Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలు

జరిగిపోయిన ‘జఠిల’మానీ

◆ అత్యధిక ఫీజు – హై ఫై కేసులు
◆ స్పెషల్ ఫ్లైట్లలో ప్రయాణం
◆ ఒక రూపాయితో ఆర్థిక ప్రయాణం

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, న్యూఢిల్లీ, ఆదాబ్ హైదరాబాద్)

దేశ విభజన వేళ ముంబైకి వచ్చినప్పుడు రాంజెఠ్మలానీ జేబులో ఉన్న డబ్బు కేవలం ఒక ఒక్క రూపాయి నోటు. ‘‘… నా దగ్గరకు వచ్చిన క్లయింటు దొంగా..? గుండా..? రౌడీ..?స్మగ్లరా..? హంతకుడా..? మాఫియా లీడరా..? స్కాంస్టరా..? గ్యాంగ్ స్టరా..?ఎవరైతేనేం..? నేను తన తరఫున వాదిస్తాను. గెలిపించటానికే ప్రయత్నిస్తాను. అది నా వృత్తి… ఆ నేరాల్ని, ఆరోపణల్ని నిరూపించే బాధ్యత ప్రాసిక్యూషన్ వాళ్లది. నిజం తేల్చాల్సింది కోర్టు…’’ అంటూ వృత్తి ధర్మాన్ని మాత్రమే చాటాడు. దేశంలోకెల్లా అత్యంత ఎక్కువ ఫీజు తీసుకునే సుప్రీం న్యాయవాది రాంజెఠ్మలానీ నమ్మిన సూత్రమిదే..! దీనికి వ్యతిరేకంగా ఎవరు ఏమైనా వాదించనివ్వండి… జస్ట్, ఆయన నవ్వి విననట్టుగా ఉండిపోతాడు. అసలు విమర్శ అంటేనే ప్రాణం. దేశాన్ని కుదిపేసిన అనేక “హై ఫై” కేసుల్లో నిందితులు తన క్లయింట్లు.
ఎవరేం అనుకున్నా… చివరకు జాతి ఈసడించుకునే బోలెడు మంది నేరస్థులు, నిందితుల తరఫున ఆయనే లాయర్. విచిత్రం ఏమిటంటే ఆయన ఎదుర్కొన్న ఓ కేసులో ఆయన తరఫున వాదనలకు రికార్డు స్థాయిలో ఏకంగా 300 మంది న్యాయవాదులు హాజరయ్యారు. ఊసరవెల్లి లాంటి రాజకీయ నాయకులకు సైతం చేతకాని వైనం ఆయన సొంతం. పార్టీలో జెండా పాతడం – పీకడం, మళ్ళీ పాతడం – పీకడంలో ఆయనకు ఆయనే సాటి. భారతీయ న్యాయచరిత్రలో రాంజెఠ్మలాని చరిత్ర ఓ అధ్యాయం, ఓ పాఠం. పోయినోళ్ళు ఉన్న వాళ్ళ తీపిగురుతులు మాత్రమే కాదు.. చాలామందికి ఆయన చేదు గురుతు కూడా…రాష్ట్రపతి కావాలనే కోరిక తీరకుండానే ఆదివారం జరిగిపోయాడు.

18 ఏళ్ళకే ‘లా’యర్ :
పుట్టింది శికార్‌పూర్ (ఇప్పుడు పాకిస్థాన్ లో ఉంది). చదువులో డబుల్ ప్రమోషన్ పొంది, 17 ఏళ్లకే లా కోర్సు పూర్తిచేశాడు. 21 ఏళ్లు నిండితే గానీ లాయర్ ప్రాక్టీసుకు అప్పట్లో అర్హత లేదు. అదుగో దానిమీదే ఫైట్ చేసి 18 ఏళ్లకే లాయర్ అయ్యాడు. 75 ఏళ్లు సుదీర్ఘ కెరీర్. మామూలు మనిషి కాదు. అది మామూలు బుర్ర కాదు. కోర్టుకు ఆయన హాజరవుతున్నాడు అంటే ఓ హడావుడి, ఓ హడల్… తన లెవల్ అదీ… పెద్ద పెద్ద జడ్జిలు కూడా లేచి విష్ చేసే లెవల్. వివిధ రాష్ట్రాల హైకోర్టులకు స్పెషల్ ఫ్లయిట్లలో వెళ్లి మరీ వాదించేంత పాపులారిటీ, సక్సెస్ రేటు తన సొంతం.

