వైద్యుడిగా మొదలై.. సీఎం దాకా..!

వైద్యుడిగా మొదలై.. సీఎం దాకా..!

 

త్రిపుర కొత్త సీఎంగా ఎంపీ మాణిక్‌ సాహా 
అధిష్ఠానం ఆదేశాల మేరకు బిప్లవ్‌ దేవ్‌ రాజీనామా
2018లో త్రిపుర సీఎంగా బిప్లవ్‌ ప్రమాణం
నాలుగేళ్లుగా సజావుగానే పాలన సాగించిన వైనం
బీజేపీ అధిష్ఠానం ఆదేశాలతోనే రాజీనామా అంటూ ప్రచారం


ఈశాన్య రాష్ట్రం త్రిపురలో రాజకీయంగా శనివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. త్రిపుర సీఎం పదవికి బీజేపీ నేత బిప్లవ్‌ కుమార్‌ దేవ్‌ క్రితం రాజీనామా చేశారు. బీజేపీ అధిష్ఠానం ఆదేశాల మేరకే బిప్లవ్‌ తన పదవికి రాజీనామా చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. 2018లో త్రిపుర సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగా... గడచిన నాలుగేళ్ల పాటు ఆయన ప్రభుత్వాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండానే నడిపించారు. అయితే కారణాలేమిటో తెలియదు గానీ... ఉన్నట్టుండి ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. కొత్త సీఎంగా ఎంపీ మాణిక్‌ సాహా (69) బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్త ముఖ్యమంత్రిగా మాణిక్‌ను బీజేపీ హై కమాండ్‌ ఖరారు చేసింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు మాణిక్‌ను బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. త్రిపుర మాజీ సీఎం దేబ్‌ కూడా త్రిపుర కొత్త సీఎంగా ఎంపికైన సాహాకు శుభాకాంక్షలు తెలిపారు. మాణిక్‌ సాహా ప్రస్తుతం త్రిపుర బీజేపీ శాఖకు అధ్యక్షుడుగా ఉన్నారు. త్రిపుర క్రికెట్‌ అసోసియేషన్‌కు ప్రెసిడెంట్‌గా కూడా మాణిక్‌ సాహా పనిచేస్తున్నారు. 2016లో బీజేపీలో చేరారు. 

వృత్తిరీత్యా దంత వైద్యుడైన మాణిక్‌ సాహా.. అంతకముందు కాంగ్రెస్లో పనిచేసి 2016లో భాజపాలో చేరారు. ప్రస్తుతం భాజపా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. త్రిపుర క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగానూ పనిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు హపానియాలోని త్రిపుర వైద్య కళాశాలలో బోధనలు కూడా చేశారు. త్రిపురలో 25ఏళ్ల వామపక్ష ప్రభుత్వ పాలనకు తెరదించుతూ భాజపా తొలిసారి 2018 మార్చిలో బిప్లబ్కుమార్‌ సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలో శాంతిభద్రతలు పర్యవేక్షించడంలో వైఫల్యం చెందారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తూ రాజీనామాకు డిమాండ్‌ చేస్తున్నాయి. దీనికితోడు, సొంత పార్టీ నుంచి కూడా అసమ్మతి సెగ తగలడంతో రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని భాజపా అధినాయకత్వం కీలక మార్పులు చేసినట్టు తెలుస్తోంది. గతేడాది నవంబర్లో త్రిపురలో జరిగిన పురపాలక ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించడంలో మాణిక్‌ సాహా కీలక పాత్ర పోషించారు. భాజపా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు బిప్లబ్‌ కుమార్‌ చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Tags :