మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌..

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌..


- హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించిన సీఐడీ పోలీసులు..
 - టెన్త్‌ లీకేజ్‌ వ్యవహారంలో అరెస్ట్‌ చేసినట్లు సమాచారం.. 
- నారాయ‌ణ స‌తీమ‌ణిని అరెస్ట్ చేయ‌లేదు.. 
- ఇప్ప‌టికే ఏడుగురిని అరెస్ట్ చేశాం.. 
- విద్యా సంస్థ‌ల చైర్మ‌న్‌గా నారాయ‌ణ ఉన్నారా? లేదా? 
- విచారణలో తేలనున్న నిజం.. 
- దోషిగా తేలితే నారాయ‌ణ‌కు ప‌దేళ్ల జైలు తప్పదు : ఎస్పీ.. 
- తెలంగాణాలోనూ నారాయణ ఫీజుల దోపిడి.. 

హైదరాబాద్, 10 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పి.నారాయణను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన తరుణంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌కు పోలీసులు ముందే రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే, ప్రశ్నా పత్రాల లీకేజీకి నారాయణ విద్యా సంస్థలే కారణమని స్వయానా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ప్రశ్నా పత్రాల లీకేజీ వెనక టీడీపీ కుట్ర ఉందని మండిపడ్డారు.

దీంతో పోలీసులు ప్రశ్నా పత్రాల లీకేజీపై విచారణను తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో తిరుపతిలోని నారాయణ ఎస్వీ బ్రాంచ్‌ నుంచి టెన్త్ పరీక్ష పేపర్లు లీకైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. నారాయణ బ్రాంచ్‌ వైస్‌ ప్రిన్సిపాల్ గిరిధర్‌తో పాటు మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, పోలీసుల విచారణలో నారాయణ పేరును కూడా గిరిధర్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

