కలెక్టర్ గారూ నీటి నాణ్యత ప్రయోగశాలను వెంటనే తెరిపించండి..

కలెక్టర్ గారూ నీటి నాణ్యత ప్రయోగశాలను వెంటనే తెరిపించండి..


- కరీంనగర్ జిల్లా కలెక్టరుకు బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి వినతి..
- మూడు నెలలుగా ఆఫీసుకు తాళం వేసి ఉన్న పట్టించుకోని అధికారులు... 
- కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వీడండి.. 

హైదరాబాద్, 13 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 33 లక్షల పైగా జనాభాకు సంబంధించిన మూడవ జోన్ మొత్తంలో ఏకైక కేంద్రమైన నీటి నాణ్యత ప్రయోగశాల మూడు నెలలకు పైగా తాళం వేసి ఉన్నా..  అధికారులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని, ఇప్పటికైనా దీనిని వెంటనే తెరిపించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన వినతి పత్రంలో కోరడమైనది. ఈ నీటి నాణ్యత ప్రయోగశాల ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రీవెంటివ్ మెడిసీన్ డైరెక్టర్ పర్యవేక్షణలో నడుస్తున్నదని, ఈ నీటి నాణ్యత ప్రయోగశాల కేంద్రం గత నాలుగు నెలలుగా కార్యాలయానికి తాళం వేసి ఉండడంతో, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు అన్ని మున్సిపాలిటీలలో త్రాగు నీరు కలుషిత నీటి పరీక్షలు లేకపోవడంతో, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నీటిలో ఉన్న ప్రమాద బాక్టీరియాలు, క్లోరిన్ శాతం, కలుషిత వ్యర్దాలతో ప్రజలకు అతిసార, టైఫాయిడ్, జాండీస్ లాంటి ఎన్నో ప్రాణాంతక వ్యాధులు సోకి, ప్రజల ప్రాణాలు గాల్లో కలిసే అవకాశం ఉందని, ఎందుకంటే మనుషులకు వచ్చే రోగాల్లో దాదాపు 80 శాతం కేవలం తాగునీటి తోనే వస్తాయని అనేక సందర్భాల్లో వైద్యులు చెప్పిన విషయం ఈ సందర్భంగా బేతి మహేందర్ రెడ్డి గుర్తు చేశారు. ఈ ల్యాబ్ 1992 లో ప్రారంభం అయిందని, ఈ నీటి నాణ్యత పర్యవేక్షణ ల్యాబ్ లో మొత్తం స్టాఫ్ 6 పోస్టులు కేటాయించగా అందులో జూనియర్ అనలిస్ట్, ల్యాబ్ టెక్నిషియన్, ల్యాబ్ అటెండెంట్, క్లర్క్, ఇద్దరు సంపిల్ టేకర్స్ ఉండేవారని, కానీ గత మూడు ఏళ్లకు పైగా ఇందులో నుండి అయిదు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఉన్న ఒక ఉద్యోగిని కూడా 317 జీ.ఓ లో భాగంగా జనవరిలో భద్రాద్రి జోన్ కు బదిలీ చేయడంతో ఆఫీసుకు తాళం పడ్డదని ఆయన జిల్లా కలెక్టరుకు తెలిపారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా నగరంలోని తాగునీటి నాణ్యత ప్రమాణాల ప్రయోగశాల కేంద్రాన్ని వెంటనే తెరిపించి గతంలో కేటాయించిన మొత్తం 6 పోస్టులు తిరిగి నియమించాలని ఆయన జిల్లా కలెక్టరుకు ఇచ్చిన వినతి పత్రంలో కోరినారు.

Tags :