శిధిలమవుతున్న శ్రీలంక..

శిధిలమవుతున్న  శ్రీలంక..


- నావికాదళ స్థావరంలో తలదాచుకున్న రాజపక్స కుటుంబం!
- శ్రీలంకలో కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభం.. 
- చేతులెత్తేసిన ప్రభుత్వం.. ప్రజ్వరిల్లిన ప్రజాగ్రహం.. 
- సాయుధ దళాలు రాజపక్ష అధీనంలోనే పనిచేస్తుండడం 
   ఊరటనిచ్చే అంశం.


కొలంబో, 10 మే : 

తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ద్వీప దేశం శ్రీలంక ఇప్పుడు హింసాత్మక ఆందోళనలతో అట్టుడుకుతోంది. ప్రధాని పీఠం నుంచి వైదొలిగిన మహీంద రాజపక్సకు నిరసన సెగ మాత్రం తప్పట్లేదు. ప్రధాని అధికారిక నివాసమైన టెంపుల్ ట్రీస్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకారులు గుమిగూడారు. భవనంలోకి చొరబడేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మహీంద కుటుంబాన్ని ట్రింకోమలిలోని నౌకాదళ స్థావరానికి తరలించినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. మంగళవారం ఉదయం వేలాది మంది ఆందోళనకారులు మహీంద కుటుంబం నివాసముంటున్న టెంపుల్ ట్రీస్ వద్దకు చేరుకున్నారు. బారికేడ్లను దాటుకుని భవనానికి అత్యంత సమీపంగా వచ్చారు. కొందు నిరసనకారులు భవనం కాంపౌండ్ లోకి పెట్రోల్ బాంబులు విసిరినట్లు అధికారులు తెలిపారు. కనీసం 10 పెట్రోల్ బాంబులతో దాడి చేసినట్లు తెలిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఆందోళనకారులపై భాష్పవాయువు ప్రయోగించారు. అనంతరం అత్యంత భద్రత నడుమ సైన్యం మహీంద, ఆయన కుటుంబసభ్యులను నేవీ స్థావరానికి తరలించినట్లు తెలిసింది.
ఈ నేవీ బేస్ కొలంబోకు 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే అక్కడ కూడా ఆందోళనలు వెల్లువెత్తాయి. ట్రింకోమలి నౌకాదళ స్థావరం వద్ద మహీంద, కొంత మంది కుటుంబసభ్యులు ఉన్నట్లు సమాచారం రాగానే నిరసనకారులు ఈ బేస్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టినట్లు సదరు మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరోవైపు మహీంద కుమారుడు నమల్ కుటుంబం కొలంబో వీడి రహస్య ప్రాంతానికి వెళ్లినట్లు మీడియా కథనాల సమాచారం.

కాగా, రాజపక్స కుటుంబం ఆశ్రయం పొందుతున్న నేవీ స్థావరం ఎదుట కూడా నిరసనలు భగ్గుమంటున్నట్టు తెలిసింది. ఈ నావికాదళ స్థావరం రాజధాని కొలంబోకు 270 కిలోమీటర్ల దూరంలో ఉంది.  సోమ‌వారం  కొలంబో వెలుపల ఆందోళనకారుల ఆగ్రహావేశాలకు గురైన అధికార పార్టీ ఎంపీ అమరకీర్తి అతుకోరల భయంతో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం తెలిసిందే. 1948లో స్వాతంత్ర్యం పొందాక శ్రీలంక అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవడం ఇదే ప్రథమం. ప్రస్తుతం శ్రీలంకలో ప్రభుత్వం దాదాపు పతనావస్థకు చేరుకున్నట్టే భావించాలి. అయితే, విస్తృత అధికారాలను తనవద్దే అట్టిపెట్టుకున్న దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాత్రం పాలన కొనసాగిస్తున్నారు. సాయుధ దళాలు తన అధీనంలోనే పనిచేస్తుండడం ఆయనకు ఊరటనిచ్చే అంశం.

Tags :