నా కూతురెక్కడ..? రోధిస్తున్న ఓ తల్లి.. కడుపుకోత మిగిల్చిన కారుచిచ్చు..

నా కూతురెక్కడ..? రోధిస్తున్న ఓ తల్లి.. కడుపుకోత మిగిల్చిన కారుచిచ్చు..

- ఢిల్లీ అగ్నిప్రమాదం ఘటనలో ఇద్దరి అరెస్టు
- పరారీలో బిల్డింగ్‌ ఓనర్‌ మనీష్‌ లక్రా 
- ఘటనా స్థలిని పరిశీలించిన సిఎం కేజ్రీవాల్‌
- మృతుల కుటుంబాలకు 10లక్షల చొప్పున సాయం
- 2లక్షల చొప్పున సాయం ప్రకటించిన ప్రధాని

నా కూతురు ఎక్కడుందో చెప్పండని ఓ తల్లి వేడుకుంటుంది... కూతురు కనిపించడం లేదని, అన్ని ఆస్పత్రులకు తిరిగానని రోధించింది. సీసీ టీవీ ప్యాకేజింగ్‌ సంస్థలో పనిచేస్తున్న పూజా అనే అమ్మాయి అసలు ప్రాణాలతో ఉందో లేదో తెలియక.. ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. ఈ ప్రమాదం గురించి రాత్రి తొమ్మిది గంటల సమయంలో తెలిసిందని, నలుగురం ఉన్న తమ కుటుంబం ఆమె మీద ఆధారపడి ఉందని ఆ తల్లి కన్నీరుమున్నీరైంది. ఇదిలా ఉంటే తమవారు కనిపించడం లేదంటూ అధికారులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. ఇదంతా చూస్తే మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. బాధిత కుటుంబ సభ్యులు తమ వారి ఆచూకీ కోసం సంజయ్‌ గాంధీ మెమోరియల్‌ ఆస్పత్రి వద్ద పడిగాపులు కాస్తున్నారు.

న్యూ ఢిల్లీ, 15 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :

ఢిల్లీ  అగ్నిప్రమాదం ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. మొత్తం ముగ్గురిపై కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాలు, రూటర్‌ ఆఫీస్‌ ఓనర్లు హరీశ్‌ గోయల్‌, వరుణ్‌ గోయల్‌ను అదుపులోకి తీసుకున్నారు. బిల్డింగ్‌ ఓనర్‌ మనీష్‌ లక్రా పరారీలో ఉన్నారు. అగ్నిమాపక శాఖ నుంచి సేప్టీ క్లియరెన్స్‌ లేదని అధికారులు గుర్తించారు. దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 27 మంది సజీవ దహనమయ్యారు. మరో 12 మందికి గాయాలు కాగా సహాయ బృందాలు 50మందిని రక్షించాయి. మరికొందరు ప్రాణాలు రక్షించుకునేందుకు భవనం పైనుంచి కిందకు దూకారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 32కు చేరుకుందని సమాచారం. ప్రమాదం సమయంలో రెండో ప్లోర్‌ లో మోటివేషనల్‌ స్పీచ్‌ ఈవెంట్‌ జరుగుతుందని తెలిపారు అధికారులు. ఆ ప్రోగ్రామ్‌ కు చాలా మంది హాజరవడంతో సెకండ్‌ ఫ్లోర్‌లో ఎక్కువ మరణాలు జరిగాయన్నారు. బయటకు వెళ్లేందుకు మెట్ల దారి ఒకటే ఉండటంతో.. ప్రజలు తప్పించుకోలేకపోయారన్నారు. గాయపడిన వారికి సంజయ్‌ గాంధీ హాస్పిటల్‌ లో చికిత్స అందిస్తున్నారు. దీంతో హాస్పిటల్‌ దగ్గరికి భారీగా చేరుకున్నారు బాదితుల కుటుంబసభ్యులు. తమ వారి ఆచూకీ కోసం పలువురు కన్నీరుపెట్టుకున్నారు. ప్రమాద బాధితుల కోసం హాస్పిటల్‌ దగ్గర హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేసినట్లు సివిల్‌ డిఫెన్స్‌ ఆఫీసర్‌ ఎస్పీ తోమర్‌ తెలిపారు. గాయపడిన వారు, తప్పిపోయిన వారికి సాయం చేసేందకు డెస్క్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పశ్చిమముండ్కా మెట్రో స్టేషన్‌ సమీపంలోని నాలుగంతస్తుల వాణిజ్య భవనంలో మంటలు చెలరేగాయి. నిన్న సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు ప్రమాద సమాచారం అందినట్లు తెలిపారు ఢల్లీి చీఫ్‌ ఫైర్‌ సర్వీస్‌ ఆఫీసర్‌ అతుల్‌ గార్గ్‌. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ముప్పైకి పైగా ఫైరింజన్లతో అతి కష్టం మీద మంటలార్పామన్నారు. ఫస్ట్‌ ప్లోర్‌ లోని సీసీటీవీ కెమెరాలు, రూటర్‌ తయారీ కంపెనీలు మంటలు చెలరేగాయని.. అక్కడి నుంచి భవనమంతా వ్యాపించి నట్లు తెలిపారు. బిల్డింగ్‌ అంతా పొగ నిండిపోవడంతో.. అందులోని వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో.. మొదటి, రెండు అంతస్తుల్లోని అద్దాల కిటికీలు పగులగొట్టి పై నుంచి కిందకు దూకారు. మరికొందరు తాళ్ల సాయంతో కిందికి దిగారు. ఢిల్లీ అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడినవారికి 50 వేల చొప్పున ప్రధాని పరిహారం ప్రకటించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ శనివారం ప్రకటించారు. గాయపడినవారికి రూ. 50 వేలు చొప్పున అందజేయనున్నట్లు వెల్లడిరచారు. శనివారం ఉదయం సిఎం అరవింద్‌ కేజీవ్రాల్‌ ముండ్కాలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఘటనపై విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించిందని, నిందితులను విడిచిపెట్టబోమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ భవనంలో ఒకవైపు మాత్రమే మెట్లు ఉండటంతో ప్రజలు భవనం నుంచి తప్పించుకోలేకపోయారని అగ్నిమాపక శాఖ డివిజనల్‌ అధికారి తెలిపారు.

Tags :