కాగా కొండాపూర్‌లోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అయితే గత 4 రోజులుగా ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసి నారాయణ అజ్ఞాతంలో ఉన్నారు. ఇదిలా ఉంటే, చిత్తూరు జిల్లాలో నారాయణ స్కూల్‌ నుంచి టెన్త్‌ పేపర్లు లీకైన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఇప్పటికే వైస్‌ ప్రిన్సిపల్‌ గిరిధర్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. మంగళవారం ఉదయం ఏపీ నుంచి హైదరాబాద్‌ వచ్చిన సీఐడీ అధికారులు కొండాపూర్‌లోని నివాసంలో నారాయణను అదుపులోకి తీసుకుని విచారించారు.. నారాయణను ఆయన సొంతకారులోనే ఏపీకి తరలించారు.. మరోవైపు టోల్‌గేట్‌ దగ్గరికి పెద్ద ఎత్తున నారాయణ విద్యాసంస్థల సిబ్బంది చేరుకున్నారు.  ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమై నప్పట్నుంచీ లీకుల బెడద ఎక్కువైన సంగతి తెలిసిందే. అయితే ఈ లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల పాత్ర కూడా ఉందని గత కొన్ని రోజలుగా పెద్ద ఎత్తున ఆరోపణలు, వార్తలు వస్తున్నాయి. ఆయన నారాయణ విద్యాసంస్థల చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలోనే నారాయణను అదుపులోకి తీసుకున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. మరోవైపు.. రాజధాని అసైన్డ్‌ భూముల కేసులో విషయంలోనూ గతంలో నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో నెల్లూరులోని నారాయణ నివాసంలోనూ సీఐడీ సోదాలు చేసింది. ఇదిలావుంటే తిరుపతిలోని నారాయణ ఎస్వీ బ్రాంచ్‌ నుంచి తెలుగు ప్రశ్నాపత్రం లీకైనట్లు పోలీసులు గుర్తించారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఉదయం 9:57 గంటలకు వాట్సాప్‌లో తెలుగు పేపర్‌ వైరల్‌ అయింది. నారాయణ విద్యాసంస్థలో పని చేస్తున్న గిరిధర్‌ వాట్సాప్‌ నుంచి తెలుగు ప్రశ్నాపత్రం లీకైనట్లు పోలీసులు నిర్దారించారు. ఈ కేసులో ఇప్పటికీ గిరిధర్‌తో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కాగా ఏపీలో పదో తరగతి పరీక్షల మాల్ ప్రాక్టీస్ లో పక్కా ఆధారాలు దొరకడం వల్లే నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణను అరెస్టు చేశామని చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ప్రకటించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు పేపర్ మాల్ ప్రాక్టీస్ కు గురైందన్న ఫిర్యాదులు రావడంతో అలర్టయి కేసు దర్యాప్తు చేపట్టగా.. టెక్నికల్ ఎవిడెన్స్ దొరకడంతో కొందరిని అరెస్టు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. పట్టుపడిన వారిని విచారించగా నారాయణ విద్యా సంస్థల బ్రాంచ్ డీన్ బాలగంగాధర తిలక్ ను అరెస్టు చేశామని.. ఆయనతోపాటు.. నారాయణకు కూడా సంబంధాలున్నట్లు ఆధారాలు దొరకడంతో ఇవాళ ఉదయం హైదరాబాద్ కు వెళ్లి అదుపులోకి తీసుకుని చిత్తూరుకు తీసుకొచ్చామన్నారు.  మీడియాలో రకరకాల కథనాలు ప్రసారం జరుగుతున్న నేపథ్యంలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ కేసులోనే నారాయణను అరెస్టు చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ప్రకటించారు. నిందితులపై ఐపీసీ 408, 409 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. మాల్ ప్రాక్టీస్ గురించి ఫిర్యాదులు రావడంతో అప్రమత్తం కావడంతో పథకం ప్రకారం జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. గత నెలలో తెలుగు ప్రశ్నాపత్రం లీకేజీ అయినట్లు ఫిర్యాదులు రావడంతో నిఘా పెట్టగా నిజమేనని తేలిందన్నారు. పరీక్షా కేంద్రాల్లో నిర్వాహకుల గురించి ముందే సమాచారం తెలుసుకుని.. సెంటర్లో పనిచేస్తున్న వారిలో వాటర్ బాయ్ మొదలు.. ఇతర సహాయకులను.. వారి ద్వారా మిగతా వారిని లొంగదీసుకుని నిరాటంకంగా మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్నట్లు తేలిందన్నారు. ముందుగా వచ్చిన ఫిర్యాదు ఆధారంగా కొందరిని అదుపులోకి తీసుకుని విచారించగా.. డొంకంతా కదలిందన్నారు. 
తమ వద్ద చదువుకునే విద్యార్థులను రెండు కేటగిరీలుగా విభజించి.. మాల్ ప్రాక్టీస్ కు పాల్పడినట్లు గుర్తించామన్నారు.  బాగా చదివే వారిని ఒక కేటగిరి.. అంతగా చదవని వారిని మరో కేటగిరి కింద విభజించి వారికి మాల్ ప్రాక్టీస్ చేయిస్తున్నారని తెలిపారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ పేపర్ లీకేజీ అయ్యాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో పకడ్బందీగా విచారణ జరిపామని.. సెక్షన్ 408, 409 ప్రకారం పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసు వర్గాల కథనం. 

తిరుపతి డీన్ బాలగంగాధర్ నిఅరెస్టు చేశాం :
నారాయణ అరెస్టుకు టెక్నికల్ ఎవిడెన్స్ ఉందని, తిరుపతి నారాయణ బ్రాంచ్ లు డీన్ బాల గంగాధర్ ను అరెస్టు చేశామని చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. ర్యాంకుల కోసమే మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. తమ విద్యార్థులు ఎక్కడెక్కడున్నారో ముందు తెలుసుకుంటారని.. అడ్మిషన్లు పెంచుకునేందుకే మాల్ ప్రాక్టీస్ కు పాల్పడినట్లు గుర్తించామన్నారు. పరీక్ష మొదలైన వెంటనే ప్రశ్నాపత్రాన్ని బయటకు పంపిస్తారని, హెడ్ ఆఫీసులో వెంటనే కీ తయారు చేసి విద్యార్థులకు పంపిస్తారన్నారు. జవాబు పత్రాన్ని లోపలికి పంపడానికి వాటర్ బాయ్స్ లేదా.. ఇతరులు ఎవరైతే లొంగుతారో.. అలాంటే వారిని వాడుకున్నట్లు గుర్తించామన్నారు. ఈసారి ముందే అలర్ట్ కావడంతో మాల్ ప్రాక్టీస్ బయటపడిందిని చిత్తూరు జిల్లా ఎస్పీ వివరించారు.

Tags :