స్టేట్ న్యూస్

జూన్ 8,9 తేదీలలో చేప ప్రసాద పంపిణీ

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు జూన్ 8,9 తేదీలలో చేప ప్రసాద పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్భంది ఏర్పాట్లు చేపట్టాలని పశుసంవర్ధక శాఖామాత్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. చేప ప్రసాద పంపిణీ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్ కె.జోషి తో కలిసి మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బత్తిని హరినాధ్ గౌడ్ కుటుంబీకులు 173 సం.ల నుండి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారని, దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి దాదాపు 3 లక్షల మందికి పైగా ప్రజలు వస్తారని గత సంవత్సరం కంటె మెరుగ్గా ఏర్పాట్లు చేయాలని మంత్రి కోరారు. జూన్ 8 సాయంత్రం 6 గంటల నుండి 9 సాయంత్రం 6 గంటల వరకు చేప ప్రసాద పంపిణీని చేపడతామన్నారు. వివిధ శాఖలు సమన్వయంతో పని చేయడానికి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కంట్రోల్ రూం ను ఏర్పాటు చేస్తున్నామని, ప్రస్తుత వేసవిని దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అదనంగా మంచినీరు, వైద్యసదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. పోలీసు శాఖ అధికారులు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని ట్రాఫిక్, బ్యారికేడింగ్, సిసిటీవిల ఏర్పాట్లు చేయాలన్నారు. అగ్నిమాపక నిరోధక వ్యవస్ధకు తగు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అవసరమైన చేప పిల్లలను అందుబాటులో ఉంచుతామన్నారు. జిహెచ్ఎంసి ద్వారా పారిశుద్ధ్యం, మొబైల్ టాయిలెట్స్, 5 రూపాయల భోజనం, అదనపు సిబ్బంది, రోడ్లకు రిపేర్లు చేపట్టాలన్నారు. మెట్రోవాటర్ వర్క్స్ ద్వారా మంచినీటి ప్యాకెట్లు, మంచినీటి సరఫరాకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఆర్ అండ్ బి ద్వారా బ్యారికేడింగ్, జనరేటర్లు లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ శాఖ ద్వారా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలన్నారు. సమాచార శాఖ ద్వారా PA సిస్టం, ఎల్ ఈ డి స్క్రీన్స్ ఏర్పాటు, మీడియాకు పాస్ లు అందివ్వాలన్నారు. ఆర్టీసి ద్వారా ఎయిర్ పోర్ట్స్, బస్ స్టాండ్స్, రైల్వేస్టేషన్ల లతో పాటు వివిధ ప్రాంతాలనుండి 150 బస్ లను నడుపుతున్నట్లు తెలిపారు. విజయడైరీ స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. క్షేత్ర స్ధాయిలో పనుల పరిశీలనకు జూన్ 4 వ తేది ఉదయం 11 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సమావేశం అవుతామన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె జోషి మాట్లాడుతూ చేప ప్రసాద పంపిణీని విజయవంతంగా నిర్వహించడానికి వివిధ శాఖల అధికారులు సిద్ధంగా ఉన్నారని తగు లే అవుట్ ను రూపొందించుకొని సమన్వయంతో పనులు చేపడతామన్నారు. ఫైర్ సేప్టీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రజలు ఎటువంటి అందోళన చెందకుండ అందరికి చేప ప్రసాదం పంపిణి అందేలా ఏర్పాట్లు ఉంటాయన్నారు.
జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా మాట్లాడుతూ మంత్రి గారి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు పని చేస్తారని, హైదరబాద్ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమీషనర్, జిహెచ్ఎంసి కమీషనర్లు స్ధానికంగా సమీక్షించి పనులు పూర్తి చేస్తారని అన్నారు.
ఈ సమావేశంలో జిహెచ్ఎంసి కమీషనర్ దానకిషోర్, నగర పోలీస్ కమీషనర్ అంజనీకుమార్, ఫైర్ సర్వీసెస్ డిజి గోపికృష్ణ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మాణిక్ రాజ్, ఫిషరీస్ కమీషనర్ సువర్ణ, తో పాటు బత్తిని హరినాధ్ గౌడ్ కుటుంబీకులు పాల్గొన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close