రోడ్డు ప్రమాదంలో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మృతి..

ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ (46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. క్విన్స్ లాండ్ లోని టౌన్స్ విల్లేలో శనివారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో సైమండ్స్ చనిపోయాడు. క్వీన్స్ లాండ్ లో శనివారం రాత్రి ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లారు. తీవ్ర గాయాలైన అతడిని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో సైమండ్స్ చికత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
ప్రపంచ క్రికెట్ ప్రేమికులకు మరో దుర్వార్త. ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 46 ఏళ్ల సైమండ్స్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇటీవలే ఆస్ట్రేలియాకు చెందిన స్పిన్ దిగ్గజం షేన్ వార్న్, మాజీ కీపర్ రాడ్నీ మార్ష్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు సైమండ్స్‌ను కూడా కోల్పోవడంతో ఆసీస్ క్రికెట్ విషాదంలో మునిగింది. శనివారం రాత్రి టౌన్స్‌విల్లేకు 50 కి.మీ దూరంలో సైమండ్స్ కారు ప్రమాదానికి గురైంది. ఈ సమయంలో తనొక్కడే ప్రయాణిస్తుండగా, దుర్ఘటనలో తగిలిన గాయాలతోనే కన్నుమూసినట్టు క్వీన్స్లాండ్ పోలీసులు తెలిపారు. ఇది సింగిల్ వెహికల్ ప్రమాదమేనని, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు చెప్పారు.
ఎలైస్ రివర్ బ్రిడ్జికి సమీపంలో కారు రోడ్డుకు ఎడమ వైపునకు దూసుకెళ్లి పల్టీలు కొట్టిందని పోలీసులు ప్రకటించారు. సమాచారం అందిన వెంటనే అతడికి అత్యవసర చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. మరోవైపు సైమండ్స్ మరణ వార్తతో క్రీడాలోకం నివ్వెరపోయింది. 1998లో పాకిస్థాన్‌తో వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఆండ్రూ 2009లో చివరి వన్డే ఆడాడు. అయితే 2012లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. ఐపీఎల్ తొలి సీజన్లో డెక్కన్ చార్జర్స్ అతడిని రూ.5.40 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం విశేషం. ఆ తర్వాత 2011లో చివరిసారిగా ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగాడు.
2000వ దశకంలో ఆస్ట్రేలియా క్రికెట్‌కు ఆండ్రూ సైమండ్స్ అత్యంత కీలక ఆటగాడిగా సేవలందించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో పవర్ హిట్టర్‌గా ఎన్నో మ్యాచ్‌లను ఒంటి చేత్తో గెలిపించాడు. అలాగే తను మీడియం పేస్, స్పిన్ బౌలర్‌గా, సూపర్ ఫీల్డర్‌గానూ రాణించాడు. పలు సందర్భాల్లో వివాదాస్పదుడిగానూ నిలిచాడు. పొట్టి ఫార్మాట్లో అత్యంత తక్కువ బంతుల్లో (34, 2004లో) సెంచరీ బాదిన తొలి ఆటగాడు అతడే. ఆ తర్వాత ఎనిమిదేళ్లకు ఈ ఫీట్‌ను గేల్ (30 బంతుల్లో) అధిగమించగలిగాడు. ఇక 2003, 2007 వన్డే వరల్డ్‌కప్ గెలుచుకున్న ఆసీస్ జట్టులోనూ సైమండ్స్‌ది కీలక పాత్ర. ముఖ్యంగా 2003 టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పాక్‌పై ఆసీస్ 86/4తో కష్టాల్లో ఉన్న సమయంలో ఆండ్రూ 125 బంతుల్లో 143 పరుగులు బాది జట్టును గట్టెక్కించాడు.
సెమీ్‌సలోనూ శ్రీలంకపై 53/3తో ఉన్నప్పుడు సైమండ్స్ 91 నాటౌట్‌తో భారీ స్కోరుకు దోహదపడ్డాడు. ఇక 2008లో సిడ్నీ టెస్టు సందర్భంగా హర్భజన్ తనను కోతితో పోల్చాడని సైమండ్స్ ఆరోపించడం.. ఇది ‘మంకీ గేట్’ వివాదంగా అప్పట్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అంతేకాకుండా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు అతిగా మద్యం తాగి రావడంతో రెండు వన్డేల నిషేధం విధించారు. అలాగే 2008లో టీమ్ సమావేశానికి డుమ్మా కొట్టి డార్విన్‌లో ఫిషింగ్‌కు వెళ్లడంతో అతడిని ఇంటికి పంపేశారు. మరోసారి క్రమశిక్షణ చర్యకింద 2009 టీ20 వరల్డ్‌కప్ జట్టు నుంచి తొలగించడంతో పాటు ఆ తర్వాత అతడి కాంట్రాక్ట్‌ను కూడా రద్దు చేయడంతో అంతర్జాతీయ కెరీర్ ముగిసింది.