ప్రజాగ్రహానికి తలవంచిన నేత..

ప్రజాగ్రహానికి తలవంచిన నేత..

- శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స రాజీనామా.. 
- అధికార పార్టీ ఎంపీని చంపేసిన ఆందోళనకారులు...?
- కారులో వచ్చిన ఎంపీ అమరకీర్తి.. 
- అడ్డుకున్న ఆందోళన కారులు.. 
- తుపాకీ తీసి కాల్పులు జరిపిన ఎంపీ.. 
- ఓ భవనంలో తలదాచుకునే యత్నం.. 
- శవమై కనిపించిన ఎంపీ..  

కొలొంబో, 09 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
ప్రజాగ్రహానికి శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స తలవంచారు. ప్రధాని పదవికి రాజీనామా చేశారు. శ్రీలంక తీవ్రమైన ఆర్థిక, ఆహార సంక్షోభంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితికి దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ఆయన సోదరుడు, ప్రధాని మహింద రాజపక్సనే కారణమని శ్రీలంక ప్రజలు కొన్ని రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. రోడ్లపైకి వచ్చి ప్రజలు నిరసనలు చేపడుతున్నారు. సైన్యం రంగంలోకి దిగినప్పటికీ వారు లెక్క చేయలేదు. అధ్యక్షుడు, ప్రధాని అధికార నివాసాలపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు. ఈ క్రమంలో చాలా చోట్ల ఆందోళనలు హింసాత్మక రూపు దాల్చాయి. వీటిని కట్టడి చేయడానికి దేశ రాజధాని కొలంబోలో ఈరోజు కర్ఫ్యూ కూడా విధించారు. చివరకు విధిలేని పరిస్థితుల్లో ప్రధాని మహింద రాజపక్స కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు.

తాజాగా ఆందోళనకారులతో జరిగిన ఘర్షణల్లో అధికార పార్టీ ఎంపీ ఒకరు మరణించారు. ప్రజాపాలనపై ప్రభుత్వం అదుపు కోల్పోతోందనడానికి ఈ ఘటనే నిదర్శనం. కొలంబో రాజధాని వెలుపల నిట్టంబువా ప్రాంతంలో ఆందోళనకారులు భారీ ఎత్తున గుమికూడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఆ సమయంలో ఎంపీ అమరకీర్తి అతుకోరల తన కారులో అక్కడికి వచ్చారు. ఎంపీని చూడగానే ఆగ్రహంతో ఆందోళనకారులు ఆయన కారును చుట్టుముట్టారు. దాంతో ఎంపీ తుపాకీ తీసి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఆందోళనకారుల నుంచి తప్పించుకుని సమీపంలోని భవనంలో ఆశ్రయం పొందేందుకు ఎంపీ అమరకీర్తి ప్రయత్నించారు. కాసేపటి తర్వాత ఆయన శవమై కనిపించారు.

Tags :