తెలంగాణ టెట్ 2022 నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ టెట్ 2022  నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ గురువారం నాడు రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం మార్చి 26 అంటే రేపటి నుండి ఏప్రిల్ 12 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక టెట్ పరీక్షను జూన్ 12న నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ తెల్పింది. పాఠశాల విద్యాశాఖలో ఖాళీగా ఉన్న 13,086 పోస్టుల్లో 10,000లవరకు టీచర్ పోస్టులు ఉన్నాయి. వీటిల్లో 6,700ల వరకు ఎస్జీటీ ఉపాధ్యాయ కొలువులు (ఆదర్శ పాఠశాలల్లోని ఖాళీలను కూడా కలుపుకుంటే 11,000ల వరకు ఉండొచ్చని అంచనా) ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఐతే టీచర్ నియామకాలకు ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ను సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. ప్రత్యేక తెలంగాణలో టెట్ నిర్వహించడం ఇది మూడోసారి. గతంలో 2016 మే, 2017 జులైలో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది టెట్ బీఈడీ అభ్యర్థులకు మరో సదావకాశాన్ని కల్పిస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అందేంటంటే.. ఇప్పటివరకు బీఈడీ అభ్యర్థులు 6 ? 10 తరగతులు బోధించేందుకు మాత్రమే అర్హులు. అందుకు టెట్ పేపర్-2 రాసేవారు. ఇక నుంచి వారు 15 తరగతులకు బోధించేందుకు ఎస్జీటీలుగా నియమితులు కావొచ్చు. అంటే వారు టెట్ పేపర్ 1 రాయవచ్చు. కాకపోతే ఉద్యోగంలో చేరిన రెండేళ్లలోపు ప్రాథమిక విద్య బోధనలో 6 నెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలి. ఇప్పటివరకు పేపర్-1కు కేవలం డీఈడీ వారు మాత్రమే అర్హులుగా ఉండేవారు. అంతేకాదు.. ఒకసారి టెట్లో అర్హత సాధిస్తే ఆ ధ్రువపత్రానికి ఇప్పటివరకు 7 ఏళ్ల కాలపరిమితి ఉండేది. గడువు ముగిశాక మళ్లీ టెట్ రాసుకోవాల్సిందే. ఐతే అందుకు భిన్నంగా ఒకసారి టె అర్హత సాధిస్తే జీవితాంతం విలువ ఉండేలా మార్పు చేయాలని ఎన్సీటీఈ రెండేళ్ల క్రితమే నిర్ణయించింది.

 

టెట్ లో తాజా మార్పులివే:

టెట్ నిర్వహణ పూర్తయిన వెంటనే టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అవుతుందని అధికారులు చెబుతున్నారు. కాగా టెట్ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖకు అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వం కొన్ని మార్పులు, మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. తాజా మార్పుల ప్రకారం జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఆదేశాల మేరకు టెట్ పేపర్- 2కు బీఈడీ అభ్యర్థులు కూడా అర్హులేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈనిర్ణయంతో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్.జీ.టి. పోస్టులకు బీఈడీ చేసిన వారికి కూడా అర్హత లబించనుంధిి. అయితే ఉద్యోగం సాధించన వారు రెండేళ్లలో ప్రాథమిక విద్యలో ఆరు నెలల బ్రిడ్జి కోర్సు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే.. బీఈడీ లాంటి ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు | పూర్తి చేసిన అభ్యర్థులు డీఎస్సీ రాయాలంటే నూతన విద్యావిధానం ప్రకారం టెట్ పాసై ఉండాలి. ఉపాధ్యాయ అర్హత పరీక్షలో పాసైన వాళ్లు మాత్రమే డీఎస్సీ రాసేందుకు అర్హులు. ఒకప్పుడు ఈ టెట్ ఏడేళ్ల వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉండేది. అంటే ఒకసారి టెట్ పాసైన వాళ్లు ఏడేళ్ల వరకు మళ్లీ డీఎస్సీలు రాసుకోవచ్చు. కానీ ఇటీవల కాలంలోనే ఈ నిబంధనను కేంద్రం మార్చేసింది. ఇప్పుడు ఒకసారి టెట్ పాసైన వాళ్లు ఎప్పుడైనా డీఎస్సీలు రాసుకోవచ్చు.

Tags :