కేసీఆర్ కు ఘోరి కడతాం..

కేసీఆర్ కు ఘోరి కడతాం..

చేవెళ్ల /మొయినాబాద్, 22 మార్చి  (ఆదాబ్ హైదరాబాద్ ) : మేధావులకే మేధావి అయిన అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాల కంటే గొప్పదని, అలాంటి రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే సీఎం కేసీఆర్ కు ఘోరి కడతాం అని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మంద కృష్ణ మాదిగ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ నియోజకవర్గ సన్నాహక సదస్సు కార్యక్రమం..  మండల ఎమ్మార్పిస్ ఇంచార్జీ కాడిగల్ల ప్రవీణ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మందకృష్ణ చేరుకుని మాట్లాడారు. దేశ రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని గుర్తుచేస్తుంటే..  కేసీఆర్ పాలన రాజరిక పాలనను గుర్తుచ్చేస్తోందని, ఈ దేశ రాజ్యాంగం వ్యక్తులకు మాట్లాడే స్వేచ్ఛను గుర్తుచేస్తుంటే.. కేసీఆర్ పాలన మాత్రం వారిని అణచివేతకు గెచేస్తోందని, రాజ్యాంగం అందరికి సమాన అవకాశాలను ఇవ్వాలంటే.. కేసీఆర్ మాత్రం ఇష్టమొచ్చిన వారిని పదవులలో నియమింపజేస్తూ..  అగ్రకుల దురహంకారిగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నాడని మందకృష్ణ ఫైర్ అయ్యారు. రాజ్యాంగం ద్వారానే మహిళలకు, అన్ని వర్గాల వారికీ స్వేచ్ఛ వచ్చిందని..  దీనిలో భాగంగానే ఇందిరా గాంధీ, మోడీ లు ప్రధాన మంత్రులుగా  ఎన్నికయ్యారని, ఇప్పుడు అట్లాంటి భారత రాజ్యాంగాన్నే కేసీఆర్ మార్చుతానని వెర్రి కూతల కూయటం వెనుక ఎవరి హస్తం దాగి ఉందో..? ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల ప్రజలు తెలుసుకోవాలన్నారు. దేశంలోని తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ లు ఉంటే,  తెలంగాణలో మాత్రం రాజ్యాంగాన్ని స్ఫూర్తికి విరుద్ధంగా కేసీఆర్ రిజర్వేషన్ లను అమలు చేస్తూ..  బహుజన ప్రజలను మోసం చేస్తున్నాడని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ సీఎం అయ్యాడని గుర్తుచేశారు. ప్రపంచం అంతా అంబేద్కర్ ను గౌరవిస్తుంటే..  కేసీఆర్ మాత్రం గౌరవించటం లేదన్నారు. వైఎస్సార్ సీఎంగా  ఉన్నపుడు ప్రాణహిత చేవెళ్లకు అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల పెడితే..  కేసీఆర్ మాత్రం ప్రాజెక్టు రీడిజైనింగ్ చేసి, వేల కోట్లు దండుకుని అంబేద్కర్ పేరును తొలగించి కాళేశ్వరం ప్రాజెక్టు పేరు పెట్టడం దారుణమన్నారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితున్ని చేస్తానని చేయలేదన్నారు.  సీఎం కాకముందు తెలంగాణ భవన్ లో అంబేద్కర్ ఫోటో ఉంటే, ఇప్పుడు దాని స్థానంలో కేసీఆర్ ఫోటో పెట్టుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటికీ నుండి ఒక్కసారి కూడా ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహానికి దండ కూడా వేయలేదు కానీ..  బాపూఘాట్, ఎర్రవల్లిలో గాంధీ విగ్రహానికి దండ వేసి అంబేద్కర్ ను అవమానించాడని మందకృష్ణ గరం అయ్యాడు. రాజ్యాంగ పరిరక్షణ కోసం విద్యార్థులు సిద్ధం కావాలని కోరారు. వచ్చే నెల 9న హైదరాబాద్ లో జరిగే రాజ్యాంగ పరిరక్షణ యుద్ధ భేరిని జయప్రదం చేయాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఎమ్మార్పిఎస్ నాయకులు, బీసీ నాయకులు, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags :