అదును కోసం ఎదురుచూపు…

0
  • సందర్భాన్ని బట్టి తిరుగుబాటే..
  • తన్నీరు ఆలోచనే వేరంటున్న సన్నిహితులు..

దేనికైనా అవకాశం రావాలి… మనిషికి ఎంత ఓపిక ఉంటే అంత ఎత్తుకు ఎదుగుతారంటారు.. ఓపికే మనిషి విజయానికి ప్రధాన అస్త్రం.. అందుకే ఎవ్వరైనా అవకాశం కోసమే ఎదురుచూస్తారు.. మనం ఒక మనిషిని ఎంత తక్కువ అంచనావేసినా, ఎంత తొక్కిపెట్టాలని ప్రయత్నం చేసినా అతను ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగిపోతూ ఉంటాడు.. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నదీ అదే.. పార్టీ నిర్మాణం నుంచే కాకుండా, కెసిఆర్‌ తెలుగుదేశం పార్టీనుంచి బయటికి వచ్చినప్పుటి నుంచి ఆయన వెంటే వెన్నంటే ఉంటున్న ఏకైక నాయకుడు తన్నీరు హరీష్‌రావు.. మామ అడుగుజాడల్లో నడుస్తూ, మామ ఆజ్ఞను శిరసావహిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించేవరకు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచారు. అలాంటి నాయకున్ని రోజురోజుకు కావాలని పక్కన పెడుతున్నారో, మరేమీ కారణమో తెలియదు కాని పార్టీలో హరీశ్‌రావు అంటేనే ఏకాకిగా మార్చేస్తున్నారు… గతం నుంచి పార్టీలో నెంబర్‌ టూ నాయకుడిగా పేరున్న హరీశ్‌రావు, ఎప్పుడైతే కెసిఆర్‌ తన కుమారుడు కెటిఆర్‌, కవితను రంగంలోకి దించేశారో అప్పటినుంచి తన ప్రాబల్యం పూర్తిగా తగ్గించేస్తున్నారు. పార్టీలో అధినేత ఆయన ప్రాధాన్యం తగ్గిస్తున్నా జనంలో మాత్రం హరీశ్‌కు తిరుగులేని నేతగా పేరుంది. హరీశ్‌రావును పక్కనపెట్టడంపై ఇప్పటికే చాలా ప్రాంతాల్లో నాయకులు ఆవేశాన్ని వ్యక్తం చేస్తున్నా తన్నీరు ఆదేశాల మేరకే వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కాకున్నా రాబోయే రెండు మూడు సంవత్సరాలలో తన్నీరు తిరుగుబాటు జెండా ఎగరేయడం మాత్రం పక్కా అంటున్నారు ఆయనకు అత్యంత సన్నిహితులు….

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలక నేతగా ఎదిగిన ఆ పార్టీ అధినేత తెలంగాణ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మేనల్లుడు తన్నీరు హరీశ్‌రావు పార్టీలో రెండవ నాయకుడనే విషయం రాష్ట్రం మొత్తం తెలిసిన విషయమే.. కాని మారుతున్న సమీకరణాలు, పార్టీలో ఆయన పరిస్థితిని చూసి ఎప్పుడేం జరుగుతుందో అనేది అర్థం కాకుండా ఉందని పార్టీ సీనియర్‌ నాయకులు అంటున్నారు.. కెసిఆర్‌తో సమానంగా పేరు గడిస్తున్న తన్నీరు హరీశ్‌రావు నిజంగా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా అంటే అవుననే అంటున్నారు వారి అత్యంత సన్నిహితులు.. హరీశ్‌రావుకు ఓపిక చాలా ఎక్కువని అందుకే వెనకాముందూ ఆలోచిస్తున్నారని తిరుగుబాటు బావుటా ఎగురవేస్తారా అన్న దిశగా చాలా కాలం నుంచే వార్తలు వినిపిస్తూ వస్తున్నాయంటున్నారు. పార్టీ అధినేతగా కెసిఆర్‌ ఉన్నా ఆయన వెన్నంటి ఉండి పార్టీ పనులతో పాటు ఉద్యమ సమయంలో కీలక పనులన్నీ చక్కబెట్టిన నేతగా హరీశ్‌రావు తిరుగులేని ప్రజల నాయకుడిగా ఎదిగారు. అంతేకాకుండా కెసిఆర్‌ అప్పటిదాకా గెలుస్తూ వస్తున్న సిద్దిపేట అసెంబ్లీ నుంచి తొలిసారి గెలిచిన హరీశ్‌రావు అక్కడ కెసిఆర్‌ కంటే కూడా తానే బలమైన నేతగా నిరూపించుకున్నారు. ఏటికేడు అక్కడ హరీశ్‌రావుకు పెరుగుతూ వస్తున్న మెజారిటీ ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కెసిఆర్‌ మేనల్లుడిగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హరీశ్‌ వైరి వర్గాల్లో మంచి పేరున్న నేతగా ఎదిగారు. ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత టిఆర్‌ఎస్‌ ఊహించని విజయం సాధించి మళ్లీ ప్రభుత్వాన్ని సొంతం చేసుకొంది. ఎన్నికలు ముగిసి ఫలితాలు రాగానే సొంత మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కెసిఆర్‌ పార్టీలోని మార్పులు, చేర్పులపై దృష్టి సారించారు. తన కుమారుడు కెటిఆర్‌ను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ప్రకటించిన కెసిఆర్‌ తనకు అండదండగా ఉంటూ పార్టీని పెద్దదిక్కుగా మారిన హరీశ్‌రావును పూర్తిగా పక్కనపెట్టేశారు. కెసిఆర్‌కు వ్యతిరేకంగా పోటీచేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి ఒంటేరును పార్టీలోకి తీసుకునేటప్పుడు కూడా మాట మాత్రం చెప్పకుండా పార్టీ కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. తెలంగాణ రెండవసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాక మొదటి మంత్రివర్గ కూర్పులో సీనియర్‌ నాయకుడు హరీశ్‌రావు పేరు కనిపించనే లేదు. ఈ క్రమంలో తనకు పార్టీలో తగ్గుతున్న ప్రాధాన్యాన్ని గుర్తించిన హరీశ్‌రావు పార్టీపై తిరుగుబాటు చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. హరీశ్‌రావు తిరుగుబాటు చేస్తే కూడా టిఆర్‌ఎస్‌ కొంప కోల్లేరు కావడం ఖాయమేనన్న వాదనలూ వినిపిస్తున్నాయి.. కాని హరీశ్‌రావు ఎవ్వరికి ఏం సమాధానం చెప్పకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారని నిశ్శబ్దం ఎప్పుడో బద్దలవుతుందనే వాదన వినిపిస్తోంది..

