ఆగని రష్యా దాడులు..

ఆగని రష్యా దాడులు..

ఉక్రెయిన్, 20 మార్చి : ఉక్రెయిన్‌, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. గత 25 రోజులుగా రష్యా దాడిచేస్తున్నా.. ఉక్రెయిన్ మాత్రం పట్టవిడువడం లేదు. శాంతి చర్చలకు ఉక్రెయిన్ ముందుకొస్తలేదని ఓవైపు ఆరోపిస్తున్న రష్యా.. మరోవైపు తన దాడులను మాత్రం రోజురోజుకూ పెంచుతోంది. అటు ప్రజలు ఉంటున్న బిల్డింగ్స్, ఆస్పత్రులు, స్కూళ్లపైన.. ఇటు ఎయిర్ బేస్లు, మిలిటరీ స్థావరాలు, ఫ్యాక్టరీలపైన బాంబులువేస్తోంది. ఉక్రెయిన్ పై రష్యా ప్రారంభించిన దాడుల్లో ఇప్పటి వరకు 115 మంది చిన్నారులు చనిపోయారని ఉక్రెయిన్ పార్లమెంట్ ప్రకటించింది. క్రూయిజ్ క్షిపణులతో 400 మంది ఆశ్రయం పొందుతున్న ఓ ఆర్ట్ స్కూల్ పై మాస్కో సేనలు దాడులు చేశాయి. భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం.  క్షిపణుల దాడుల్లో కుప్పకూలిన భవన శిథిలాల కింద వందల మంచి చిక్కుకున్నారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రారంభించిన యుద్దంలో ఇప్పటి వరకు 115 మంది అమాయక చిన్నారులు కన్నుమూశారని మరో 140మందికిపైగా గాయపడ్డారని ఉక్రెయిన్ పార్లమెంట్ పేర్కొంది. ‘ఇవి సంఖ్యలు కావు.. వందలాది ఉక్రెనియన్ కుటుంబాల తీరని శోకానికి కొలమానం..’ అంటూ ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేసింది. 

రష్యా బాంబు దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్ దేశానికి ఆస్ట్రేలియా సాయం ప్రకటించింది. ఉక్రెయిన్ కు మిలటరీతో పాటు..మానవతా సాయం అందిస్తామని తాజాగా ఆస్ట్రేలియా ప్రకటించింది. 21 మిలియన్ డాలర్ల మిలటరీ సాయం.. 21 మిలియన్ డాలర్ల మానవతా సాయం ప్రకటించారు. మరోవైపు రష్యా అల్యూమినియం, బాక్సైట్ ఎగుమతులను ఆస్ట్రేలియా నిలిపివేసింది. 

నల్ల సముద్రంపై నౌకల నుంచి రష్యా దాడులు
ఉక్రెయిన్ పై బాంబులు, క్షిపణులతో రష్యా దాడులు ముమ్మరం చేసింది. ఇటు నల్ల సముద్రం, కాస్పియన్ సముద్రంలోని నౌకల నుంచి ఉక్రెయిన్ పై క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేసింది. మరోవైపు పోర్ట్ సిటీ మరియుపోల్ పై బీకరదాడులు కొనసాగుతున్నాయి. 400 మంది ఆశ్రయం పొందుతున్న ఓ ఆర్ట్ స్కూల్ పై మాస్కో సేనలు దాడులు చేశాయి. భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద వందల మంచి చిక్కుకున్నారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. 

కాగా తొలిసారిగా కింజాల్ (డ్యాగర్) హైపర్ సోనిక్ మిసైల్నూ ప్రయోగించింది. నాటో సభ్య దేశం రొమేనియాకు బార్డర్లో, పశ్చిమ ఉక్రెయిన్ లో ఉన్న ఇవనో ఫ్రాన్కివిస్క్ ఏరియాలోని డెలియటిన్ గ్రామం వద్ద అండర్ గ్రౌండ్ లో మిసైల్స్, పేలుడు పదార్థాలను దాచి ఉంచిన గోడౌన్ను కింజాల్ క్షిపణితో పేల్చేసినట్లు శనివారం రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ధ్వని వేగం కంటే 10 రెట్లు స్పీడ్ గా.. గంటకు 12,250 కిలోమీటర్లు దూసుకెళ్లే కింజాల్ క్షిపణులను ఉక్రెయిన్ పై రష్యా ప్రయోగించడం ఇదే మొదటిసారి అని రష్యన్ మీడియా సంస్థ ఆర్ఐఏ నొవస్తి వెల్లడించింది. కింజాల్ మిసైల్ను అడ్డుకునే రక్షణ వ్యవస్థలు ప్రస్తుతం ఏ దేశం వద్దా లేవని తెలిపింది. 2011 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసంచేసే కింజాల్ క్షిపణితో అణ్వాయుధాలు కూడా ప్రయోగించవచ్చని అనుమానం వ్యక్తం చేసింది..

Tags :