Thursday, March 28, 2024

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు రైతుల పాలిట శత్రువులు

తప్పక చదవండి
  • స్వామినాథన్‌ కమిషన్‌ నివేదిక బుట్టదాఖలు
  • మోటర్లకు మీటర్లు పెట్టాలన్నది బిజెపి పాలసీ
  • కాంగ్రెస్‌ను గెలిపించినా మోటర్లకు మీటర్లు తప్పవు
  • మీడియా సమావేశంలో హరీష్‌ రావు విమర్శలు

సిద్దిపేట : బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు రైతుల పాలిట శత్రువులని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ యూపీఏ హయాంలో కేంద్రానికి ఒక నివేదిక సమర్పించారని, కాంగ్రెస్‌ గానీ, బీజేపీ గానీ ఆ నివేదికను ఇప్పటికే అమలు చేయలేదని ఆయన విమర్శించారు. సిద్దిపేటలో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు మోటార్లకు మీటర్లు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి చేసిందని, మీటర్లు పెట్టకపోతే రాష్టాన్రికి రావాల్సిన నిధులకు కోత పెడుతామని బెదిరించిందని, అయినా గూడా మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని సీఎం కేసీఆర్‌ తెగేసి చెప్పారని మంత్రి వివరించారు. దేశంలో మోటార్లకు మీటర్లు పెట్టని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. మోటార్లకు మీటర్లు పెట్టనందుకు గత ఐదేళ్లలో రాష్టాన్రికి రావాల్సిన నిధుల్లో రూ.25 వేల కోట్ల నష్టం చేసిన బీజేపీకి ఓట్లడిగే అర్హతే లేదని అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టమని బీజేపీ సర్కారు ఒత్తిడి చేసిందని మేము చెబుతుంటే.. లేదు లేదు తమ ప్రభుత్వం ఆ మాటే అనలేదని తెలంగాణ బీజేపీ నేతలు అదరగొట్టిండ్రని చెప్పారు. మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలతో నిజమేదో అబద్ధమేదో తేలిపోయిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కూడా మోటార్లకు మీటర్లు పెడుతున్నయని చెప్పి నిర్మలా సీతారామన్‌ పుణ్యం కట్టుకున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ రైతుల పక్షపాతి అని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉన్న రాష్టాల్లో కూడా మోటార్లకు మీటర్లు పెట్టారని, ఒకవేళ కాంగ్రెస్‌ గెలిచినా రాష్ట్రంలో రైతుల మోటార్లకు మీటర్లు పెడుతారని అన్నారు. పొరపాటున కూడా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఓటు వేయవద్దని చెప్పారు. మోటార్లకు మీటర్ల విషయమై కేంద్రం నుంచి వచ్చే రూ.25 వేల కోట్ల నిధులు ముఖ్యమా.. రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతుల ప్రయోజనాలు ముఖ్యమా..అనే ప్రశ్న తలెత్తినప్పుడు సీఎం కేసీఆర్‌ రైతుల పక్షాననే నిలిచారని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. మోటార్లకు మీటర్లు పెట్టి రైతులకు 24 గంటల ఉచిత కరెంటు లేకుండా చేయాలనేది బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల కుట్ర అని మంత్రి విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఓటేస్తే 24 ఉచిత కరెంటు ఎత్తేస్తరని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌ దొందూ దొందేనని మంత్రి ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. కేసీఆర్‌ సీఎం అయిన నాడు తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104 ఉంటే, ఇప్పుడు తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,17,117కు చేరింది. బీజేపీ ప్రభుత్వం 100 నెలల్లో 100 లక్షల కోట్ల అప్పుచేసిందని మండిపడ్డారు. నెలకు రూ. లక్ష కోట్ల చొప్పున కేంద్రం అప్పులు తెచ్చిందన్నారు. అయినా బీజేపీ గురివింద రీతిన మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టకపోవడం వల్లనే అదనపు డబ్బులు రాలేదని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్‌ కుండ బద్దలు కొట్టారని, ఇంత కాలం బీజేపీ నాయకులు అబద్దాలతో దబాయించారని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఇప్పుడు తెలంగాణ బీజేపీ నాయకులు ఈ మొకం పెట్టుకుని ఒట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఈ దేశంలో రైతు పక్ష పాతి ఒకే ఒక్కడు కేసీఅర్‌ అని, కాంగ్రెస్‌ బండారం కూడా నిర్మల సీతారామన్‌ బయట పెట్టారన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్టాల్లోన్రూ మీటర్లు పెట్టారని ఆమె చెప్పారన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ లేదా బీజేపీ సర్కారు ఉండి ఉంటే రైతుల మోటర్లకు మీటర్లు, రైతులకు బిల్లులు వచ్చేవని, రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక వంటి కాంగ్రెస్‌ పాలిత రాష్టాల్లో మీటర్లు పెట్టి అదనపు డబ్బులు తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. పొరపాటున తెలంగాణలో కాంగ్రెస్‌ వస్తే రైతులకు మీటర్లు తప్పవని హెచ్చరించారు. గెలిచిన కర్ణాటకలో 5 గంటలు మాత్రమే ఇస్తున్నట్లు డికె శివకుమార్‌ స్పష్టం చేశారని, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు రైతులకు శత్రువులని హరీష్‌రావు అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు