28 ఏళ్ల తర్వాత మార్చిలో వాయుగుండం..

28 ఏళ్ల తర్వాత మార్చిలో వాయుగుండం..

అమరావతి, 06 మార్చి ( ఆదాబ్ హైదరాబాద్ ) : నైరుతి, ఈశాన్య రుతుపవనాల సీజనులోను, ఈ సీజన్లకు ముందు, తర్వాత అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాన్లు ఏర్పడడం సర్వసాధారణం. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు నైరుతి, అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపుతాయి. అలాగే, నైరుతి రుతు పవనాల సీజనుకు ముందు ప్రారంభమయ్యే ప్రీ మాన్సూన్‌ సీజను (ఏప్రిల్, మే)లోను, ఈశాన్య రుతుపవనాలు ముగిసే పోస్ట్‌ మాన్సూన్‌ సీజనుగా పేర్కొనే జనవరిలోనూ అడపాదడపా వాయుగుండాలు, తుపాన్లు సంభవిస్తాయి. కానీ, మార్చి ఆరంభంలోనే అల్పపీడనం, వాయుగుండం వంటివి ఏర్పడడం అరుదైన విషయమే. ఇలాంటి ప్రత్యేకత సంతరించుకునేలా ఈనెల 2న దక్షిణ మధ్య బంగాళాఖాతం, భూమధ్య రేఖ ప్రాంత హిందూ మహా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది.
ఇది 24 గంటల్లో గురువారం నాటికి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి వాయుగుండంగా బలపడింది. ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగానూ మారనుంది. ఇటీవల కాలంలో మార్చి ఆరంభంలో ఇలాంటివి ఏర్పడిన దాఖలాల్లేవు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వద్ద ఉన్న సమాచారం ప్రకారం 1994 మార్చి 21న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఆపై వాయుగుండంగా మారింది. ఆ తర్వాత అంటే గత 28 ఏళ్లలో ఇప్పటివరకు మార్చిలో అల్పపీడనం గాని, వాయుగుండంగానీ ఏర్పడిన పరిస్థితిలేదు. ప్రస్తుతం బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటాన్ని వాతావరణ నిపుణులు అరుదైనదిగా పేర్కొంటున్నారు.  
ఇక సాధారణంగా ఏప్రిల్‌ నుంచి సముద్ర ఉపరితల జలాలు వేడెక్కుతుంటాయి. ఫలితంగా అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడటానికి దోహదపడతాయి. ప్రస్తుతం పసిఫిక్‌ మహా సముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణంకంటే అధికంగా నమోదవుతున్నాయి. ఇవి నైరుతి రుతుపవనాల సీజనులో మంచి వర్షాలు కురవడానికి సానుకూల సంకేతంగా భావిస్తారు. వీటిని లానినా పరిస్థితులుగా పేర్కొంటారు. ప్రస్తుతం పసిఫిక్‌ మహా సముద్రంలో లానినా పరిస్థితులుండడమే అకాల అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా బలపడటానికి ఒక కారణమని వాతావరణ శాఖ రిటైర్డ్‌ అధికారి ఆర్‌.మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరాన్ని తాకి రీకర్వ్‌ అయ్యే అవకాశం కూడా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భూమధ్య రేఖకు సమీపంలో ఏర్పడే వాయుగుండాలు తుపానుగా బలపడే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. మార్చి ఆరంభంలోనే బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడం అరుదైన పరిణామమని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు.   

Tags :