మైనార్టీ విద్యాసంస్థలా..వ్యభిచార కూపాలా..?

మైనార్టీ విద్యాసంస్థలా..వ్యభిచార కూపాలా..?

యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరులోని మైనార్టీ బాలికల వసతిగృహంలో జరుగుతున్న దురాగతాలను వివరిస్తూ.. ఓ బాలిక జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులు, ఎమ్మెల్యే, పోలీసులు, మీడియా ప్రతినిధులకు లేఖ రాయడం కలకలం రేపింది. ఈ లేఖపై స్పందించిన జిల్లా బాలరక్షక్ బృందం, సఖీ కేంద్రం , యాదాద్రి భువనగిరి జిల్లా బృందం కలిసి సంయుక్తంగా విచారణ చేపట్టడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న ఓ బాలిక రాసిన ఉత్తరం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. జిల్లా మైనార్టీ అధికారి, జిల్లా కలెక్టర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, స్థానిక ఎస్ఎ, మీడియా రిపోర్టర్లను వేడుకుంటూ ఆ బాలిక రాసిన ఉత్తరంలో విస్తుగొలిపే విషయాలను వెల్లడించినట్లు సమాచారం. ఆలేరు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో పనిచేసే కొంతమంది సిబ్బంది బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండటంతో పాటు లైంగికంగా వేధిస్తున్నారని, వారి బారి నుంచి తమను కాపాడాలంటూ బాలిక వేడుకోవడాన్ని బట్టి చూస్తే.. మైనార్టీ గురుకులాల విద్యా వ్యవస్థ ఎంతగా దిగజారిపోయిందో అర్ధం చేసుకోవచ్చు.

 

సిబ్బంది అసభ్య ప్రవర్తనలతో :

 

రెసిడెన్షియల్ స్కూల్ సెక్యురిటీ గార్డులుగా పనిచేస్తున్న గౌస్, సాజియాలు హాస్టల్ సీక్ రూమ్ లో బట్టలు లేకుండా అసభ్యకర రీతిలో తిరుగుతుంటారని, ఆడపిల్లలు స్నానం చేస్తుండగా గదుల్లోకి దూరి నీచంగా ప్రవర్తిస్తున్నారని.. బాలిక తాను రాసిన లేఖలో తెలిపింది. దీంతో పాటు బయటి నుంచి కొందరు వ్యక్తులను తీసుకొచ్చి వారికి శారీరక సుఖం అందించాలని తరుచూ వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొంది. హాస్టల్ కు సమీప దూరంలో స్కూల్ లో పనిచేసే కొందరు సిబ్బంది గదులు అద్దెకు తీసుకుని ఉంటున్నారని, చాలామంది అమ్మాయిలను అక్కడికి తీసుకెళ్లి శారీరక వాంఛలు తీర్చమంటున్నారని బాలిక తెలిపినట్లు సమాచారం. అర్ధరాత్రి 12 గంటల సమయంలో బాలికలను నిద్రలేపి వేరే చోటికి తీసుకెళ్తున్నారని, పరాయి వ్యక్తుల పక్కన పడుకోబెట్టి భారీగా డబ్బులు తీసుకుంటున్నారని తెలిపింది. తమకు ఇష్టం లేదని చెప్పినా.. నొప్పిగా, బాధగా ఉందని చెప్పినా వినిపించుకోకుండా.. చిత్రహింసలకు గురిచేస్తున్నారని వాపోయింది. పైగా ఈ విషయం బయటికి చెబితే టీసీలు ఇచ్చి ఇంటికి పంపించేస్తామని బెదిరిస్తున్నారని తెలిపింది. వారి మాటలు వినకపోతే శారీరకంగా చిత్రహింసలకు గురిచేయడంతో పాటు, భోజనం కూడా పెట్టడం లేదని ఉత్తరంలో తెలిపింది. ఆ కామాంధుల బారి నుంచి తమను రక్షించాలని బాలిక లేఖలో వేడుకుంది.

 

అది తప్పుడు లేఖ : స్కూల్ ప్రిన్సిపల్

 

అయితే, ఈ స్కూల్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న గౌస్, అతడి భార్య సాజియా ప్రవర్తనను తప్పుబడుతూ ఓ లేఖ బయటపడటం వివాదానికి దారితీసింది. దీనిపై స్కూల్ ప్రిన్సిపల్ స్పందిస్తూ.. లేఖలో ఉన్నదంతా కట్టుకథని స్పష్టం చేస్తున్నారు.. తమ వద్ద ఆయాగా పనిచేసే అర్షియా నుంచి ఆమె భర్త విడాకులు తీసుకున్నాడని.. అతడే ఇలాంటి లేఖను ఉద్దేశపూర్వకంగా సృష్టించి స్కూల్ పరువు తీయాలని చూస్తున్నాడని ఆరోపిస్తున్నారు. వారిద్దరి మధ్య గొడవను స్కూల్ మీద రుద్దారని విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే కలెక్టర్ కి, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆమె వెల్లడించారు.

 

నిస్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కోరుతున్న తల్లిదండ్రులు :

 

ఆలేరు పట్టణంలోని కొలనుపాక రోడ్డులో 2017లో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించారు. ఇక్కడ ఐదో తరగతి నుంచి ఇంటర్ ఫస్టియర్ వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్ లో మొత్తం 330 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. వీరిలో 9వ తరగతి 59, పదో తరగతి 41 మంది, ఇంటర్ ఫస్టియర్ 38 మంది చదువుతుండగా...మిగిలిన 192 మంది విద్యార్థినులు 5-8 తరగతులు చదువుతున్నారు. ఇదే విద్యా సంస్థకు చెందిన బాలిక రాసిందని ప్రచారం జరుగుతున్న ఉత్తరంతో ఆలేరు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ పై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జరిగిన సంఘటన నిజమా లేక అబద్దమా.. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, భవిష్యతులో ఇలాంటి సంఘటనలకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Tags :