మైత్రితో మహేష్ బాబు..

మైత్రితో మహేష్ బాబు..

హైదరాబాద్, 05 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో మరో ప్రాజెక్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన శ్రీమంతుడు సినిమాతో మైత్రీ వారు నిర్మాణ రంగంలోకి అడుగుపెటారు. మొదటి సినిమాతో మంచి లాభాలు అందుకున్న ఈ సంస్థ వరుసగా మీడియం బడ్జెట్ సినిమాలతో పాటు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ వస్తోంది. ప్రస్తుతం సర్కారు వారి పాట, అంటే సుందరానికి, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, పుష్ప: ది రూల్, మెగాస్టార్ - బాబీ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం, గోపీచంద్ మలినేని - బాలయ్య కాంబో సినిమా, విజయ్ దేవరకొండ - సమంత - శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రాలను ఈ సంస్థ నిర్మిస్తోంది. ఈ నెల 12న పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు - కీర్తి సురేశ్ జంటగా నటించిన సర్కారు వారి పాట భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అయితే, తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో మరో సినిమాను చేసేందుకు మహేశ్ ఒకే చెప్పాడట. సర్కారు వారి పాట విడుదల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాను, దాని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా సినిమాను మహేశ్ చేయనున్నాడు. ఆ తర్వాత ప్రాజెక్ట్ మళ్ళీ మైత్రీ నిర్మాతలతో ఉంటుందట. దీనిపై త్వరలోనే అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుందని సమాచారం.

Tags :