Featuredప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

కారులో రగులుతున్న విభేదాలు..

ఎవరికి వారే యమునా తీరే..

  • అధినేత పర్యటనలకే ప్రాధాన్యం..
  • క్షేత్రస్థాయిలో చీలుతున్న పార్టీ..
  • అవకాశం చూస్తున్న ప్రతిపక్షాలు…

ఎవరి మాట ఎవరూ వినరు.. ఎవరికి వారే నాయకులు, అధినాయకులు.. గులాబీలో క్రమశిక్షణ రోజురోజుకు అదుపుతప్పుతోంది.. నీ మాట నేను వినేది లేదని ఒకరు, వినకుండా నీ దారి నీదంటే మరొకరు.. చిలికి చిలికి గాలివానలా మారుతున్న రాజకీయ గొడవలు.. క్షేత్ర స్థాయిలో చీలిపోతున్న పార్టీ కేడర్‌.. చిన్నగా మారుతున్న గొడవలను పెద్దగా చేస్తూ తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్షపార్టీలు.. పార్టీలో జరుగుతున్న అంతర్గత విషయాలపై దృష్టిసారించకుండా గులాబీ అధినేత పర్యటనలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.. అధికారపార్టీలో అవకాశం రాక, నిరాశతో ఉన్నవారందరిని అక్కున చేర్చుకునే ప్రయత్నంలో ఒకవైపు బిజెపి, మరోవైపు కాంగ్రెస్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నగరాలలో, జిల్లాలలో, గ్రామాలలో అధికార పార్టీ తెరాసలో వర్గాలు, వర్గాలుగా విడిపోతూనే ఉన్నాయి. సభ్యత్వ నమోదులో ఎవరి అంచనాలకు మించకుండా దూసుకుపోవాలని కార్యకర్తలను ఉత్సాహపరిచే నాయకత్వం కరవవుతోంది. మండల, జిల్లా కమిటీలలో అలసత్వం చోటుచేసుకుంది. ఎవరికి వారు పట్టనట్లుగా వ్యవహరించడంతో ఎక్కడి పనులన్నీ అక్కడే నిలిచిపోయాయి. పార్టీ నిర్మాణం నుంచి కష్టపడుతూనే ఉన్నా పట్టించుకునే వారే లేరనే బాధతోనే నాయకత్వం వెనకడుగు వేస్తుందని తెలుస్తోంది. పార్టీలో జరిగే అంతర్గత వ్యవహరాలతో గులాబీ బాస్‌ ఎందుకు దృష్టి సారించడం లేదో అర్థమే కావడం లేదు. ఎన్నికల ముందు సుడిగాలి పర్యటనలతో పార్టీ క్యాడర్‌లో ఉత్సాహన్ని నింపుతాననే ఆలోచనలో ఉన్నారని సీనియర్లు అంటున్నారు. కాని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు వేరుగా ఉన్నాయి. చాపకింద నీరులా వేగంగా విస్తరిస్తున్న బిజెపి, ఉన్న క్యాడర్‌ను కాపాడుకునే ప్రయత్నంలో కాంగ్రెస్‌ ఎవరికి వారు తమ వ్యూహాలను సిద్దం చేసుకుంటూ బలపడుతుంటే గులాబీ నేతలు మాత్రం నిధానంగా పార్టీలో జరిగే కుంపటిలపై దృష్టి సారించడం లేదని తెలుస్తోంది.. గులాబీ అధినేత మనసులో ఏముందో కాని పార్టీపై పట్టు కొల్పోతే కారు రిపేరు వెళ్లే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలుస్తోంది…

