మోడీ ప్రాపర్టీస్ బరితెగింపుపై నిగ్గు తేల్చండి..

మోడీ ప్రాపర్టీస్ బరితెగింపుపై నిగ్గు తేల్చండి..

 

- ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు..  
- రైల్వే ట్రాక్ బఫర్ జోన్ దురాక్రమణ..  
- జీఓ నెంబర్ 168 నిబంధనలు మంట కలిపిన అక్రమార్కులు..  
- 1950 నుండి 1997 వరకు రెవిన్యూ రికార్డులున్నాయి.. ..  
- 1998 నుండి రెవిన్యూ రికార్డులు గల్లంతు.. 
- మాయమైన రికార్డులపై పోలీస్ స్టేషన్ లో కేసు ఎందుకు పెట్టలేదు..?
- రెవిన్యూ రికార్డుల మాయం వెనుక మతలబేంటి..? 
- మోడీ ప్రాపర్టీస్ ఆక్రమించిన ప్రభుత్వ భూమి విలువ 
   దాదాపు రూ. 100 కోట్ల పైమాటే..! 
- సమాచార హక్కు చట్టం ద్వారా బట్టబయలైన వాస్తవాలు.. 

హైదరాబాద్, 05 ఏప్రిల్ (ఆదాబ్ హైదరాబాద్) : 
మల్లాపూర్ లో మోడీ ప్రాపర్టీస్ అనే నిర్మాణ సంస్థ ప్రభుత్వ ( గైయిరాన్ సర్కార్ ) భూమిలో అక్రమ నిర్మాణాలు సాగిస్తూ బరితెగింపుకు పాల్పడింది..  రైల్వే ట్రాక్ బఫర్ జోన్ లో దురాక్రమణకు పాల్పడటమే కాకుండా జీఓ నెంబర్ 168 నియమ నిబంధనలను మంట కలుపుతూ అక్రమాలకు తెగపడింది.. ప్రభుత్వ భూమిలో బహుళ అంతస్థుల అక్రమ నిర్మాణాలు చేపట్టి నకిలీ పత్రాలతో అమాయకులకు వలవేసి కొనుగోలుదారుల నుండి కోట్ల రూపాయలు కొల్లగొడుతూ శఠగోపం పెట్టేందుకు కుయుక్తులు పన్నింది...  మోడీ ప్రాపర్టీస్ లో ప్లాట్లు కొనుగోలు చేస్తే ఫట్టే అన్నట్లుగా సమాచార హక్కు చట్టం ద్వారా తీగ లాగితే డొంక కదిలి వాస్తవాలు బట్ట బయలైయ్యాయి..

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా, ఎల్ బి నగర్ జోనల్ పరిధి, ఉప్పల్ రెవిన్యూ కాప్రా సర్కిల్, మల్లాపూర్ డివిజన్ కేంద్రంగా మోడీ ప్రాపర్టీస్ అనే నిర్మాణ సంస్థ అక్రమాలకు తెగబడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు..  ప్రభుత్వ సర్వే నెంబర్ 85 లో 13 ఎకరాల 36 గుంటలు గైయిరాన్ సర్కార్ ( ప్రభుత్వ భూమి ) ఉన్నట్లు రెవెన్యూ  రికార్డులైన సేత్వార్, ఖాస్రా పహాణి రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.. గైయిరాన్ సర్కార్ భూమంటే నిజాం కాలంలో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పశువులు మేపు కొనేందుకు కేటాయించిన స్థలంగా రెవిన్యూ అధికారులు పేర్కొంటున్నారు.. 1950 నుండి 1997 వరకు రెవిన్యూ రికార్డులు ఉండగా..  1998 తరువాత సంబంధిత రెవిన్యూ రికార్డులు మాయమైనట్లు సమాచార హక్కు చట్టం ద్వారా బట్ట బయలైంది.. 1998 నుండి తమ వద్ద సర్వే నెంబర్ 85 కు సంబంధించిన రికార్డులు లేవని   రెవిన్యూ అధికారులు చేతులెత్తేశారు.. అయితే తహశీల్ధార్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులు మాయమైనప్పుడు స్థానిక తహశీల్ధార్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాలి.. కానీ ఆ దిశగా కేసు నమోదు చేయక పోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.. రికార్డులు మాయమయ్యాయి అంటే అందులో అవినీతి దాగి ఉందని గతంలో కేంద్ర సమాచార కమిషనర్ పలుమార్లు తెలిపిన విషయం విదితమే.. 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుంటే రెవెన్యూ అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం పట్ల కోట్ల రూపాయలు చేతులు మారాయని స్థానిక ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.. వెంకట రామారావు అనే వ్యక్తి మోడీ ప్రాపర్టీస్ నిర్మాణ సంస్థకు బై నెంబర్ల ద్వారా  విక్రయించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.. వెంకట రామారావు అనే వ్యక్తికి ఈ గైయిరాన్ సర్కార్ భూమి ఎలా సంక్రమించింది అనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది.. సర్వే నెంబర్ 85లో గల ప్రభుత్వ భూమికి ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్ (ఓ.ఆర్.సి.) ఒకవేళ  వెంకట రామారావు అనే వ్యక్తికి ప్రభుత్వం జారీ చేసి ఉంటే ఆ  ఓ.ఆర్.సి. నెంబర్ వివరాలను రెవిన్యూ రికార్డులో పొందపర్చాల్సి ఉంటుంది.. కానీ 1998 నుండి రెవెన్యూ  రికార్డులు కార్యాలయం నుండి మాయమవ్వడం వెనుక అంతర్యం ఏమిటన్నది నాటి రెవిన్యూ అధికారులకే తెలియాలి... 

