రాహుల్‌ స్పీచ్‌ ప్రగతి భవన్‌ నుంచే..

రాహుల్‌ స్పీచ్‌ ప్రగతి భవన్‌ నుంచే..

` వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కలిసి పోటీ.. 
` 35 అసెంబ్లీ, 4 లోక్‌సభ స్థానాలకు ఒప్పందం
` ఒంటరిగా పోటీ చేయలేకే రెండు పార్టీల పొత్తు..
` తెలంగాణ ద్రోహులంతా కేసీఆర్‌ పక్కనే..
` బండి సంజయ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

హైదరాబాద్, 08 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
’గతంలో మేం టీఆర్‌ఎస్‌తో కలిసి పోటీచేసిన సందర్భం లేదు. మా పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరు ఆ పార్టీలో కలవలేదు. మేం బహిరంగసభ పెట్టిన ప్రతిసారి కాంగ్రెస్‌ కూడా సభలు పెట్టుకోవడం అలవాటు అయింది. మమ్మల్ని ఒంటరిగా ఎదురుకోలేక అన్ని పార్టీలు కలిసి పోటీ చేయాలనుకుంటున్నాయి. ఇతర దేశాల నుంచి పార్టీలను తీసుకొచ్చినా.. మాకు వచ్చే నష్టం లేదు..’ 

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర 24వ రోజు పాలమూరు జిల్లా తిరుమల హిల్స్‌ గేట్‌ నుంచి అయ్యప్ప స్వామి టెంపుల్‌ వరకు కొనసాగింది. జడ్చర్ల నియోజకవర్గం నక్కలబండ తండాకు చేరుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ స్ట్రాటజీ ప్రకారం వ్యవహరిస్తూ బీజేపీపై ఆరోపణలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని నిర్ణయించుకున్నాయని చెప్పారు. 
    35 అసెంబ్లీ, నాలుగు లోక్‌సభ స్థానాలలో రెండు పార్టీలకు ఇప్పటికే ఒప్పందం కుదిరిందన్నారు. ఆ విషయం బయటపడటంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందని మళ్లీ గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. వరంగల్‌ సభలో రాహుల్‌ గాంధీ చదివిన ప్రసంగం స్క్రిప్ట్‌ ప్రగతి భవన్‌ నుంచే వచ్చిందని.. అందుకే ఆయన మాటల్లో ఎక్కడ కేసీఆర్‌ పేరు రాకుండా చూశారని అన్నారు. బీజేపీ రాష్ట్రంలో ఎవరితోనూ కలిసి పోటీ చేయాలన్న బండి.. తమను ఒంటరిగా ఎదురుకోలేక అన్ని పార్టీలు కలిసి పోటీ చేయాలనుకుంటున్నాయని అన్నారు. ఇతర దేశాల నుంచి పార్టీలను తీసుకొచ్చినా వచ్చే నష్టం ఏం లేదని ధీమా వ్యక్తం చేశారు. మంత్రివర్గంలో అవినీతి ఆరోపణలు లేని వారు ఎవరైనా ఉన్నారా..? అని ప్రశ్నించారు సంజయ్‌. వారి అక్రమాల చిట్టా అంతా తమ దగ్గర ఉందని తెలిపారు. తెలంగాణ ద్రోహులు అంతా కేసీఆర్‌ పక్కన ఉన్నారని విమర్శించారు.

 

Tags :