“స్మగ్లర్ల్ లాయర్”:
అరవై దశకంలో ఎక్కువగా స్మగ్లర్ల కేసులు జెఠ్మలానీ వాదించేవాడు. తనను ముంబైలో స్మగ్లర్ల లాయర్ అని పిలిచేవాళ్లు.

ఆయన కేసుకు 300మంది లాయర్లు:
ఎమర్జెన్సీ సమయంలో ఇండియా బార్ అసోసియేషన్ ఛైర్మన్ గా ఉన్నారు. ఛాన్స్ తీసుకొని ఇందిరాగాంధీని ఘాటుగా విమర్శించేవాడు. ఇది.మండి ఓ నాయకుడు జెఠ్మలానీపై కేరళ కోర్టులో పరువునష్టం కేసు వేశాడు. అప్పుడు…. అరెస్టు వారెంటు వచ్చింది. ఆయన తరఫున బాంబే హైకోర్టులో నానీ పాల్కీవాలా నేతృత్వంలో ఏకంగా 300 మంది లాయర్లు ‘వాదించారు’. తరువాత కెనడాకు ప్రవాసంలోకి వెళ్లిపోయి, ఎమర్జెన్సీ ఎత్తేశాక గానీ భారత్ రాలేదు.

కష్టపడి వస్తాడు…ఇష్టపడి పోతాడు:
రాజకీయులు సైతం చేయలేని సహసాలు ఆయన రాజకీయ జీవితంలో ఉంటాయి.
పలుసార్లు లోకసభకు, రాజ్యసభకు ఎన్నికైన తను భాజపాలోకి వస్తూనే ఉంటాడు.. పోతూనే ఉంటాడు. టిపికల్ కేరక్టర్… వాజపేయి ప్రభుత్వంలో మంత్రి… సీన్ కట్ చేస్తే, మళ్లీ వాజపేయిపైనే పోటీ చేశాడు… అద్వానీ మనిషి అని పార్టీలో పేరు… వాజపేయి మీద పోటీచేసినా సరే, మళ్ళీరాజ్యసభకు ఆ పార్టీ తరఫునే ఎన్నికయ్యాడు. (ఎంత తెలివి ఉండాలి).
ఓ దశలో సుప్రీం చీఫ్ జస్టిస్‌తో, అటార్నీ జనరల్‌తో కొట్లాటలే కొట్లాటలు. ఇది భరించలేక సౌమ్యుడైన వాజపేయి జెఠ్మలానీతో మంత్రి పదవికి రాజీనామా చేయించి రిలాక్స్ అయ్యాడు.
నితిన్ గడ్కరీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, పార్టీ వ్యతిరేక వ్యాఖ్యల పేరిట పార్టీ నుంచి ఆరేళ్లు బహిష్కరించారు. ఓసారి రాష్ట్రపతి పదవికి కూడా పోటీచేశాడు. ఓసారి భారత ముక్తి మోర్చా అని ఉద్యమం స్టార్ట్ చేశాడు. మరోసారి ‘పవిత్ర హిందుస్థాన్ కజగం’ అని ఏకంగా ఓ పార్టీ పెట్టాడు. ఆ తర్వాత దాన్ని గంగలో కలిపాడు.. అది వేరే సంగతి. మొత్తానికి ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మరో మనిషి భారతీయ రాజకీయ, న్యాయ చరిత్రలో కనిపించడు. ఒక్కటి మాత్రం నిజం… ఆయన ఆత్మ ఏ లోకానికి వెళ్ళినా.. ఆ లోక నాయకుడికి పెద్ద తలనొప్పి మొదలైనట్లే. ఎందుకంటే అక్కడ ‘లా’ పాయింట్లలో కొత్త అర్థాలు వెతికి ఉతికి ఆరేసే పని ఇప్పటికే మొదలెట్టేసి ఉంటాడు.

