ఆఫ్గనిస్తాన్ లో భారీ భూకంపం..

ఆఫ్గనిస్తాన్ లో భారీ భూకంపం..


- తీరని విషాదాన్ని నింపిన పెను ప్రమాదం.. 
- దాదాపు 1000 మంది దాకా మృతి.. 
- 600 మందికి పైగా గాయాలు.. 
- మృతులు పెరిగే అవ‌కావం ఉంది..
- తెల్లవారు ఝాము కావడంతో భారీ ప్రాణనష్టం..
- కొనసాగుతున్న సహాయక చర్యలు.. 
- భూకంప కేంద్రంగా పక్టికా ప్రావిన్స్..  

ఆఫ్ఘనిస్తాన్, 22 జూన్ :
అఫ్ఘానిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.1గా నమోదైంది. తెల్ల‌వారు జాము వచ్చిన భూకంపంతో దాదాపు 1000మందికి పైగా చనిపోయినట్లు స్థానిక అధికారులు అంటున్నారు. మరో 600 మందికి పైగా గాయాలైనట్లు తెలిసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. గాయపడ్డ వారికి హాస్పిటల్స్ లో ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. తెల్లవారుజామున భూకంపం రావడంతో నిద్రలోనే చాలా మంది చనిపోయారు. ఇండ్ల పైకప్పులు కూలడంతో మృతుల సంఖ్య పెరిగిందంటున్నారు. పక్టికా ప్రావిన్స్ భూకంప కేంద్రంగా ఉంది. బర్మాలా, జిరుక్, నాకా, గయన్ జిల్లాల్లో భూకంప తీవ్రత ఎక్కువగా కనిపించింది.

వందలాది ఇళ్లు నేలమట్టం :
ఈ ప్రమాదంలో వందలాది ఇళ్ళు నేలమట్టం అయ్యాయి.. హెలికాప్టర్‌ ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం సంభవించిన ప్రాతం మారుమూల పర్వత ప్రదేశం కావడంతో సమాచార లోపం నెలకొంది. దీంతో సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది. భూకంపం ధాటికి వందలాది ఇళ్లు, ఇతర భవనాలు నేలమట్టమయ్యాయి. కొండ చరియలు విరిగిపడటంతో చాలా మంది శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, భూకంప కేంద్రం ఆఫ్గనిస్తాన్‌లోని ఖోస్ట్ నగరానికి 44 కిమీ (27 మైళ్ళు) దూరంలో 51 కిమీ లోతులో సంభవించింది. భూకంపం కారణంగా తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం చోటుచేసుకుంది. ఖోస్ట్ ప్రావిన్స్‌లో కూడా అనేక భవనాలు దెబ్బతిన్నాయి. భారీ తీవ్రతతో వచ్చిన ప్రకంపనలు పాక్‌లోని లాహోర్‌, ముల్తాన్‌, క్వెట్టా వరకు విస్తరించాయి. పాక్టికా ప్రావిన్స్‌ పాకిస్థాన్‌ సరిహద్దు సమీపంలో ఉంది. దీంతో పొరుగుదేశం పాకిస్థాన్‌లోనూ భూకంపం సంభవించింది. అయితే ఇక్కడ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు

సాయం చేయండి :
తమకు అంతర్జాతీయ సాయం కావాలని తాలిబన్లు ప్రపంచ దేశాలను అభ్యర్థిస్తున్నాయి. ‘తీవ్రమైన భూకంపం పాక్టికా ప్రావిన్స్‌లోని నాలుగు జిల్లాలను కదిలించింది. వందలాది మంది మరణించారు. గాయపడ్డారు. చాలా ఇళ్ళు ధ్వంసమయ్యాయి’ అని  తాలిబాన్ ప్రభుత్వ డిప్యూటీ ప్రతినిధి బిలాల్ కరీమి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సహాయక చర్యల కోసం ఆ ప్రాంతానికి బృందాలను పంపామని తెలిపారు. కాగా తాలిబన్ల ఆక్రమణతో ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్లాడుతున్న అఫ్గన్‌ ప్రజలను ఈ భూకంపం మరింత దీనస్థితిలోకి నెట్టివేసింది. 

పాక్ సరిహద్దుల్లో సైతం :
ఆఫ్ఘనిస్తాన్ ఆగ్నేయదిశలో ఉన్న పక్టికా ప్రావిన్స్‌లో భూకంపం సంభవించంది. పాకిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉంటుందీ ప్రాంతం. ఈ ప్రావిన్స్ రాజధాని ఖోస్ట్‌ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న గయాన్ జిల్లాను భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యూఎస్ జియాలాజికల్ సర్వే తెలిపింది. ఉపరితలం నుంచి సుమారు 51 కిలోమీటర్ల లోతున చోటు చేసుకున్న భూఫలకాల కదలికల వల్ల ఈ ప్రకంపనలు సంభవించినట్లు పేర్కొంది.

Tags :