గొడవలు లేని కాపురమంటూ ఉండదు..

గొడవలు లేని కాపురమంటూ ఉండదు..

- రాజీవ్ తో విడిపోయే ప్రశ్నే లేదు..
- పుకార్లను నమ్మవద్దు..:  సుమ  
హైదరాబాద్, 27 ఏప్రిల్ ( ఆదాబ్ హైదరాబాద్ ) : 
నవ్వుల రాణి, మాటల మహారాణి సుమ కనకాల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యాంకర్‌గా, నటిగా, సింగర్‌గా ఇలా తనలోని ఎన్నో టాలెంట్‌లతో ప్రేక్షకులను అలరించి, అలరిస్తూనే ఉందావిడ. హీరోహీరోయిన్లకన్నా ఎక్కువ బిజీగా ఉండే ఈ స్టార్‌ మహిళ తాజాగా ఓ షోకి హాజరైంది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. తనకు చాలా ఆఫర్లు వచ్చాయి, కానీ ఓ మంచి సినిమా చేద్దామని ఇంతకాలం ఆగినట్లు తెలిపింది. అలా చివరకు జయమ్మ పంచాయితీ చేస్తున్నట్లు తెలిపింది. తన పూర్తిపేరు పల్లెశెన పాచిమిట్టిన సుమ అని పేర్కొంది. తెలుగు సినిమాల్లో పంచాయితీ పెద్దగా నటించిన ఐదుగురు హీరోల పేర్లు చెప్పమనగానే సుమ తడుముకోకుండా రజనీకాంత్‌, మోహన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, సంపూర్ణేశ్‌బాబు అని టపీమని చెప్పింది. తన కొడుకు గురించి మాట్లాడుతూ.. వాడు చిన్నప్పటి నుంచే హీరోలా మాట్లాడేవాడని నవ్వుతూ చెప్పుకొచ్చింది. ఇక రాజీవ్‌, సుమ విడిపోయారంటూ గతంలో వచ్చిన వార్తలపై స్పందించింది. రాజీవ్‌కు, తనకు ఇద్దరి మధ్యలో గొడవలు జరిగిన విషయం నిజమేనని, ఈ 23 ఏళ్ల కాలంలో ఎన్నోసార్లు గొడపడ్డామని తెలిపింది. కానీ భార్యాభర్తలుగా విడాకులు తీసుకోవడం సులువే కానీ తల్లిదండ్రులుగా డివోర్స్‌ తీసుకోవడం మాత్రం చాలా కష్టం అని భావోద్వేగానికి లోనైంది సుమ. కాగా సుమ ప్రధాన పాత్రలో నటించిన జయమ్మ పంచాయితీ మే 6న థియేటర్లలో విడుదల కానుంది.

Tags :