చాలా మంది అనుమానపడ్డారు..

- గవర్నర్ బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తున్నానని వివరణ..
- కేర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మాతృదినోత్సవ వేడుకలు..
- ఎటువంటి అనుభవమూ లేదని అన్నారన్న తమిళిసై..
- తనపై విమర్శలు వచ్చాయని వివరణ..
- తనకు గైనకాలజిస్టుగా అనుభవం ఉందని వ్యాఖ్య..
- రాజ్ భవన్ వద్ద మీడియా పాయింట్ కు ఓకే చెప్పిన గవర్నర్..
హైదరాబాద్, 08 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన మాతృదినోత్సవ వేడుకల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం నవజాత శిశువు అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తెలంగాణకు గవర్నర్ గా తనను నియమించినప్పుడు చాలా మంది అనుమానపడ్డారని, తనకు ఎటువంటి అనుభవమూ లేదని తనపై విమర్శలు వచ్చాయని చెప్పారు. గైనకాలజిస్టుగా శిశువులకు చికిత్స అందించడంలో తనకు విశేష అనుభవం ఉందని గవర్నర్ తెలిపారు. వైద్యవృత్తి ఇచ్చిన ధైర్యంతోనే గవర్నర్ ముందుకెళ్తున్నట్లు ఆమె వివరించారు. వైద్యానికి సంబంధించిన అంశాలపై తనను సంప్రదించవచ్చని తెలిపారు. మహిళలు, చిన్నారుల సంస్థను ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ గవర్నర్ బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు.
'రెడ్ క్రాస్ డే' వేడుకల్లో గవర్నర్ :
మరోవైపు రాజ్ భవన్ లో జరిగిన రెడ్ క్రాస్ డే వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా సమయంలో పోలీసులు. సైనికులు చాలా సహకరించారన్నారు. రక్తం అవసరమైన వారికి సాయం చేయడంలో కృషి చేశారని తెలిపారు. తలసేమియాపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉందని ఆమె వివరించారు. రెడ్ క్రాస్ సంస్థ అన్ని జిల్లాల్లో తమ కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. రెడ్ క్రాస్ సంస్థ జిల్లాల్లో బ్లడ్ బ్యాంక్, క్లినిక్‌ల వంటివి ఏర్పాటు చేయాలన్నారు. ఎదుటివారి పట్ల దయతో, మానవత్వంతో మెలగాలని గవర్నర్ కోరారు.
రాజ్ భవన్ వద్ద మీడియా పాయింట్ కు ఓకే చెప్పిన గవర్నర్ :
రాజ్ భవన్ వద్ద మీడియా పాయింట్ ఏర్పాటు చేయాలని గవర్నర్ తమిళి సైకి పలువురు జర్నలిస్టులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయని, గవర్నరు కలిసి వెళ్లే నేతల కవరేజ్ కోసం వచ్చే జర్నలిస్టులు రాజభవన్ వద్ద ఎండలో రిపోర్టింగ్ చేయాల్సి వస్తోందని వారు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా ఆదివారం రాజ్‌భవన్‌లో ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు. మీడియా పాయింట్ లేకపోవడంతో పాటు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలపై గవర్నర్ కు వెల్లడించారు. మీడియా పాయింట్ లేకపోవడంతో రాజ్ భవన్ బయట రోడ్డుపైనే ఉండి వార్తలు కవర్ చేస్తున్నామని పేర్కొన్నారు. మంచి నీటి సౌకర్యం కూడా కల్పించాలని జర్నలిస్టులు గవర్నరు విజ్ఞప్తి చేశారు. కాగా ఈ విషయంలో తమిళిసై సానుకూలంగా స్పందించినట్లు జర్నలిస్టులు వెల్లడించారు. ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంపై గవర్నర్ కు వారు ధన్యవాదాలు తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో అజయ్, రాజారెడ్డి, కార్తీక్, అగస్త్య, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.