ఆకాశంలో నెలవంక… నేడే ఈద్-ఉల్-ఫితర్

0
ఉపవాస దీక్షలు విరమించిన ముస్లింలు 
సామూహిక ప్రార్థనలకు ముస్తాబైన ఈద్గాలు,మసీదులు 
కొనుగోలుదారులతో కళకళలాడిన మార్కెట్లు 
రంజాన్ నెలవంక చూసి ఉపవాస దీక్షలు ప్రారంభించిన ముస్లింలు మంగళవారం షవ్వాల్ నెలవంక దర్శనమివ్వడంతో బుధవారం రంజాన్ పండుగ జరుపుకోవడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. నెలవంక తొంగి చూడడంతో నెల రోజుల పాటు కఠోర నియమాలతో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు ఉపవాస దీక్షలను విరమించారు. ముస్లింలకు అత్యంత పవిత్రమైన,అతిపెద్ద పండుగ రంజాన్.షవ్వాల్ మాసం మొదటి రోజు ముస్లింలు రంజాన్ పండుగను ఆనందోత్సాహాలతో,ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ.దీనినే ఈద్-ఉల్-ఫితర్ అని కూడా అంటారు.రంజాన్ సందర్బంగా ప్రత్యేక ప్రార్ధనలున(నమాజ్)చేసేందుకు ఈద్గాలు,మసీదుల ముస్తాబయ్యాయి. 

శ్రామికుని వేతనం లభించే రోజు…. 
రంజాన్ పండుగను శ్రామికుని వేతనం లభించే రోజుగా ముస్లింలు భావిస్తారు.నెలరోజుల పాటు కఠోర నియమ నిబంధనలను పాటించి ఉపవాస దీక్షలు చేపట్టి,చెడుకు దూరంగా ఉంటూ అల్లాహ్ ధ్యానంలో గడిపినందుకు ఫలితంగా లభించే వేతనం రోజుగా అభివర్ణిస్తారు.రంజాన్ పర్వదినాన తెల్లవారుఝామున లేచి స్నానాలను ఆచరించిన తరువాత నూతన వస్త్రాలు ధరించి ఈద్-ఉల్-ఫితర్ ప్రత్యేక నమాజ్ కోసం ఈద్గాలు,మసీదులకు బయలుదేరుతారు.సామూహిక ప్రార్ధనల అనంతరం ఆలింగనం చేసుకుని ఒకరికొకరు ఈద్ ముబారక్ అంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. 

పండుగ ప్రత్యేక వంటకం షీర్ ఖూర్మా ……. 
ఈద్-ఉల్-ఫితర్ రోజున ముస్లింలు ప్రత్యేక వంటకం చేసేది షీర్ ఖూర్మా.ఇందులో సేమియా,పాలు,బాదం,కాజు,కిస్మిస్,వంటి డ్రై ఫ్రూట్స్ వేసి తయారు చేస్తారు. ఘుమఘుమలాడే ఈ షీర్ ఖూర్మా పాయసంను పండుగ శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే బంధు,మిత్రులకు అందజేస్తారు. 

కిటకిటలాడిన మార్కెట్లు ….. 
రంజాన్ పండుగ సందర్బంగా కొనుగోళ్ళదారులతో మార్కెట్లు కళకళలాడాయి.గత నెల రోజులుగా రాంజాన్ మాసాన్ని పురస్కరించుకుని హోటల్లల్లో సందడి నెలకొంది.నెలవంక దర్శనమివ్వడంతో పండుగ సందర్బంగా రెడీమేడ్ దుస్తులు,కిరాణా దుకాణాలు,అత్తర్ ,గాజులు తదితర వస్తువులను కొనుగోలు చేసేందుకు ముస్లింలు భారీ సంఖ్యలో తరలిరావడంతో మార్కెట్లు సందడిగా మారాయి.   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here