చేతులు మారిన సొమ్మెంత..?
అర్ద, అంగ, రాజకీయ బలముంటే బంగాళాఖాతంలో కూడా జీ.హెచ్.ఎం.సి. అధికారులు నిర్మాణ అనుమతులు జారీ చేస్తారనేందుకు మోడీ ప్రాపర్టీస్ నిర్మాణ సంస్థ ప్రభుత్వ భూమిలో సాగిస్తున్న అక్రమ నిర్మాణాలే సాక్షంగా చెప్పవచ్చును.. తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా కేంద్ర రంగ సంస్థ అయిన సౌత్ సెంట్రల్ రైల్వే  అధికారులు భారీ మొత్తంలో ముడుపులు తీసుకుని ఎన్.ఓ.సి. జారీ చేస్తే..  జి.ఓ. నెంబర్ 168ను కాలరాస్తూ.. జీ.హెచ్.ఎం.సి. ప్రధాన కార్యాలయ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండా రైల్వే బఫర్ జోన్ సరి హద్దు (బౌండరీ) నుండి 30 మీటర్లు అనగా 100 అడుగులు మినహాయించి నిర్మాణాలు చేపట్టాలని జీఓ నెంబర్ 168 స్పష్టం చేస్తుంది.. మరోవైపు విద్యుత్ సబ్ స్టేషన్ కు సంబంధించిన భూమిలో 30 మీటర్ల బఫర్ జోన్ వదిలి నాడు సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టారు.. కానీ మోడీ ప్రాపర్టీస్ నిర్మాణ సంస్థ నిర్మాణాలు చేపట్టిన బహుళ అంతస్థుల భవనాలు మొత్తం దాదాపుగా రైల్వే బఫర్ జోన్ లోనే ఉన్నట్లు ప్రత్యక్షంగా చూస్తే తేట తెల్లమవుతుంది.. సర్వే   నెంబర్ 85 నోమా ఫంక్షన్ హల్  పార్కింగ్ పక్కన బీసీ లకు చెందిన స్మశాన వాటిక మొదలుకొని రైల్వే ట్రాక్ అవతలి వైపు ఉన్న మైసమ్మ గుడి వరకు ప్రభుత్వ భూమేనని రెవిన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. దక్షిణం వైపు బీసీల స్మశాన వాటిక, ఉత్తరం వైపు విద్యుత్ సబ్  స్టేషన్ సర్వే  నెంబర్ 85 లో ఉండగా మధ్యలో  ఉన్న మోడీ ప్రాపర్టీస్ స్థలం ప్రయివేటు స్థలం ఎలా అవుతుందో..? రెవెన్యూ అధికారులే నిగ్గు తేల్చాల్సి ఉంది.. ఏది ఏమైనప్పటికీ సౌత్ సెంట్రల్ రైల్వే, జీ.హెచ్.ఎం.సి.  అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు ముట్ట చెప్పడం తోనే అక్రమాలు సక్రమామయ్యని డివిజన్ ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు...

Tags :