60కి.మీ లోపు ఒక్కటే టోల్ ప్లాజా

60కి.మీ లోపు  ఒక్కటే టోల్ ప్లాజా

టోల్ ప్లాజాకు 60 కిలోమీటర్ల లోపు ఉండే ఇతర అన్ని టోల్ ప్లాజాలను మూడు నెలల్లో మూసివేస్తామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 2022-23కి గాను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు నిధుల డిమాండ్పై సమాధానమిస్తూ లోక్సభలో ఈ మేరకు ప్రకటించారు. నిబంధనల ప్రకారం జాతీయ రహదారులపై 60 కిలోమీటర్ల లోపు రెండు టోల్ గేట్లు ఉండకూడదని అన్నారు. అయితే ప్రస్తుతం కొన్ని టోల్ బూత్లు పని చేస్తున్నాయని చెప్పారు. ఇలాంటి అక్రమ టోల్ పాయింట్లను త్వరలో మూసివేస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు. 'జరుగుతున్నది తప్పు. ఇది చట్టవిరుద్ధం. రాబోయే మూడు నెలల్లో 60 కిలోమీటర్ల లోపు ఒకే ఒక్క టోల్ కలెక్షన్ పాయింట్ ఉంటుంది. రెండవది ఉంటే మేం దానిని మూసివేస్తామని నేను హామీ ఇస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వానికి డబ్బులు రావడం కోసం, ప్రజలు బాధపడకూడదు' అని అన్నారు. అలాగే టోల్ ప్లాజాల సమీపంలో నివసించే ప్రజలు తమ ఆధార్ కార్డును చూపించి టోల్ పాస్ పొందవచ్చని తెలిపారు. మరోవైపు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయం మంగళవారం పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో 60 కిలోమీటర్ల లోపు ఎక్కువ సంఖ్యలో ఉన్న టోల్ గేట్ల గురించి నెటిజన్లు ప్రస్తావించారు. జాతీయ రహదారి 66పై తాలపాడు, కుందాపుర మధ్య 90 కిలోమీటర్ల లోపు మూడు టోల్ ప్లాజాలు ఉన్నాయని ఒకరు పేర్కొన్నారు. అలాగే నగరాలకు సమీపంలోని టోల్ గేట్లు చాలా తక్కువ దూరంలోనే ఉంటున్నాయని, ఆయా ప్రాంతంలోని నివాసితులు అన్ని టోల్ ప్లాజాల నుంచి పాసులను పొందాల్సి ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మరొకరు వెల్లడించారు.

Tags :