19 వరోజు భీకర యుద్ధం..

19 వరోజు భీకర యుద్ధం..

కీవ్, 14 మార్చి : ఉక్రెయిన్, రష్యా మధ్య 19 రోజులగా భీకర యుద్ధం సాగుతోంది.  కీవ్‌‌‌‌ సహా ఉక్రెయిన్‌‌‌‌లోని కీలక నగరాలన్నింటిపైనా రష్యన్ బలగాలు దాడులు చేస్తున్నాయి. ఇప్పుడు ఒకడుగు ముందుకు వేసి నాటో సభ్య దేశాల సరిహద్దుల్లోనూ బాంబులు వేస్తున్నాయి. పోలండ్ బార్డర్‌‌‌‌‌‌‌‌కు దగ్గర్లోని ల్వీవ్ సిటీ మిలిటరీ బేస్‌‌‌‌పై.. స్లొవేకియా, హంగరీ బార్డర్లలోని ఇవానో ఫ్రాంకివిస్క్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుపై అటాక్స్ చేసింది రష్యా. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌‌‌‌కు దగ్గరగా వచ్చిన రష్యన్ సైనిక బలగాలు.. ఆ సిటీని ట్యాంకులతో అన్ని వైపుల నుంచి చుట్టుముడుతున్నాయి. తమ పట్టును ప్రదర్శించేందుకు ఒక్కో సిటీని ఆక్రమించి.. అక్కడి మేయర్లను రష్యా తమ చెరలో బంధిస్తోంది. ‘ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ పీస్‌‌‌‌కీపింగ్, సెక్యూరిటీ’గా పిలిచే యవోరివ్ మిలిటరీ కాంప్లెక్స్‌‌‌‌పైనా రష్యా దాడులు చేసింది.  ఇప్పటికైనా ఉక్రెయిన్‌‌‌‌ను నో ఫ్లై జోన్‌‌‌‌గా ప్రకటించాలని ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ కోరుతున్నారు. ఆ దేశంలో క్షణ క్షణం పరిస్థితులు మారిపోతున్న నేపథ్యంలో కీవ్ లోని ఇండియన్ ఎంబసీని తాత్కాలికంగా పోలాండ్ కు తరలిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు రష్యా ఎంత ప్రయత్నించినా తమ రాజధాని నగరాన్ని కైవసం చేసుకోలేదని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ చెప్పారు. ఉక్రెయిన్ లో చివరి పౌరుడిలో ప్రాణం ఉన్నంత వరకూ దేశం కోసం పోరాటం సాగుతూనే ఉంటుందని, కీవ్ ను పూర్తిగా నేల మట్టం చేసి, అందరి ప్రాణాలు తీసిన తర్వాతే ఈ సిటీ రష్యాకు దక్కుతుందని అన్నారు. కాకపోతే ఇక్కడ మిగిలేది దురాక్రమణకు వచ్చే రష్యన్లు మాత్రమేనని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ దేశాన్ని ఆక్రమించుకునేందుకు యుద్ధం మొదలుపెట్టిన రష్యా విచక్షణా రహితంగా క్షిపణులు, బాంబు దాడులను ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు ముఖ్య నగరాలు స్వాధీనం చేసుకున్న రష్యా సేనలు దేశ రాజధాని కీవ్ పై ముప్పేట దాడులు చేస్తోంది. అలాగే మేరియుపోల్ నగరంలో నివాస భవనాలపై జరిపిన దాడుల్లో మృతుల సంఖ్య 2500కు చేరిందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కుబేలా ప్రకటించారు. 

కాగా ఓ వైపు చర్చలు అంటూనే రష్యా దండయాత్ర సాగిస్తోంది. ఇప్పటికే మూడు దఫాలుగా చర్చలు జరిగినా సానుకూల ఫలితం రాలేదు. యుద్ధ భూమి నుంచి విదేశీయులు, ఉక్రెయిన్ పౌరులు సేఫ్‌గా బయటపడేందుకు హ్యుమానిటేరియన్ కారిడార్లు ఏర్పాటు చేయడం, ఆయా సమయాల్లో కాల్పుల విరమణ పాటించడం మినహా సాధించిందేమీ లేదు. ఈ క్రమంలో ఇవాళ మరోసారి రెండు దేశాలు చర్చలకు సిద్ధమయ్యాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉక్రెయిన్, రష్యా ప్రతినిధులు సమావేశం కానున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ చర్చలు జరగనున్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారని రష్యన్ వార్తా సంస్థ సుత్నిక్ పేర్కొంది. రష్యా సేనలకు రాజధాని కీవ్ లో ఉక్రెయిన్ ఆర్మీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. తమ రాజధాని నగరాన్ని కాపాడుకునేందుకు సామాన్య పౌరులు సైతం ఆయుధాలు చేతపట్టి పోరాడుతున్నారు. ఎంతగా శ్రమిస్తున్నా.. కీవ్ ను రష్యా తమ చేతిలోకి తెచ్చుకోలేకపోతోంది. అమెరికా, నాటో దేశాల నుంచి మిస్సైల్స్, ఇతర ఆయుధాలు అందుతుండడంతో వెనక్కి తగ్గేదేలేదంటూ ఉక్రెయిన్ పోరాటం సాగిస్తోంది. ఈ క్రమంలో రష్యా కూడా ఆయుధ సాయం కోసం ప్రయత్నిస్తోందని అమెరికా అధికారి ఒకరు చెబుతున్నారు. చైనా నుంచి మిలిటరీ ఎక్యూప్ మెంట్ సాయంగా కోరినట్లు తెలిపారు.

Tags :