా దోచుకుంటారు. రాచమర్యాదలు, అధికార దర్పణాలు, రాచమర్యాదలు అంగరంగ వైభవంగా తనివితీరా అనుభవిస్తారు.. అప్పులు ఇచ్చినా బ్యాంకులు డబ్బులు అడిగేసరికి మాత్రం దుకాణం ఎత్తేసి, వేల కోట్ల రూపాయలను ముంచేసి దేశాన్ని వదిలి పారిపోతారు.. వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి వెళ్లినవారు విదేశాల్లో జల్సాలు చేస్తున్నారు కాని మన ప్రభుత్వాలు ఒక్కరంటే ఒక్కరిని కూడా వెనక్కి తీసుకొచ్చిందీ లేదు.. వేల కోట్ల బకాయిలను వసూలు వేసిందీ లేదు.. ప్రభుత్వాలు తమకేమి పట్టనట్లుగా ఉండడంతో బ్యాంకులు సొమ్మును, ప్రజల సొమ్మును దొచుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది.. దండించే ప్రభుత్వమే చూసిచూడనట్లు వదిలేయడంతో దోచుకుంటున్న బడా పారిశ్రామికవేత్తలకు మన దేశంలో కోదువే లేదు.. గతంలో ఎంతోమంది మొండి బకాయిదారులను చూసిచూడనట్లుగానే వదిలేశారు. ఎంత దోచుకున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఏలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆర్థిక మోసగాళ్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది.. మూడు నెలల్లోనే ముప్పైరెండు వేల కోట్లు రుణాలను ఎగ్గోట్టి తమకేమి సంబంధంలేనట్లుగా దేశాన్ని వదిలిపోతున్న బడా ఆర్థిక మోసగాళ్లపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం మౌనంగా చూస్తూనే ఉంది.

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌..

బడా పారిశ్రామికవేత్త లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా బ్యాంకులకు ఎనిమిది వేల కోట్లకు పైగా ఎగనామం పెట్టి దేశం వదిలి బ్రిటన్‌ పారిపోయాడు. ఆ తర్వాత ఈయనను మించిన మరో బడా పారిశ్రామిక ఆర్థిక నేరస్థుడు నీరవ్‌ మోడీ పన్నెండు వేల కోట్లు జాతీయ బ్యాంక్‌లకు టోకరా పెట్టి ఆయన కూడా దేశం వదిలి ఇతర దేశాలకు పారిపోయాడు. అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇతర దేశాల్లో ఉన్న నల్లధనాన్ని బయటికి తేవడమే ప్రధాన లక్ష్యమని చెప్పింది. కాని నల్లధనం మాట దేవుడెరుగు కనీసం బ్యాంకులకు ఎగనామం పెట్టి దేశం వదిలి పోతున్నవారినైనా పట్టుకొద్దామనే ఆలోచన చేయడం లేదు. ప్రభుత్వం ఎంత దోచుకున్న ఏలాంటి చర్యలకు పూనుకోవడం లేదని ఎవరికి వారుగా బడా ఆర్థిక మోసగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. కాని ప్రభుత్వం ఒక్కరిని కూడా ఇండియాకు తీసుకొచ్చిందీ లేదు. ఒక్కరి దగ్గర కూడా రూపాయి రికవరీ చేసిందీ లేదు. వేల కోట్లు రూపాయలు ఎగనామం పెట్టి దేశం దాటి పోయినా ఏ ఒక్కరిపై కనీస శిక్షలు విధించలేదు. బ్యాంకులలో పేదవాళ్లు దాచుకున్న సొమ్మును అప్పనంగా అప్పులు తీసుకుంటూ బోర్డులు తిప్పేసి విదేశాల్లో వారు ఎంజాయ్‌ చేస్తున్నారు.

భారీగా పెరుగుతున్న ఆర్థిక మోసగాళ్లు..

మన దేశంలో ఎవరూ ఎంతైనా దోచుకోవచ్చు. పేదవాళ్లు, రైతులు వేల రూపాయలు అప్పులు తీసుకుంటే మాత్రం మరీ మరీ పీడించి వసూలు చేసే అధికారులు వేల కోట్ల రూపాయలను బకాయిల పడ్డ వారిని మాత్రం ఏం చేయకుండా ఉంటుంది. బ్యాంకులను ముంచడమే వారి పనిగా పెట్టుకుంటున్నారు. ఇండియా దాటి వెళ్లిపోయిన వారు వెళ్లిపోగా, ఇండియాలో ఉన్నవారు కూడా ఎగవేతదారులు మాత్రం ఆగడమే లేదు. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ ఒకటి నుంచి జూన్‌ ముప్పై వరకు తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీ మోసాలు వెలుగుచూశాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త భారత రిజర్వ్‌ బ్యాంక్‌ను సమాచార హక్కు చట్టం ద్వారా బ్యాంకు మోసాలపై దరఖాస్తు చేయగా కళ్లు చెదిరే మోసాలు బయటపడ్డాయి.

మూడు నెలల్లోనే వేల కోట్లు స్వాహా..

ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ బ్యాంకులకు ఏకంగా 31898 కోట్లు అంటే దాదాపు 32వేల కోట్ల మేర మోసాలు జరిగినట్టు ఆర్బీఐ తాజాగా సమాచార హక్కు చట్టం ద్వారా తెలిపింది. ఇందులో అత్యధికంగా 38శాతం మోసాలు అంటే 12012 కోట్లు, 1197 మోసాలు ఒక్క రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలోనే జరిగాయని ఆర్బీఐ తెలిపింది. ఆ తర్వాత అలహాబాద్‌ బ్యాంకులో రూ. 2855 కోట్లను 381మంది మోసం చేసి కొల్లగొట్టారని, మూడో స్థానంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 99మోసాలు జరిగి 2526 కోట్లు మోసపోయాయని చెపుతున్నారు. ప్రభుత్వం అలసత్వం, చాతకాని తనం వల్ల బ్యాంకు మోసాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మోసగాళ్లు మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. బ్యాంకులు దివాళా తీస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మోసగాళ్లు వల్ల నిజమైన లబ్దిదారులను కూడా బ్యాంకులు నమ్మే పరిస్థితి లేకుండా పోతోంది. అందుకే బ్యాంకర్లు కొత్త వారికి, అసలైనా లబ్దిదారులకు రుణాలు ఇవ్వడానికి తటపటాయిస్తున్నాయి. బ్యాంకులను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మోసం చేసిన వారిని ప్రభుత్వం కఠినమైనా శిక్షలు విధిస్తేనే మరొకరు మోసం చేయడానికి ఆలోచిస్తారు. కాని కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు తీసుకొని ఉడాయిస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం అక్రమార్కులపై కఠినచర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close