దేశ సార్వభౌమత్వానికీ ముప్పు..

దేశ సార్వభౌమత్వానికీ ముప్పు..

- క్రిప్టో కరెన్సీ వల్ల ఎంతో నష్టం..  

ఆర్‌బీఐ న్యూఢిల్లీ, 16 మే  : 
క్రిప్టోకరెన్సీలపై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మరోసారి తన భయాలు వ్యక్తం చేసింది. డాలర్లలో జరిగే వీటి లావాదేవీలు భారత ఆర్థిక వ్యవస్థలో కొంతభాగాన్ని డాలరీకరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇంకా ద్రవ్య చలామణిని దెబ్బతీయడం ద్వారా ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధానాలకు కూడా ముప్పుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక శాఖ మాజీ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా నేతృత్వంలోని పార్లమెంట్‌ స్థాయీ సంఘం సభ్యుల ముందు, ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌, ఇతర ఉన్నతాధికారులు ఈ విషయాలు స్పష్టం చేశారు. క్రిప్టోకరెన్సీలతో దేశ సార్వభౌమత్వానికి కూడా ముప్పు అని పేర్కొన్నారు. 
బ్యాంకింగ్‌ వ్యవస్థకూ ముప్పే: క్రిప్టోకరెన్సీలతో దేశ బ్యాంకింగ్‌ రంగానికీ ముప్పు తప్పదని ఆర్‌బీఐ హెచ్చరించింది. వీటి ఆకర్షణలో పడి ప్రజలు తమ కష్టార్జితాన్ని వీటిల్లో మదుపు చేస్తే.. అప్పులిచ్చేందుకు దేశీయ బ్యాంకుల వద్ద చాలినన్ని నిధులూ ఉండవని స్పష్టం చేసింది. వీటికి తోడు ఈ కరెన్సీలు ఉగ్రవాదులకు ఆర్థిక వనరుగా, అక్రమ నగదు లావాదేవీలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సాధనాలుగా మారే ప్రమాదం కూడా ఉందని పార్లమెంట్‌ స్థాయీ సంఘ సభ్యులకు తెలిపారు. వీటిని అనుమతిస్తే దేశ ఆర్థిక స్థిరత్వానికీ పెద్ద ముప్పు తప్పదని ఆర్‌బీఐ ఉన్నతాధికారులు హెచ్చరించారు.

Tags :