మూవీ ఇంటర్వూస్

ఆ క్రెడిట్‌ అంతా నా భార్యకే దక్కాలి

కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఎం.ఎల్‌.ఎ’. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో రామ్‌కి జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటించారు. సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా కల్యాణ్‌ రామ్‌ ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా సమాధానాలు చెప్పుకొచ్చారు.

ప్రశ్న: కాజల్‌తో రెండో సినిమా చేశారు. ఎలా అన్పించింది?

కల్యాణ్‌ రామ్‌: కాజల్‌ 50 సినిమాల్లో నటించారు. నేను 14 సినిమాలే చేశాను. కాబట్టి ఆమెతో నటించడం నాకు చాలా సులువుగా అనిపించింది.

త్రీడీ సినిమా చేసిన తొలి హీరో మీరే కదా?

అవును. ‘ఓం’ సినిమా చేశాను.

అలాంటి సినిమా ఎందుకు తీయాలనిపించింది?

ఏదన్నా కొత్తగా చేయాలనుకున్నాను. నేను కంప్యూటర్స్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ చేశాను. కాబట్టి టెక్నాలజీ పరంగా అప్‌డేటెడ్‌గా ఉంటాను. గ్యాడ్జెట్స్‌ అంటే చాలా ఇష్టం. అందుకే తెలుగులో ఎప్పుడూ రాని ఓ విభిన్నమైన సినిమాను తీయాలనుకున్నాను.

ఎన్టీఆర్‌‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఇలాంటి విభిన్నమైన సినిమా ఏదన్నా రాబోతోందా?

ఆగస్ట్‌లో ఓ సినిమా చేయబోతున్నాను. అది విభిన్నంగానే ఉంటుంది.

‘ఎం.ఎల్‌.ఎ’ ఎలాంటి సినిమా?

చాలా వినోదాత్మకంగా ఉంటుంది. ఆ రెండు గంటలు ప్రేక్షకుడు తనకున్న కష్టాలు, టెన్షలన్నీ మర్చిపోయి హాయిగా సినిమాను ఆస్వాదించగలగాలి. ఇందులో నేను ఎమ్మెల్యేగా నటిస్తాను. మంచి లక్షణాలు ఉన్న అబ్బాయిగానూ కన్పిస్తాను. ‘అసెంబ్లీ రౌడీ’ సినిమాలో మోహన్‌బాబు గారు ఎమ్మెల్యేగా ఎంత సీరియస్‌గా నటించారో..కామెడీ కూడా అంతే బాగా పండించారు. నాది కూడా అలాగే ఉంటుంది.

పెళ్లికి ముందు బ్రేకప్స్ ‌ఉన్నాయా?

లేవండీ. ఎవరితోనూ ప్రేమలో పడలేదు. నాది పెద్దలు కుదిర్చిన వివాహం. నాది సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం. చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎప్పుడూ చదువుకోవాలనే చెప్తుండేవారు. చదువే జీవనాధారం అనేవారు. నాకు 90 మార్కులు వచ్చినా స్కేల్‌తో కొట్టేవారు. ఇంజినీరింగ్‌ పూర్తిచేశాక సినిమాల్లోకి రావాలనుకున్నా. నిర్మాతగా మారాలనుకున్నా. ఈ విషయం నాన్నకు చెబితే భయపడ్డారు. ఆ తర్వాత పై చదువుల కోసం అమెరికా పంపించారు. తిరిగి భారత్‌ వచ్చాక నేనూ సినిమాల్లోకి వచ్చాను. నేను చేసిన తొలి రెండు సినిమాలు ఫ్లాపయ్యాయి. ఇక నాకు ప్రేమించే సమయం ఎక్కడుంది? ఆ తర్వాత ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌‌ బ్యానర్‌ ప్రారంభించాను. నా బ్యనర్‌పై చేసిన సినిమా హిట్‌ అయ్యింది. తొలి సినిమా హిట్‌ అవ్వగానే ‘ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో’ అన్నారు నాన్న. కొంత సమయం కావాలని అడిగాను. అయినా ఆయన ఒప్పుకోలేదు.

రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు?

మీరు సినిమాలు చేయడం ఆపండి. ఇక చాలు అని ప్రేక్షకులు చెప్పినప్పుడు వస్తాను.

జీవితంలో మీరు చేసిన సాహసం?

ప్రొడక్షన్‌ సంస్థ ప్రారంభించడం. అప్పుడు నాకు 20 ఏళ్లు ఉంటాయి. ఆ సమయంలో నిర్మాతగా మారడం నిజంగా సాహసమనే చెప్పాలి. అందులోనూ నేను మా నాన్నను ఎలాంటి సాయం అడగలేదు. అంతా నా సొంతంగానే చేసుకున్నాను.

నాగార్జున, ఎన్టీఆర్‌లో బెస్ట్‌ టీవీ హోస్ట్‌ ఎవరు?

ఇది నిజంగా క్లిష్టమైన ప్రశ్న. ఇద్దరూ మంచి వ్యాఖ్యతలే. మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌కి నాగార్జున బాబాయ్‌ నిదర్శనం. ఇక తారక్‌ ఎనర్జిటిక్‌.

మీరూ తారక్‌లా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారా?

అబ్బో..ముందైతే నా సినిమా విడుదల కానివ్వండి. అప్పుడు చూద్దాం.

తాతగారిలాగా పౌరాణిక సినిమాలు చేయాలని ఉందా?

తప్పకుండా. మంచి కథ దొరికితే.

మీ నుంచి తారక్‌తో మల్టీస్టారర్‌ ఆశించవచ్చా?

తారక్‌ అనే కాదు. ఎవరితోనైనా మల్టీస్టారర్‌ చేస్తాను. ఆగస్ట్‌ నుంచి ఓ సినిమా చేయబోతున్నాను. అది మల్టీస్టారర్‌ సినిమానే. అది ఎవరితో అనేది మేలో వెల్లడిస్తాను.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close