నేడు శంకర జయంతి..

నేడు శంకర జయంతి..


ధర్మానికి గ్లాని ఏర్పడినపుడు శిష్టరక్షణకై దుష్టశిక్షణకై తాను అవతారాన్ని ధరిస్తానని భగవద్గీతలో కృష్ణపరమాత్ముడు చెప్పాడు. ‘సంభవామి యుగే యుగే’ ధర్మగ్లాని అంటే జనులకు స్వధర్మాచరణ పట్ల శ్రద్ధా భక్తులు లోపించడం ధర్మాచరణ కించిత్తు కూడా ఆచరణ చేయకుండా ఉండటం. అలానే వేదాలలో... శాస్త్రాలలో చెప్పినదానికి విరుద్ధంగా ధర్మాన్ని ప్రబోధించి జనులను పక్కదోవ పట్టించి అవైదిక ధర్మ ప్రాబల్యం పెరగడం. అలాంటి సమయంలో పునః ధర్మప్రతిష్ట చేయడానికి భగవదవతారం జరుగుతుంది. కలియుగానికి వచ్చేసరికి జనులలోని రాక్షస ప్రవృత్తిని తీసివేయాలి. అంటే వారిని అధర్మమార్గం నుండి ధర్మమార్గం వైపు బుద్ధిని ప్రచోదించేలా చేయాలని, జ్ఞానభిక్ష పెట్టాలనీ సాక్షాత్తు పరమేశ్వరుడు ఆదిశంకరాచార్యుల రూపంలో ఆర్యాంబా శివగురువులనే పుణ్యదంపతులకు కేరళ రాష్ట్రం కాలడీ క్షేత్రంలో పూర్ణానదీ తీరాన వైశాఖ శుద్ధ పంచమి శుభతిథిన తేజోమూర్తిౖయెన శంకరాచార్యుల వారు జన్మించారు. శంకరులు బాల్యంలోనే అత్యంత ప్రజ్ఞాశాలిగా ఉండేవారు. ఆయన ఐదవ సంవత్సరంలో ఉపనయనాన్ని చేసుకొని అతి తక్కువ సమయంలో ఏ మానవ మాత్రునికి కూడా సాధ్యం కాని ‘అష్టవర్షే చతుర్వేదీ ద్వాదశీ సర్వశాస్త్రవిత్‌’ ఎనిమిదవ సంవత్సరంలో చతుర్వేదాలు 12 సంవత్సరాల వయస్సులోపు సర్వశాస్త్రాలను అధ్యయనం చేశారు. వేదాధ్యయన సమయంలో భిక్షాటనకై ఒక పేద వృద్ధురాలి ఇంటికి వెళ్లి యాచించగా ఆమె ఒక ఉసిరికాయను ఇచ్చింది. ఆమె దారిద్య్ర పరిస్థితిని చూసి చలించిపోయిన శంకరులు ‘కనకధారా స్తోత్రం’ ఆశువుగా స్తుతించారు. దానికి లక్ష్మీదేవి ప్రసన్నురాలై బంగారు ఉసిరికాయలను వర్షంగా కురిపించింది. శంకరుల సన్యాస ఆశ్రమ స్వీకారం కూడా చాలా విచిత్రంగా జరిగింది. సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో తల్లిని ఆనుమతి కోరారు. సన్యాసం స్వీకరిస్తే  తన ఒంటరి అవుతానన్న కారణంతో తల్లి అందుకు నిరాకరించింది. ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి వచ్చి ఆయనను పట్టుకుంది. తనను సన్యసించడానికి అనుమతిస్తే మొసలి వదిలేస్తుందని చెప్పారు. ఈ సంసారబంధాలు తనను మొసలిలా పట్టుకున్నాయని ఆ బంధాల నుండి తనను తప్పించమని కోరారు. దీనినే ఆతుర సన్యాసం అంటారు, సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తుండగానే ఆశ్చర్యంగా మొసలి శంకరులను విడిచి వెళ్లిపోయింది. తరువాత గురువుకోసం అన్వేషిస్తూ నర్మదా నదీతీరంలో ఉన్న గోవింద భగవత్పాదులను దర్శించి ఆయననే తన గురువుగా తెలుసుకొన్నారు. ‘షోడశే కృతవాన్‌ భాష్యం’ తరువాత మహోత్కృష్టమైన బ్రహ్మసూత్రాది గ్రంథాలకు భాష్యాన్ని రచించారు.
- పాలపర్తి సంధ్యా రాణి..

Tags :