ఆడవారికి దక్కని అయ్యప్ప దర్శనం

0

– బుధవారం సాయంత్రం 5గంటలకు శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది.

– బుధవారం రాత్రి 10.30గంటల వరకు అయ్యప్ప దర్శనం కోసం తెరిచే ఉంచారు.

– అక్టోబర్‌ 22 వరకు ఆలయం ప్రవేశం కొనసాగుతుంది.

– అయ్యప్ప దర్శనానికి వచ్చిన ఆచారం అనుమతించని మహిళలను ఆందోళనకారులు అడ్డుకున్నారు.

– రాళ్ళు రువ్వుతూ లాఠీలు పట్టుకుని అడవిదారిలో తరుముకున్నారు.

– వందల సంఖ్యలో పోలీసు బలగాలు ఉన్నా నిలక్కళ్‌ వద్ద ఆందోళనకారులు యాత్రికుల బస్సును వెంబడించి ఆపి అందులోని మహిళా భక్తులపై దాడిచేశారు. వెనక్కివెళ్ళిపొమ్మంటూ బస్సులోంచి లాగేసి బైటికి తోసేశారు.

– జర్నలిస్టులను ఆందోళనకారులు చుట్టుముట్టి బెదిరించారు. వెనక్కివెళ్ళిపోవాలని హెచ్చరించారు. దౌర్జన్యానికి దిగి కొట్టారు. రిపబ్లిక్‌ టివికి సంబంధించిన మహిళా జర్నలిస్టును ఒకడు వెన్నుపూసపై బలంగా తన్నాడు. సిఎన్‌ఎన్‌ న్యూస్‌ 18, ఆజ్‌తక్‌, రిపబ్లిక్‌ టీవి, ఎన్డీటివి తదితర ప్రముఖ సంస్థల జర్నలిస్టులను ఆందోళనకారులు లెక్కచేయలేదు.

– తమిళనాడు నుంచి వచ్చిన దంపతులను అడ్డుకుని బెదిరిస్తున్న 7గురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌చేశారు.

– ఎట్టిపరిస్థితులలోనూ ఆందోళనకారుల ఒత్తిడికి లొంగేదిలేదని, విధంతప్పి సుప్రీంకోర్టులో రివ్యూపిటిషన్‌ వేసేదిలేదని కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ స్పష్టం చేశారు. సుప్రీం ఉత్తర్వులు అమలుచేయడానికి ఎంతటి ఫోర్స్‌నైనా రంగంలోకి దించుతామని ఆలయ ప్రశాంతతకు, పవిత్రతకు ఎలాంటి విఘాతం కలుగనివ్వకుడా చూస్తామని అన్నారు.

– సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ ఆందోళనలకు దిగడం సరికాదని, భక్తుల రూపంలో వచ్చిన కొందరు దాడులకు పాల్పడుతున్నారని కేరళ మంత్రి శైలజ ఆరోపించారు.

