లెక్క‌ల్లో బొక్క‌...

లెక్క‌ల్లో బొక్క‌...

 

- న‌గ‌రంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫ్లెక్సీ వార్
- నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీల ఏర్పాటు.. 
- టీఆర్ఎస్ అవన్నీ కమర్షియల్ యాడ్స్.. 
- అనుమతులు లేని చోట్ల ఫ్లెక్సీలు, హోర్డింగులు.. 
- పార్టీల ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ కొరడా...
- బీజేపీకి రూ.20 లక్షలు.. టీఆర్ఎస్‌కు రూ.3 లక్షలు.. 


హైదరాబాద్, 03 జూలై ( ఆదాబ్ హైదరాబాద్ ) :
అదంతా ప్రజల సొమ్ము.. సామాన్యుడు చెమటోడ్చి సంపాదించిన దాంట్లో కొంతమేర పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించిన సొమ్ము.. ఆ డబ్భులు ప్రజల సంక్షేమం కోసం ఖర్చుబెట్టాల్సిన  ప్రభుత్వాలు తమ స్వార్ధ ప్రయోజనాలకోసం ఉపయోగించుకోవడం శోచనీయం.. ఎందుకూ ఉపయోగపడని మీటింగ్ లకు ఆ డబ్భును విచ్చలవిడిగా ఖర్చు పెట్టాయి.. రాజకీయ పార్టీలు.. ఎవరి బలాలు వారు చూపించుకోవడం కోసం ఒకరిని మించి ఒకరు ఖర్చు పెట్టాయి.. చివరికి సామాన్యుడికి మిగిలింది కన్నీళ్లే తప్ప మరింకేమీ లేదు..     

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో టీఆర్ఎస్-బీజేపీల మధ్య రాజకీయం కాక రేపుతోంది. జాతీయ కార్యవర్గ సమావేశాల పేరుతో బీజేపీ, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హాకు మద్దతు తెలుపుతూ టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ నగరం మొత్తాన్ని ఫ్లెక్సీలు, కటౌట్లతో నింపేశారు. నగరంలో అన్ని బస్టాప్‌లు, మెట్రో పిల్లర్లు, భారీ హోర్డింగులన్నీ రెండు పార్టీల ఫ్లెక్సీలతో నిండిపోయాయి. ఈ క్రమంలోనే రెండు పార్టీల నేతలు నిబంధనలు అతిక్రమించి మరీ కటౌట్లు, హోర్డింగులు ఏర్పాటు చేయడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్  అధికారులు కొరడా ఝళిపించారు. నగరవ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను గమనించిన జీహెచ్‌ఎంసీకి చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్ (ఈవీడీఎం) డైరెక్టరేట్‌ అధికారులు రెండు పార్టీల నేతలకు జరిమానా విధించారు. శనివారం సాయంత్రం వరకూ బీజేపీ నేతలకు రూ.20 లక్షలు, టీఆర్ఎస్‌ నాయకులకు రూ.3 లక్షల మేర జరిమానాలు విధించినట్లు తెలిపారు. నగరవ్యాప్తంగా మెట్రో రైలు స్తంభాలపై రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రచార ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. అయితే దిల్‌సుఖ్‌నగర్ సమీపంలోని చైతన్యపురి ప్రాంతంలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై బీజేపీ నేతలు సికింద్రాబాద్‌లో ఆదివారం నిర్వహించే విజయ సంకల్ప సభ ఫ్లెక్సీలను అతికించడం గమనార్హం. మొత్తానికి రెండు పార్టీల మధ్య కొనసాగుతున్న రాజకీయ యుద్ధం నగరంలో వేడి పుట్టిస్తోందనడంతో సందేహం లేదు.

అయితే.. ఎట్టకేలకు జీహెచ్‌ఎంసీ అధికారులు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు జరిమానాలు విధించింది. కానీ.. లెక్కలో చాలా తేడా కనిపించింది. బీజేపీ ఏ స్థాయిలో ఫ్లెక్సీలు కట్టిందో పోటీకి టీఆర్ఎస్ కూడా అదే చేసిందనే విమర్శలు ఉన్నాయి. కానీ.. జీహెచ్ఎంసీ మాత్రం బీజేపీ నేతలకు రూ.20 లక్షలు, టీఆర్ఎస్‌ నాయకులకు రూ.3 లక్షల మేర ఫైన్ విధించింది. ఈ లెక్క ఆదివారం తర్వాత ఇంకా పెరుగుతుందని వార్తలు వస్తున్నాయి. టీఆర్ఎస్ నిబంధనలు పాటించకపోయినా.. ఫైన్ల విషయంలో చూసీ చూడనట్లు ఉన్నారనే విమర్శలు బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

Tags :