ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు

ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు

భారత్లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా... ప్రధాని నరేంద్ర మోడీతో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో జపాన్ ప్రధాని కిషిడాకు.. మోడీ స్వాగతం పలికారు. అనంతరం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు గురించి చర్చించినట్టు తెలుస్తోంది. భారత్, జపాన్ల మధ్య 14వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో ఇరు దేశ ప్రధానులు, ప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సులో భారత్, జపాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఇండో-పసిఫిక్ లో శాంతి, స్థిరత్వం, ఇరు దేశాల మధ్య సహకారంపై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్పై రష్యా యుద్ధం గురించి కూడా చర్చించినట్టు సమాచారం. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ పీఎం కిషిడాల మధ్య జరిగిన శిఖరాగ్ర చర్చల్లో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, ప్రపంచ అంశాలు కూడా ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్బీ తెలిపారు. అంతకుముందు ఇండియాకు చేరుకున్న జపాన్ ప్రధాని కిషిడాకు ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ స్వాగతం పలికారు. ఆదివారం రాత్రి 8 గంటలకు తిరుగు ప్రయాణం కానున్నారు. ఇక్కడ నుంచి ఆయన కంబోడియా వెళ్లనున్నారు. అయితే ఆయన భారత్ కు వచ్చే ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్పై రష్యా దాడి చేయడం ఆమోద యోగ్యం కాదని, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అలాంటి చర్యలను ఎప్పటికీ అనుమతించరాదని కిషిడా అన్నారు..

Tags :