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఒక మొక్క మాజీ మంత్రి, తాజా మంత్రి మధ్యలో కుంపటి రాజేసింది. అదిలాబాద్‌ జిల్లాలోనూ ఒక తాజా మంత్రి మాటలకు మాజీ మంత్రి ఫీలైపోయాడు. తన్నుకొస్తున్న ఆవేదనను అనుచరుల దగ్గర వెళ్లగక్కేసినట్లు తెలుస్తోంది. కావాలనే మొక్క గురించి పదే పదే నొక్కి నొక్కి ఎందుకు చెపుతున్నాడంటూ ప్రతి ఒక్కరి దగ్గర గోడు చెప్పుకుంటున్నాడు. ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి. పార్టీలో అందరిని ఐక్యంగా, కలిసికట్టుగా ఉంచాల్సిన మంత్రి తానే విభేదాలను పెంచుతున్నారని పార్టీలో కొందరు బాహాటంగా విమర్శలు చేస్తున్నారు. ఇటీవల అదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో పెన్‌గంగా భవన్‌ నీటిపారుదల శాఖ కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యె మాజీ మంత్రి జోగు రామన్న కూడా హజరయ్యారు. కార్యక్రమంలో మంత్రి మాట్లాడిన మాటలే జిల్లాలో మంటలు రేపుతున్నాయి. గతంలో హరితహరంలో నాటిన మొక్కలు యాభైశాతమే మిగిలాయని, కాని ఇప్పుడు ఎనభై శాతం నాటిన మొక్కులు పెరగాలన్నారు. లేదంటే అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత హరితహారంపై మంత్రి చేసిన వ్యాఖ్యలపై పార్టీ వర్గాలు ఆశ్చర్యపోయాయని తెలుస్తోంది. గతంలో అటవీశాఖ మంత్రిగా జోగురామన్న పనిచేశారు. రామన్న మంత్రిగా పనిచేసిన సమయంలో మొక్కల పెంపకం సరిగా జరగలేదని పరోక్షంగా దెప్పిపొడిచారన్న చర్చ వాడివేడిగా సాగుతోంది. మాజీ మంత్రి జోగు రామన్నను ఉద్దేశించే ఇంద్రకరణ్‌రెడ్డి అలా మాట్లాడారని వారి అనుచరులు మండిపడుతున్నారని తెలుస్తోంది. జిల్లాలో పార్టీనంతా క్రమశిక్షణగా ఉంచుతూ అభివృద్ది చేయాల్సిన మంత్రినే ఇలా గొడవలు దారితీసే మాటలు మాట్లాడుతున్నారని సీనియర్లు అంటున్నారు. మొత్తానికి మంత్రి వ్యాఖ్యలు అదిలాబాద్‌ జిల్లా కారు పార్టీలో దుమారం రేపుతున్నాయి. బహిరంగ వ్యాఖ్యలు చేయడంతో విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అందోళన చెందుతున్నారు. వీరి దుమారం రోజురోజు పెరిగిపోతున్న దీనిపై పార్టీ పెద్దలు మాత్రం కనీసం స్పందన లేకుండా ఉన్నారని పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రి వర్సెస్‌ మాజీ మంత్రిగా కొనసాగుతున్న యుద్థం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాల్సిందే..

కమిటీలో రాజుకుంటున్న కుంపట్లు…

టిఆర్‌ఎస్‌ కమిటీల లేటు, కుంపట్లు రాజేస్తోంది. ఎవరూ మాట్లాడాలో అధికారిక ముద్ర లేక మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు నేతలు. త్వరలో కమిటీల జాబితా విడుదల చేస్తే ఇక అన్ని వేదికల మీదా దుమ్మురేపుతామని గులాబీ నాయకులంటున్నారు. ఇంతకీ పార్టీల కమిటీల ప్రకటన ఎందుకు ఆలస్యం అవుతోంది. దీని వెనక టిఆర్‌ఎస్‌ బాస్‌ మదిలో వ్యూహముందా.. అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ నేతల్లో కన్‌ప్యూజన్‌ కాక రేపుతోంది. నిత్యం పార్టీ కార్యక్రమాలతో బిజిబిజీగా ఉండే నాయకులు, ఇప్పుడేం చేయాలో అర్థంకాక ఇంట్లో కాలయాపన చేస్తున్నారు. దానికంతటికి కారణం కమిటీల నియామకంలో కాలయాపన ఆట. గతంలో గులాబీ పార్టీ సభ్యత్వ నమోదు పూర్తి అవ్వగానే వెంటనే పార్టీ రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి కమిటీలను నియమించుకునేది. రాష్ట్రస్థాయి నేతలు హైదరాబాదన కేంద్రంగా పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.