ప్రాధాన్యత మరింత దిగజారితే తిరుగుబావుటే… పార్టీలో కాని, ప్రభుత్వంలో కాని ప్రాధాన్యత మరింత కింది స్థాయికి దిగజారితే మాత్రం తిరుగుబావుటే ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి.. ఇలాంటి తరుణంలో కెసిఆర్‌ దగ్గరి బంధువులు ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి ఐతే హరీశ్‌రావు తిరుగుబాటు చేసే అవకాశాలేమి లేవని చెప్పిన వారు పరిస్థితులు మరింత దిగజారితే మాత్రం హరీశ్‌రావు జెండా లేపడం ఖాయమేనని తేల్చేశారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతగా హరీశ్‌కు పార్టీపై మంచి పట్టు ఉందని అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో హరీశ్‌ మేనమామ కెసిఆర్‌ మాటను జవదాటే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. పార్టీలో హరీశ్‌కు తగ్గుతున్న ఫ్రాధాన్యాన్ని ప్రస్తావించిన ఆయన సన్నిహితులు పార్టీలో హరీశ్‌కు ప్రాధాన్యం ఏలా తగ్గిందన్న విషయాన్ని కూడా చాలా కూలకషంగానే వివరించారు. టిడిపి నుంచి కెసిఆర్‌ బయటకు రావడం ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని భుజానికెత్తుకొని టిఆర్‌ఎస్‌ను స్థాపించిన తరుణంలో అసలు పార్టీ నిలబడుతుందా లేదా అన్న కోణంలో అనుమానాలు వ్యక్తం చేసిన కెటిఆర్‌, కవితలు మొదట్లో అమెరికాలోనే ఉండేందుకు ఇష్టపడ్డారని తెలిపారు. కాని కాలక్రమంలో తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరడం టిఆర్‌ఎస్‌ కూడా అంతకంతకూ బలోపేతం అవుతున్న విషయాన్ని పసిగట్టేసి అమెరికా నుంచి తిరిగి వచ్చారని తెలిపారు. అయితే వారిలా కాకుండా హరీశ్‌రావు మొదటి నుంచి కెసిఆర్‌ను అంటిపెట్టుకునే ఉన్నారన్న విషయాన్ని కూడా వారు ప్రధానంగా ప్రస్తావించారు. తనకు పార్టీలో తగ్గుతున్న ప్రాధాన్యం హరీశ్‌రావుకు అర్థమైపోయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన తిరుగుబాటు బావుటా ఎగురవేసే ప్రసక్తే లేదని అయితే పరిస్థితి మరింతగా దిగజారితే మాత్రం హరీశ్‌ తిరుగుబాటు చేయడం ఖాయమేనని సన్నిహితులు చెపుతున్నారు.

 మొత్తంగా పార్టీలో వ్యవహారమంతా ఇప్పుడు నిశ్శబ్దంగానే ఉన్నా కొంతమంది పార్టీ సన్నిహితులు చేసిన వ్యాఖ్యాలతో హరీశ్‌రావు తిరుగుబాటు దిశగా కొంత ఆందోళన వ్యక్తమయ్యే పరిస్థితి ఐతే కనిపిస్తోందనే వాదన వినిపిస్తోంది. ఒక వేళ పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు వచ్చాక కెసిఆర్‌ కేంద్రం వైపు దృష్టిసారించి ఇక్కడ కెటిఆర్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని అలా జరిగిన పక్షంలో పార్టీలో చీలికలు రావడానికి ఎంతోదూరం లేదని తెలుస్తోంది. అందరికి అన్నిరోజులు ఒకేలా ఉండవని ఎప్పుడు ఎవరూ ఏలా రియాక్ట్‌ అవుతారో, అనుకోకుండా ఎవరూ ఎవరి వైపు మళ్లుతారో అప్పటి అవకాశాన్ని బట్టి, మనుషులను బట్టి కాలం మారుతూ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. ఎవరినైనా ఎంత వెనక్కి లాగాలని ప్రయత్నించినా, ఎంత తొక్కి పెట్టాలని ఆలోచించినా ఏదో ఒక రోజు అదీ మనకే చుట్టుకొని కొంపముంచుతుందనే నానుడిని నేటి రాజకీయ నాయకులు మరుస్తున్నారని ఏదీ మీదికొచ్చేవరకు తెలియదంటున్నారు సీనియర్‌ రాజకీయ నాయకులు.. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here