BOX:
జఠిల్మానీ జఠిల జాబితా:
ఒక్కసారి తను వాదించిన కేసుల్లో కొన్ని మచ్చుకు ఇవి. షాక్ తింటారు.

1). రాజీవ్ గాంధీ హంతకుల తరఫున 2011లో మద్రాస్ హైకోర్టులో
2). ఇందిరా గాంధీ హంతకుల తరఫున
3). స్టాక్ మార్కెట్ స్కాంలో హర్షద్ మెహతా తరఫున
4). స్టాక్ మార్కెట్ స్కాంలో కేతన్ పరేఖ్ తరఫున
5). డాన్ హజీమస్తాన్ తరఫున
6). అఫ్జల్ గురు తరఫున (కానీ ఆ కేసు తాను వాదించలేదని తరువాత ఖండించాడు)
7). హవాలా స్కాండల్‌లో అద్వానీ తరఫున
8). జెస్సీకాలాల్ హత్య కేసులో మనుశర్మ తరఫున
9). సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో అమిత్ షా తరఫున
10). ఓ హత్య కేసులో అజిత్ జోగి కొడుకు అమిత్ జోగి తరఫున
11). 2జీ స్కాంలో సంజయ్ చంద్ర బెయిల్ కేసులో
12). నేవీ వార్ రూం లీక్ కేసులో కులభూషణ్ పరాశర్ బెయిల్ కేసులో
13). 2జీ స్పెక్ట్రం కేసులో కనిమొళి తరఫున
14). జగన్ అక్రమాస్తుల కేసులో
15). ఆక్రమ మైనింగు కేసులో యడ్యూరప్ప తరఫున
16). రాంలీలా మైదానం కేసు- 2011 బాబా రాందేవ్ తరపున
17). సీపీఐ ఎమ్మెల్యే హత్య కేసులో శివసేన తరఫున
18). లైంగిక దాడుల కేసులో ఆశారాం బాపు తరఫున
19). దాణా కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ తరఫున
20). సహారా-సెబీ కేసులో సుబ్రతరాయ్ తరఫున
25). జయలలిత అక్రమాస్తుల కేసులో
26). అరవింద్ కేజ్రీవాల్ తరఫున పరువునష్టం కేసులో…

ఒక్క ముక్కలో చెప్పాలంటే…:
ఈ దేశంలో మీరు ఏమైనా చేయండి. అడిగినంత డబ్బు చెల్లించగల కెపాసిటీ ఉంటే చాలు, రాం జెఠ్మలానీ ఉన్నాడుగా రక్షించటానికి అన్నంత ధీమా. 2017లో తన న్యాయవాద వృత్తి నుంచి విరమణ ప్రకటించాడు. 95 ఏళ్ల వయస్సులో సెలవురోజు ఆదివారం మరణించాడు. నిజానికి ఇంత వివాదాస్పద లాయర్ బహుశా ప్రపంచంలోనే ఎవరూ లేరేమో.! అంతేకాదు, ఆ బుర్ర కూడా మ్యూజియంలో పెట్టాల్సినంత ఘనమైనది

ఎందుకంటే..?:
దేశ విభజన తరువాత ముంబై వచ్చేశాడు… పాకిస్థాన్ నుంచి భారతదేశానికి వచ్చిన వారి పట్ల దుర్మార్గమైన ఓ చట్టాన్ని అప్పటి మురార్జీ దేశాయ్ ప్రభుత్వం (ముంబై రెఫ్యూజీస్ యాక్ట్) తీసుకొస్తే, దాని మీద ఫైట్ చేయడంతో రాంజెఠ్మలానీ
అలా వెలుగులోకి వచ్చి… ఇలా గెలిచాడు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close