బయట విన్పించని టిఆర్‌ఎస్‌ నాయకుల వాయిస్‌..

పార్టీ అధికార ప్రతినిధులు నిత్యం టీవి డిబేట్లతో పార్టీ వాయిస్ని గట్టిగా వినిపించేవారు. ప్రత్యర్థి పార్టీల నేతలు వేసే కౌంటర్లకి దిమ్మ తిరిగే సమాధానాలు ఇచ్చేవారు. కానీ ఇఫ్పుడు టీవీల్లో గులాబీ నేతల వాయిస్‌ వినిపించడం లేదు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన పార్టీ అధినేత కేసీఆర్‌, అదేరోజు పార్టీ కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అధికార ప్రతినిధులు ఎవరూ కూడా అదేరోజు నుంచి టీవీ చర్చా కార్యక్రమాలకు వెళ్లకూడదు అనే ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికార ప్రతినిధులు ఎవరూ కూడా పార్టీ కార్యక్రమాలకు, టీవీ చర్చలకు హాజరుకావడంలేదు. కేవలం టీవీ చర్చలకు కాంగ్రెస్‌, బిజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన నేతలు మాత్రమే అటెండ్‌ అవుతున్నారు. నిత్యం పార్టీ కార్యక్రమాలు, టీవీ చర్చలతో పార్టీ కోసం పని చేసే నేతలు, ఇప్పుడు ఎలాంటి పనుల్లేక ఖాళీగా ఉంటూ కాలయాపన చేస్తున్నారు. పార్టీ ఎప్పుడు అధికార ప్రతినిధుల లిస్ట్‌ విడుదల చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అసలు వచ్చే లిస్టులో తమ పేర్లు ఉంటాయా అనే ఆందోళన గులాబీ నేతల్లో కనిపిస్తోంది. పార్టీ కమిటీల ప్రకటన కోసం నేతలు ఆశగా వెయిట్‌ చేస్తున్నారు. లిస్ట్‌ విడుదల ఎప్పుడు ఉంటుందా అని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ను, కలిసిన ప్రతిసారి అడుగుతున్నారు. త్వరలోనే కమిటీలను ప్రకటిస్తామని కేటీఆర్‌ హవిూనిస్తుండటంతో అప్పటికప్పుడు కాస్త రిలీఫ్‌ ఫీలవుతున్నా, మళ్లీ నిరీక్షణే తప్పడం లేదంటున్నారు. పార్టీ కమిటీలకు సంబంధించిన లిస్ట్ను పార్టీ అధినేతకి ఇప్పటికే పంపించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ లిస్ట్లో ఉన్న పేర్లు, కేసీఆర్‌ పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అతి త్వరలోనే కమిటీల ప్రకటన ఉంటుందని కేటీఆర్‌ సన్నిహితులు చెబుతున్నా, పార్టీ నేతలు మాత్రం నమ్మడంలేదు. పురపాలక ఎన్నికలు జరిగే వరకు తమ పేర్లు ప్రకటించే చాన్న్‌ లేదంటున్నారు. మొత్తానికి ప్రతిపక్ష పార్టీల ఎత్తులకు పైఎత్తు వేసే లక్ష్యంతోనే కమిటీలపై కేసీఆర్‌ కాలయాపన చేస్తున్నారని చర్చించుకుంటున్నారు. మొత్తానికి కమిటీల్లేక, పార్టీ తరపున అధికారికంగా వాదించే అవకాశం లేక, నేతలు ఇంటికే పరిమితమవుతున్నారు. నిజంగా మున్సిపల్‌ ఎన్నికల తర్వాత కమిటీలను ప్రకటిస్తారా లేదంటే అంతకుముందే జాబితా విడుదల చేస్తారా అన్నది వేచి చూడాలి.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close