కాంట్రాక్టర్ గా అవతారమెత్తిన తెరాస కార్పొరేటర్..

కాంట్రాక్టర్ గా అవతారమెత్తిన తెరాస కార్పొరేటర్..


- బోడుప్పల్ మున్సిపల్ లో వెలుగు చూసిన ఘటన.. 
- మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం ప్రజా ప్రతినిధి 
   ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేయడం నేరం.. 
- 2020 సంవత్సరంలో ఈ సంఘటన జరిగినా ఇప్పటివరకు 
  అధికారులు స్పందించకపోవడం ఆశ్చర్యకరం!
- ఇప్పటికైనా స్పందించి చర్యలు చేపట్టాలని బీజేపీ ప్రధాన 
   కార్యదర్శి దేవరకొండ వెంకటాచారి డిమాండ్.. 

మేడిపల్లి, 13 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : 
ప్రజా ప్రతినిధిగా ఉన్నవారెవరైనా ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేయడం నేరమని, ఈ విషయంలో సంభందిత ప్రజా ప్రతినిధిని పదవి నుంచి తొలగించే వెసులుబాటు అధికారులకు మున్సిపల్ యాక్ట్ 2019 కల్పించిందని, అయినా లెక్క చేయకుండా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎనిమిదవ డివిజన్ లోని కాంట్రాక్టు పనులకు సంభందించి, 8 వ డివిజన్ కార్పొరేటర్ సీసా వెంకటేష్ గౌడ్ తన అకౌంట్ లోకి డబ్బులు బదిలీ చేయించుకున్నారని నిర్దిష్టమైన ఆరోపణలు ఉన్నప్పటికీ అధికారులు చర్యలు ఎందుకు చేపట్టలేదో..? ప్రజలకు సమాధానం చెప్పాలని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి దేవరకొండ వెంకటాచారి డిమాండ్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ 'పద్మజా రాణి' కి ఫిర్యాదు చేసిన ఆయన..  ప్రభుత్వ కాంట్రాక్టు పనికి సంబంధించిన, కార్పొరేటర్ అకౌంట్ లోకి జమ అయిన డబ్బుల వివరాలకు సంబంధించిన ఆధారాలను సమర్పించారు. తాను సమర్పించిన ఆధారాలను పరిశీలించి, వాటిలో నిజా నిజాలను నిర్ధారించి, ఒక వేళ ఆరోపణలు నిరూపితమైతే కార్పొరేటరును తన పదవి నుంచి తొలగించాలని కమీషనరును కోరారు.

2020 ఆగస్టు నెలలో దాదాపు 58 వేల రూపాయలు కార్పొరేటరుకు సంబంధించిన హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంక్, నాచారం బ్రాంచ్ అకౌంటుకి ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేసినందుకు గాను బదిలీ అయినట్లు నిర్దిష్ట ఆరోపణలు చేశారు. అధికారుల వద్ద  ఆధారాలు ఉన్నప్పటికీ, ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు చేపట్టలేదని, ఈ విషయం గమనిస్తే అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై కాంట్రాక్టు పనుల విషయంలో చట్టాన్ని తుంగలో తొక్కినట్లు స్పష్టమవుతోందని ఆయన ఆరోపించారు. దీనిపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (ఏం.ఏ.  అండ్ యూ.డి.) సెక్రెటరీ, మేడ్చల్ జిల్లా కలెక్టర్, డి.ఆర్.ఓ. లకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు వెంకటాచారి తెలిపారు.

Tags :