తిరువనంతపురం: శబరిమల ఆలయ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. ఓ వైపె పోలీసులు, మరోవైపు ఆందోళనకారుల మధ్య భక్తుల రాకతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్‌ ఏర్పడింది. మహిళలు దర్శనానికి రాకుండా ఆందోళనకారులు టెంట్లు వేసుకుని మరీ అడ్డుకున్నారు. మరోవైపు పోలీసులు కూడా ఈ క్రమంలో ఆందోలనకారులను చెదరగొట్టారు. ఈ క్రమంలో కొందరు జర్నలిస్టులు సైతం తీవ్రంగా గాయపడ్డారు. మహిళల ఆలయ ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం శబరిమల ఆలయం తొలిసారిగా తెరుచుకోగా వేలాదిగా భక్తులు తరలివచ్చారు. అయితే సుప్రీం తీర్పును నిరసిస్తూ పలువురు ఆందోళనకారులు మహిళలను అడ్డుకుంటుండడంతో శబరిమల ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఆలయ పరిసరాల్లో భారీ బందోబస్తు చేపట్టారు. బుధవారం ఉదయం శబరిమలకు వెళ్లే ప్రధాన మార్గం అయిన నీలక్కల్‌ వద్ద ఆందోళనకారులు ఆలయం వైపు వెళ్తున్న మహిళలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. ఆలయానికి 20 కి.విూ దూరం ఉండే నీలక్కల్‌ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని సవిూక్షించారు. మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ శబరిమల ఆచార సంరక్షణ సమితి సభ్యులు నీలక్కల్‌ వద్ద ఆందోళనకు దిగారు. టెంట్లు వేసుకొని సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్సులు, వాహనాలను నిలిపివేసి అందులో ఆలయ దర్శనానికి వెళ్తున్న మహిళలను దింపివేసారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. టెంట్లను తొలగించి వారిని చెదరగొట్టారు. భక్తులను అడ్డుకునేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నీలక్కల్‌ ప్రాంతం ప్రస్తుతం పోలీసుల ఆధీనంలో ఉంది. ఇక్కడ 500 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. వీరిలో మహిళా పోలీసులు కూడా ఉన్నారు. శబరిమల ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లిన ఇద్దరు మహిళలను ఆందోళనకారులు బలవంతంగా వెనక్కి పంపించారు. కేరళకు చెందిన ఓ మహిళ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో మహిళ తమ బంధువులతో కలిసి శబరిమల ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లగా వారిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. పాత్రికేయురాలు లిబి ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్తున్నట్లు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది. అలప్పుజ ప్రాంతంలో ఆమె వెళ్తున్న సమయంలో ఆందోళనకారులు లిబిపై దాడి చేశారు. ఈమెతో పాటు పంబ వద్ద ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భక్తురాలు మాధవిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. వారిద్దరినీ బలవంతంగా వెనక్కి పంపించారు. పోలీసుల సహాయంతో మాధవి కొద్ది దూరం పాటు ప్రయాణించింది. తర్వాత ఆమెను బస్సులో పంపించేందుకు పోలీ సులు ప్రయ త్నించారు. కానీ ఆమెను బస్సులో ఎక్కించుకొని ఆలయం వద్దకు తీసుకెళ్తే బస్సునే తగలబెడతామని ఆందోళనకారులు బెదిరింపులకు దిగారు. దీంతో ఆమె వెనుదిరగక తప్పలేదు. ఆందోళనకారులు తమను వెళ్లనీయకుండా చేయడం వల్ల పిల్లలు ఏడుస్తున్నారని.. దీంతో వెనక్కి మళ్లక తప్పలేదని ఆమె తెలిపారు. శబరిమల ఆలయానికి వెళ్లే మార్గాల వద్ద ఆందోళన చేస్తున్న దాదాపు 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీలక్కల్‌ ప్రాంతంలో మహిళలను అడ్డుకునేందుకు ఆందోళనకారులు వారి వాహనాలపై రాళ్లు రువ్వారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇకపోతే కేరళ వద్ద పరిస్థితిని చిత్రీకరించేందుకు వెళ్లిన విూడియా ప్రతినిధులపైనా ఆందోళనకారులు దాడికి తెగబడ్డారు. ఓ విూడియా సంస్థకు చెందిన ఓబీ వ్యాన్‌ను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో మరింత కట్టుదిట్టమైన భద్రతను మోహరించేలా కేరళ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది. విూడయా ప్రతినిధులు వెంటనే ఆందోళన జరిగే ప్రదేశాలను ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా ఆందోళనకారులు బెదిరింపులకు దిగారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి తీరుతామని కేరళ సర్కారు స్పష్టం చేసింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పునకే తాము కట్టుబడి ఉన్నామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మరోసారి స్పష్టం చేశారు. సుప్రీం నిర్ణయాన్ని కాదని ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేరని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here