ములుగు జిల్లాకు సమ్మక్క, సారక్క పేరు పెట్టాలి..

ములుగు జిల్లాకు సమ్మక్క, సారక్క పేరు పెట్టాలి..


- ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్.. 
- మిగతా జిల్లాలకు దేవుళ్ల పేరు పెట్టారు.. 
- ఇది గిరిజన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే.. 
- బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా ములుగు జిల్లాలో పర్యటన.. 
- గిరిజన యూనివర్సిటీ ఏమైంది..? 
- దొరల పాలనలో బహుజనుల బతుకులు మారవు.. 
  
హైదరాబాద్, 22 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క పేరు పెట్టాలన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మిగితా జిల్లాలకు స్థానిక దేవుళ్ల పేరు పెట్టి ములుగు జిల్లాను మాత్రం పట్టించుకోలేదని..ఇది గిరిజన ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని వ్యాఖ్యనించారు. తక్షణమే ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 300 రోజుల బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా ఇవాళ ములుగు జిల్లాలో ప్రవీణ్ కుమార్ యాత్ర కొనసాగింది. జోగులాంబ గద్వాల, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు పెట్టినట్లు, ములుగుకు సమ్మక్క సారక్క పేరు పెడితే ఏం అవుతుందని ఆయన ప్రశ్నించారు.

అదేవిధంగా  ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ కట్టిస్తామని చెప్పి ఎందుకు కట్టలేదో చెప్పాలన్నారు. దీనికి గట్టమ్మ దగ్గర భూమి కూడా సేకరించి..ఇప్పటికీ ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీశారు.  ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు సానుకూలంగా ఉన్న సీఎం కేసిఆర్ పేద గిరిజనుల కోసం ఏర్పాటు చేసే కాలేజీని ఎందుకు పట్టించుకోవడంలేదని నిలదీశారు. పేదల చదువుకోవడం కేసిఆర్ కు ఇష్టం లేదని,అందుకే ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు బస్ డిపో లేకపోవడం దారుణమన్నారు.

ఎన్నికల తర్వాత ప్రజలను మరిచిపోయే నాయకులకు బుద్ది చెప్పాలంటే వచ్చే ఎన్నికల్లో దొరల పార్టీని ఓడించి ఏనుగుకు ఓటేయాలని కోరారు. ఎంతోమంది ఇల్లు లేక అవస్థలు పడుతున్నారని, కరెంట్ కూడా లేని ఇళ్ళు ఎన్నో ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. దొరల పాలనలో బహుజనుల బతుకుల్లో ఎలాంటి మార్పు ఉండదని..మనకు న్యాయం జరగాలంటే అధికారంలో ఉండాలని సూచించారు.

Tags :