Featuredజాతీయ వార్తలు

ఉరికి ముందు.. క్షణ క్షణం

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

పక్కవాళ్ళ ప్రాణం తీయడానికి లేని జాలి, దయ… తమ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎంత ఆరాటం. దొరికిన ప్రతి న్యాయపరమైన అన్ని అవకాశాలు దారులు మూసుకున్నాయి. ఇక మిగిలింది ఆ ఉరికొయ్యలకు వేలాడటమే.!. ఉరితీత సందర్భంగా ఈ దోషుల ప్రవర్తన, వీళ్ళకు జరిగే ‘రాచ మర్యాదలు’ ఎలా ఉంటాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి1, ఉదయం 6గంటల వరకు జరగబోవు ‘అంతిమ ఘడియలు’ ఎలా ఉంటాయనే విషయాలపై ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

కొత్త డెత్‌ వారెంట్లు జారీ: దేశమంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న నిర్భయ దోషుల ఉరిశిక్ష తేదీలను ఢిల్లీకోర్టు ఖరారు చేసింది. గతంలో ప్రకటించిన తేదీ కాకుండా మరోసారి డెత్‌ వారెంట్లు జారీచేసింది. నలుగురు దోషులకు ఫిబ్రవరి 1 ఉదయం 6గంటలకు (శనివారం) ఉరిశిక్ష అమలు చేయాల్సిందిగా పటియాల హౌస్‌ కోర్టు శుక్రవారం తీహార్‌ జైలు అధికారులను ఆదేశించింది. కాగా జనవరి 22న దోషులను ఉరి తీసేందుకు జైలు అధికారులు ఇదివరకే ఏర్పాట్లు పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే హత్య కేసులో దోషి ముఖేశ్‌ సింగ్‌ క్షమాభిక్ష పెట్టుకున్నారు. ఈ పిటిషన్‌ ను రాష్ట్రపతి రామ్నాథ్‌ కోవింద్‌ శుక్రవారం తిరస్కరించారు. కాగా ఉరిశిక్ష అమలు ఆలస్యంపై నిర్భయ తల్లితో పాటు పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో న్యాయపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ఉరితీత తేదీల్లో మార్పులు చేస్తూ.. తాజాగా డెత్‌ వారెంట్లను జారీచేశారు. ఉన్న తీహార్‌ యంత్రాంగం మొదటిసారిగా వాళ్లని అదే జైలులో

ఉరిశిక్షలు జరిగే జైలు నెంబర్‌ 3కి తరలించారు. ఈ నలుగురు దోషులను వేర్వేరు సెల్స్‌ లో ఉంచి, సిసిటివి ద్వారా పర్యవేక్షిస్తున్నారు. తీహార్‌ జైలు డైరెక్టరేట్‌ వర్గాల సమాచారం ప్రకారం…నలుగురు దోషులను ఒకేసారి ఉరిశిక్షకు తీసుకువెళతారు కాబట్టి, నలుగురు దోషులు ఎటువంటి ఇబ్బందులను సృష్టించలేని విధంగా తీవ్రమైన అప్రమత్తత, శాంతి అమలు చేయనున్నట్లు తెలిపారు. దేశచరిత్రలో తొలిసారిగా నలుగురు దోషులను ఒకేసారి ఉరితీస్తున్నారు. ఆసియాలో అతిపెద్ద జైలు అయిన తీహార్‌ జైలులో ఉరి పరీక్షించడానికి డవ్మిూ ఉరిశిక్ష కూడా జరిగింది.

మరోసారి ‘ఉరితాడు’ పరీక్షలు: ఉరి తీసేందుకు ఒక అంగుళం (రెండున్నర సెంటీవిూటర్ల) వ్యాసం, 19 అడుగుల పొడవు ఉండే తాళ్ళను ఇప్పటికే సిద్ధం చేస్తారు. ఖైదీ బరువుకు ఒకటిన్నర రెట్ల బరువుండే బస్తాలతో వారం రోజుల ముందే మరోసారి ఎనిమిది తొళ్ళను.. (అంటే ఒకొక్కరికి రెండు తాళ్ళు) పరీక్షించి వాటిని లాక్‌ చేస్తారు.

రేపు ఉరిశిక్ష అమలు చేస్తారనగా..: ముందురోజు సాయంత్రం అంటే జనవరి 31 సాయంత్రం మరోసారి సూపరింటెండెంట్‌ సమక్షంలో వాటిని పరీక్షిస్తారు.. ఉరిశిక్ష అమలుచేసే సమయంలో జైలు సూపరింటెండెంట్‌, జైలు వైద్యాధికారి, జిల్లా మేజిస్ట్రేట్‌, ఇద్దరు ప్రభుత్వ సాక్షులు తప్పనిసరిగా ఉండాలి.

ఉదయమే ఎందుకంటే..: అయితే ఖైదీని తెల్లవారుజామునే ఎందుకు ఉరి తీస్తారంటే.. ఈ పద్ధతి మనల్ని పరిపాలించిన బ్రిటిష్‌ వారి నుంచి వచ్చిందే. వేకువజామున అయితే ఖైదీలంతా నిద్రలో ఉంటారు, ఆ సమయంలో అంతా ప్రశాంతగా ఉంటుందని బ్రిటిషర్లు ఉరిశిక్షను ప్రొద్దున్నే అమలు చేసేవారు..అదే సంప్రదాయం ఇప్పటికి కొనసాగుతుంది..అయితే ఉరితీసే ముందు ఖైదీకి అర్థమయ్యే భాషలో అతడిని ఏ నేరంపై, ఎందుకు ఉరి తీస్తున్నారో స్పష్టంగా చెబుతారు.

తెల్లవారుజామున..: ఖైదీకి ఉరి విధించేముందు, సాధారణంగా ఆరోజు అర్ధరాత్రి 2.30 గంటలకు నిద్ర లేపుతారు. అప్పుడే స్నానం చేయాలని చేయాలని చెబుతారు. ఆ తర్వాత జైలు సూపరింటెండెంట్‌, మేజిస్ట్రేట్‌ డెత్‌ వారెంట్‌ చదువుతారు. అనంతరం ఖైదీకి ఇష్టమైన టిఫిన్‌ పెడతారు. తర్వాత అతడి చివరి కోరిక ఏమిటని అడిగుతారు. ఆ వెంటనే అతన్ని ఉరికంబం వద్దకు తీసుకెళతారు. తలారి అతడి కాళ్ళు చేతులు కట్టేస్తారు. తరువాత, ముఖానికి తెల్లటి లేదా నల్లటి ముసుగు తొడిగి ఉరితాడు బిగిస్తాడు. ఆ తరువాత జైలర్‌ సిగ్నల్‌ ఇవ్వగానే తలారి లివర్‌ లాగుతాడు. ఖైదీ కింద ఉన్న చెక్క రెండుగా విడిపోవడం… ఖైదీ శరీరం కిందకు వేలాడటం… కొన్ని క్షణాల్లోనే ప్రాణం పోవడం జరుగుతుంది. ఆ మృతదేహాన్ని ఒక అరగంట పాటు ఉరికంబానికి వేలాడదీస్తారు. వైద్యులు మరణాన్ని ధృవీకరించిన తరువాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తారు. కుటుంబ సభ్యులు తీసుకెళ్ళకుండా ఉంటే జైలు పరిసరాల్లోనే ఖననం చేస్తారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close