బీసీ స్టడీ సర్కిళ్లలో కోచింగ్..

బీసీ  స్టడీ సర్కిళ్లలో కోచింగ్..

- అడ్మిషన్ల కోసం 16న ఆన్ లైన్ ఎంట్రన్స్ టెస్ట్.. 

హైదరాబాద్, 06 ఏప్రిల్ ( ఆదాబ్ హైదరాబాద్ ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే 80,039 ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్లకు వెనుకబడిన, బీసీ వర్గాల అభ్యర్థులకు నాణ్యమైన కోచింగ్ అందించడానికి బీసీ మంత్రిత్వ శాఖ సకల సన్నాహాలు చేసింది. దాదాపు 50 కోట్ల రూపాయల ఖర్చుతో, బీసీ స్టడీ సర్కిళ్లు, సెంటర్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 1,25,000 మందికి పైగా ఉచిత కోచింగ్ నిర్వహిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బుధవారం సంక్షేమ భవన్ లో బీసీ సంక్షేమశాఖ ప్రిన్షిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంతో కలిసి నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. టీఎస్సీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1,2,3,4 తో పాటు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నియామకం చేసే పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై వివిద రకాల ఇతర ఉద్యోగాలకు పోస్టుల వారీగా కోచింగ్ సదుపాయాన్ని అందజేస్తామన్నారు.

బీసీ సంక్షేమ శాఖ రాష్ట్రంలో నిర్వహిస్తున్న 11 స్టడీ సర్కిళ్లతో పాటు మరో ఐదు స్టడీ సర్కిళ్లు సిరిసిల్ల, సూర్యాపేట, వనపర్తి, నర్సంపేట్, జగిత్యాలలో కూడా స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసి, వాటి  ద్వారా కోచింగ్ అందజేస్తామన్నారు.. అదే విదంగా స్టడీ సర్కిళ్లు లేని ప్రతీ నియోజకవర్గంలో స్టడీ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఒక రీడింగ్ రూమ్, ఆన్లైన్ క్లాస్ రూం,  ప్యాకల్టీతో కూడిన డౌట్ క్లియరెన్స్ రూం ఇలా మూడు రూములతో కూడిన  103 స్టడీ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఉచితంగా మౌలిక వసతుల కల్పన, ఇతర ఏర్పాట్లు ఎవరైనా ప్రజాప్రతినిధులు, ఎన్జీవోలు ఏర్పాటు చేస్తే అక్కడ సైతం బీసీ స్టడీ సెంటర్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు..  వీటి ద్వారా కోచింగ్ తో పాటు నాణ్యమైన స్టడీ మెటీరియల్ని అభ్యర్థులకు అందజేస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. 16 బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా 25,000 మందికి నేరుగా, మరో 50,000 వేల మందికి హైబ్రిడ్ మాడల్లో ఆన్ లైన్, ఆఫ్ లైన్ మోడ్ లో శిక్షణ ఇస్తామని, అలాగే 103 బీసీ స్టడీ సెంటర్ల ద్వారా ఒక్కో దాంట్లో 500 మందికి తగ్గకుండా మరో 50,000 మందికి మొత్తంగా 1,25,000 మందికి నాణ్యమైన శిక్షణ అందిస్తామన్నారు..  ఈ అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసే ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రతిష్టాత్మక ఆన్ అకాడమీతో కొలాబరేషన్ కుదుర్చుకున్నట్టు వెల్లడించారు మంత్రి గంగుల కమలాకర్. బీసీ సంక్షేమ శాఖ అందించే కోచింగ్ లో రిజర్వేషన్లు బీసీలకు 75 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం, ఈబీసీలకు 5 శాతం, మరో ఐదు శాతం మైనారిటీలకు కేటాయిస్తామన్నారు. బీసీ సంక్షేమ శాఖ అందించే ఉద్యోగార్థుల శిక్షణ కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తక్షణమే ప్రారంభించామన్నారు, ఆన్ లైన్ అకాడమీ ద్వారా నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ కు నేటి నుండి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 16 వ తారీఖున ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో  పరీక్ష ఉంటుందని, 10 గంటల వరకు కూడా పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు. ఈ పరీక్ష అభ్యర్థుల సామర్థ్యంతో పాటు వారికి ఏ ఉద్యోగం కోసం కోచింగ్ ఇవ్వాలో సైతం నిర్దారించే విధంగా ఉంటుంది అన్నారు.. మొదటగా నిలిచిన 5 శాతం మందికి గ్రూప్ 1 కోసం సెలక్ట్ చేస్తామని వీరికి మెటీరియల్ తో  కూడిన స్టయిఫండ్ అందజేస్తామన్నారు. మిగతా వారిని మెరిట్ బేస్ లో  గ్రూప్ 2, ఎస్సై వంటి ఇతర శిక్షణలకు ఎంపిక చేస్తామన్నారు.  

Tags :