నేటినుంచి ఇంటర్ పరీక్షలు..

- ఏర్పాట్లు పూర్తి చేసిన ఇంటర్ బోర్డు..
- పరీక్ష రాయనున్న 9.07 లక్షలమంది విద్యార్థులు..
- ఇంటర్ సెకండియర్‌లో ఇంప్రూవ్మెంట్..
హైదరాబాద్, 05 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షలకు రంగం సిద్దం అయ్యింది. నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. హాల్ టిక్కెట్లను నేరుగా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వెసలుబాటు కల్పించారు. దాదాపు రెండేళ్ల కరోనా విరామం తరవాత ఇప్పుడు విద్యార్థులు మళ్లీ పరీక్షల బాట పట్టారు. కరోనాతో 2020, 2021 సంవత్సరాల్లో ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించలేదు. ప్రస్తుతం ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులంతా ఎస్సెస్సీ పరీక్షలు రాయకుండా నే పై తరగతులకు ప్రమోట్ అయ్యారు. ఈ నేపథ్యంలో 70 శాతం సిలబస్‌ను అమలుచేయడమే కాకుండా అధికారులు ప్రశ్నల్లో చాయిస్ శాతాన్ని కూడా గణనీయంగా పెంచారు. మొత్తం 9.07 లక్షల విద్యార్థులు పరీక్షలకు హాజరు కాబోతున్నారు. వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 1,443 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్ బోర్డు చరిత్రలోనే తొలిసారిగా ఫస్టియర్ పేపర్లకు సెకండియర్‌లో ఇంప్రూవ్మెంట్ రాసుకొనే అవకాశం కల్పించారు. దేనిలో ఎక్కువ మార్కులు వస్తే వాటినే పరిగణనలోకి తీసుకుంటారు. ఇది ఈ ఒక్క ఏడాదికే నని అధికారులు స్పష్టంచేశారు. సాధారణంగా ఇంటర్ ఫస్టియర్ పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాత అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో మాత్రమే ఇంప్రూవ్మెంట్ రాసుకొనే అవకాశం ఉన్నది. ఆ తర్వాత ఏదైనా పరీక్ష రాస్తే, ఆ పరీక్షల్లో వచ్చిన మార్కులనే లెక్కలోకి తీసుకొంటున్నారు. ఒకవేళ ఫెయిల్ అయితే అంతే. కానీ, ఈసారి మాత్రం ఇంప్రూవ్‌మెంట్‌గా పరిగణించి, ఎక్కువ వచ్చిన మార్కులతో మెమోలు జారీ చేస్తారు. గత ఏడాది జరిగిన ఫస్టియర్ పరీక్షల్లో 51 శాతం విద్యార్థులు ఫెయిలయ్యారు. వారికి 35 శాతం మార్కులేసి పాస్‌చేశారు. సెకండియర్ పరీక్షల సమయంలో ఇంప్రూవ్మెంట్ రాసుకొనే అవకాశమిస్తామని ప్రకటించిన అధికారులు.. దానిని ఇప్పుడు అమలుచేస్తున్నారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు మొదటిసారిగా పబ్లిక్ పరీక్షలకు హాజరు కాబోతున్నారు. వికలాంగులకు ఇస్తున్న అరగంట అదనపు సమయాన్ని గంటకు పెంచే అవకాశాలున్నాయి. దివ్యాంగులకు ఇచ్చే అదనపు సమయాన్ని కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వశాఖ గతంలోనే గంటకు పెంచింది. గంట పరీక్ష సమయానికి 20 నిమిషాలకు తగ్గకుండా అదనపు సమయాన్ని ఇవ్వాలని, 3గంటల పరీక్షకు 60 నిమిషాల అదనపు సమయం ఇవ్వాలని మెమో జారీచేసింది. దీనిని పరిగణనలోకి తీసుకొని 3 గంటల ఇంటర్ పరీక్షకు గంట అదనపు సమయం ఇవ్వాలని పలువురు ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇకపోతే పరీక్షలను దృష్టిలో పెట్టుకుని అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. పోలీస్ బందోబస్తుతో పాటు, కరోనా జాగ్రత్తలు తీసుకున్నారు.