అసోంలో బీభత్సం సృష్టిస్తున్న వరదలు..

అసోంలో బీభత్సం సృష్టిస్తున్న వరదలు..


- చిక్కుకుపోయిన రైళ్లు, ఒక్కోదాంట్లో 1400 మంది ప్రయాణికులు! 
- రోడ్లు, వంతెనలు, కాలువలు ధ్వంసం.. 
- 10321.44 హెక్టార్లలోని పంట నీటిపాలు.. 
- పలు రైళ్లను రద్దు చేసిన రైల్వేశాఖ.. 
- పలు స్టేషన్లలో చిక్కుకుపోయిన ప్రయాణికులు.. 
- రంగంలోకి సైన్యం, వాయుసేన, ఎన్‌డీఆర్ఎఫ్.. 

అసోం, 16 మే : 
ఈశాన్య రాష్ట్రం అసోం వరదలతో అతలాకుతలం అవుతోంది. 15 రెవెన్యూ సర్కిళ్లలోని దాదాపు 222 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. 10321.44 హెక్టార్ల పంట నీట మునిగింది. ఓ చిన్నారి సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. అలాగే, 1,434 జంతువులు కూడా వరద బారినపడ్డాయి. 202 ఇళ్లు ధ్వంసమయ్యాయి. మొత్తంగా 57 వేల మందిపై వరదల ప్రభావం పడింది. రంగంలోకి దిగిన ఆర్మీ, పారా మిలటరీ దళాలు, ఎస్‌డీఆర్ఎఫ్, అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బంది సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. పలు జిల్లాల్లోని రోడ్లు, బ్రిడ్జిలు, కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నిరంతరాయంగా కురుస్తున్న వానలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో రైల్వే ట్రాకులు, వంతెనలు దెబ్బతిన్నాయి. రోడ్డు రవాణా స్తంభించిపోయింది. వరదల నేపథ్యంలో నార్త్‌ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. ఇప్పటికే బయలుదేరిన రెండు రైళ్లు వరదల్లో చిక్కుకున్నాయి. ఒక్కో దాంట్లో 1400 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. 

ఎయిర్‌ఫోర్స్ సాయంతో ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. డిటోక్‌చెర్రా స్టేషన్‌లో 1,245 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. వారిని బదార్‌పూర్, సిల్చర్ రైల్వే స్టేషన్లకు తరలించారు. అలాగే, 119 మంది ప్రయాణికులను భారత వైమానిక దళం సిల్చర్‌కు తరలించింది. చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఆహారం, తాగు నీరు సరఫరా చేస్తున్నట్టు రైల్వేశాఖ పేర్కొంది.

Tags :