ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్ ధామి

ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్ ధామి

ఉత్తరాఖండ్ 12వ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రమాణం చేశారు. డెహ్రాడూన్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో ధామీతో లెఫ్టినెంట్ గవర్నర్ గుర్మీత్ సింగ్ ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు నడ్డా తదితరులు హాజరయ్యారు. ప్రమాణస్వీకారం అనంతరం పుష్కర్ ధామీ ప్రధాని ఆశీర్వాదం తీసుకున్నారు. సీఎం ప్రమాణస్వీకారం అనంతరం మంత్రులుగా సత్పాల్తో పాటు ధన్సింగ్ రావత్, గణేళిశ్ జోషి, రేఖా ఆర్య, సుబోధ్ ఉనియాల్, సౌరవ్ బహుగుణ, ప్రేమ చంద్ అగర్వాల్, చందన్ రామ్ దాస్లు సైతం మంత్రులుగా ప్రమాణం చేశారు. పుష్కర్ సింగ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం ఇది రెండోసారి కావడం విశేషం. మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓటమి పాలైనప్పటికీ తిరిగి ఆయనకు అధికార పగ్గాలను బిజెపి కట్టబెట్టింది. ఇంతకు ముందు జూలై 2021లో తీరత్ సింగ్ రాజీనామా తర్వాత బీజేపీ అధిష్టానం ధామీకి బాధ్యతలు అప్పగించింది. సోమవారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి మీనాక్షి లే సమక్షంలో బీజేపీఎల్పీ నేతగా ధామిని ఎన్నుకున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖతిమా అసెంబ్లీ స్థానం నుంచి ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయినా, అధిష్ఠానం ఆయనపై నమ్మకంతో సీఎం బాధ్యతలు అప్పగించింది. ప్రమాణ స్వీకారం అనంతరం ధామీ మాట్లాడుతూ గురువారం తొలి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇవాల్టి నుంచే రాష్ట్రాభివృద్ధి కసం పని చేస్తామన్నారు. రాబోయే దశాబ్దం ఉత్తరాఖండేదేనన్నారు.

Tags :